అర్థాంగి (చిట్టి కథ)
ఫోన్ మ్రోగింది. నా గుండెలో రాయి పడింది. స్పందించినా చికాకే... స్పందించక పోయినా చికాకే. ఏం చెయ్యను?
ఫోన్ రెండో సారి మ్రోగింది. ఆగింది. మూడోసారి స్పందించకపోతే ఆబ్సెంట్ మార్క్ చేస్తారు. రైల్వే రన్నింగ్ స్టాఫ్ కదా. గార్డుగా ఉద్యోగిస్తున్నాను. ఈ రోజు ఆరు రోజుల డ్యూటీ తర్వాత పీరియాడికల్ రెస్ట్ మార్క్ చేసే అర్హత కలిగింది . శ్రీమతి పుట్టిన రోజు. కలిసి సినిమాకి వెళ్దామనుకుంటే...ఫోన్.
మూడో ఫోన్ కాల్ కి స్పందించాను.
" హలో "
" సాయంత్రం ఐదు గంటల గూడ్స్ ట్రైన్ కి మీరు రిపోర్ట్ చెయ్యాలి "
" ఈ రోజు శ్రీమతి పుట్టిన రోజు సోదరా "
" రోస్టర్ షార్ట్ అయింది. ట్రైన్ మూవ్మెంట్ ఎక్కువగా ఉంది. తప్పనిసరిగా ఆన్సర్ చెయ్యాలి"
శ్రీమతి వైపు చూసాను. నవ్వుతూ నా దగ్గరికి వచ్చింది.
" ఫర్వాలేదు , డ్యూటీకి వెళ్ళండి. తిరిగి వచ్చిన తర్వాత సినిమా ప్లాన్ చేసుకుందాం "
డ్యూటీ కాల్ ఓకే చేసాను.
శ్రీమతి పుట్టిన రోజు సందర్భంగా షాపు నుండి తెచ్చిన మిఠాయి ఆమె నోట్లో పెట్టాను. "పరిస్థితిని అర్థం చేసుకునేది సిసలైన అర్థాంగి" చిరునవ్వుతో మిఠాయి నముల్తూ శ్రీమతి నా ఉద్యోగ ప్రయాణానికి ముందస్తు ఏర్పాట్లు చేయడంలో లీనమైంది !
- గుండాన జోగారావు