గిరిరాజ్ (కథానిక)
పుణ్యక్షేత్రాల్లో గాజులు కొనుక్కునే అలవాటు చాలామందికున్నట్టే మా ఆవిడకూ ఉంది. ఇప్పుడా సంప్రదాయాన్ని కోడలుకు వారసత్వంగా ఇస్తోంది. అందుకావిడను తప్పు పట్టను.
అది లోకసహజమని సర్ది చెప్పుకుంటాను.
తిరుమల దర్శనం కోసం అందరం వెళ్ళినప్పుడు కూడా ఇది తప్పలేదు.గాజుల షాపు దగ్గర బ్రేకులు పడ్డాయి మా ఆవిడకి.
తప్పులేదనుకుంటూ వెంటే నడిచాను. నన్నెందుకో ఆ గాజుల షాపు ఆకర్షించింది. చాలా పొందికగా ఉంది ఆ షాపు.
రంగు రంగు గాజులు. ఆ అమరికలో ఏదో చురుకుదనముంది.
ఇంతకీ గాజులు చూపిస్తున్నది పాతికేళ్లకు మించని ఓ
యువకుడు.అతను గాజులు
చూపించడంలో కూడా ఓ ఆర్ద్రత కనిపిస్తోంది.
సౌందర్యాన్ని వంపుకుంటున్న ఆ షాపు ను ఫొటోగాబంధించబోతుంటే
"ఏంటి సార్ మా షాపును వైరల్ చేస్తారా ఏంటి"
నవ్వుతూ ముందుకొచ్చాడు.
"నీలాంటి యూత్ ఇలాంటి షాపుల్లో కనపడరయ్యా, రా నీతో సహా ఫొటో తీస్తాను"
అంటూ ఫొటోకు సిద్ధమయాను.
"ప్లీజ్ సర్, ఆ పని చేయకండి "
అతని గొంతులోని వేడుకోలు
నాకాశ్చర్యం కలిగించింది.
"ఎందుకో కాస్త అర్థమయ్యేలా చెప్పు"
"ఏం లేదు సర్. నేను చదివింది కంప్యూటర్ సైన్స్.చేసేది సాఫ్ట్వేర్ ఉద్యోగం. అదికూడా వర్క్ ఫ్రం హోం.
శని, ఆదివారాల్లో మా నాయనకు
రెస్ట్ ఇవ్వటం కోసం నేను ఈ షాపు చూసుకుంటున్నాను.
మీరీ షాప్ ఫొటోతో పాటు నా ఫొటో కూడా సోషల్ మీడియాలో పెట్టారంటే, అది కాస్తా వైరల్ అయి మా బాస్ లకు చేరిందనుకోండి, నా వర్క్ ఫ్రం హోం కేన్సిల్ కావచ్చు.
ఒక్క ఫొటో ఎన్ని కాంప్లికేషన్స్ కి
దారి తీస్తుందో..
అర్థం చేసుకోండి సర్"
"ఇంతకీ నీ పేరేమిటయ్యా"
"గిరిరాజ్"
గిరిరాజ్...ఇదేదో
గమ్మత్తైన పేరనుకుంటూ నా ప్రయత్నాన్ని విరమించాను.
అయితే ఆ కుర్రాడి మాటలు నన్ను ఆలోచనలో పడేశాయి.
'ప్రతిదీ సోషల్ మీడియాలో పెట్టకు'
అన్న మా అబ్బాయిల మాటలు గుర్తొచ్చాయి.
మా తరమేమో ప్రతి క్షణాన్ని సోషల్ మీడియా పోస్ట్ లతో నింపేయాలని తహతహలాడుతోంది.
ఇప్పటి తరమేమో తమ వ్యక్తిగత ప్రపంచాన్ని తమవరకే పరిమితం చేస్తోంది. ప్రైవసీ యే పరమార్థం అనుకుంటోంది. అంతే మరి!
తొలిసంధ్య, సాయంసంధ్య ఒకటికావు కదా అనుకున్నాను