Telugu Global
Arts & Literature

'ఈ కథకి ముగింపు?'

ఈ కథకి ముగింపు?
X

"వచ్చావా!? ఎక్కడున్నావే!?" అంది జానకి ఫోన్ చెవిదగ్గర పెట్టుకుని.

"ఇదిగో ఈ కుడివైపుకు చూడు. నిన్ను నేను చూస్తున్నా. గేట్ వద్ద నాకు కనిపిస్తున్నావ్ నువ్వు. " చేయుపుతూ అంది శారద.

"ఆ..... కనీపించావ్! ఆగు వస్తున్నా." అటువైపు నడిచింది జానకి.

జానకి, శారద చిన్నప్పటి నుండీ మంచి స్నేహితులు. ఒకే వీధిలో ఇళ్లు. ఒకే స్కూల్. ఒకే కాలేజ్.

మనస్తత్వాలలో భిన్నత్వం ఉన్నా అభిరుచులలో ఏకత్వం, ఒకరిపై ఒకరికి గల అభిమానం, వారి మధ్య ఎప్పుడూ విభేదాలు రానివ్వ లేదు. ఇద్దరూ పోటీ పోటీగా చదివేవారు. క్లాస్ లో మొదటి రెండు స్థానాలు వీరివే.

శారద ఉన్నత మధ్య తరగతి నుండి వస్తే, జానకిది దిగువ మధ్యతరగతి. అవేవీ వారి అన్యోన్య స్నేహానికి అడ్డు కాలేదు.

డిగ్రీ అయ్యాక జానకికి ఓ చిరుద్యోగితో వివాహం చేసేసాడు పోస్ట్ మాస్టర్ గా పని చేసే ఆమె తండ్రి.

శారద తరువాత పీజీ చదివి మంచి ప్రభుత్వ రంగంలో గెజిటెడ్ హోదాలో ఉద్యోగం సంపాదించుకుంది. ఆపై పెళ్ళై ఆ ఊరి నుండి ఆమె కూడా వెళ్ళి పోయింది.

అలా ఇద్దరూ పెళ్ళిళ్ళై విడిపోయారు. ఎవరికి వారు తమ పిల్లలు, భర్త, ఉద్యోగం, సంసారం గొడవల్లో తలమునకలయ్యారు.

చాలా ఏళ్ల తరువాత తమ అరవైల వయసులో, తీరిక దొరికి, కాలేక్షేపం కోసం, తమ సాహిత్యాభిరుచిమేరకు, ఓ సాహిత్య ప్రధాన గ్రూపులో చేరి, అక్కడ కామెంట్స్, పోస్ట్లలో ఒకరినొకరు గుర్తుపట్టి, ఫోన్ నంబర్లు ఇచ్చి పుచ్చుకుని, ఇలా ఈ రోజు ఈ పార్క్ లో కలుసుకోవలని ప్లాన్ చేసుకున్నారు.

అన్ని సంవత్సరాల తరువాత అనుకోకుండా కలుసుకోవటంతో ఆనందంతో కన్నీళ్ల పర్యంతమయ్యి, ఒకరినొకరు ఆలింగనం చేసుకుని, కుశల ప్రశ్నలతో ఒకరినొకరు ఉక్కిరిబిక్కిరిచేసుకున్నారు.

ఒకరి చేతిలో ఒకరు చెయ్యి ప్రేమగా పట్టుకుని తీరికగా మాట్లాడుకోవటం మొదలు పెట్టారు.

" మా వారు మా చిన్నవాడికి ఏడేళ్ళుండగా గుండెపోటుతో హఠాత్తుగా పోయారే. ఇద్దరు పిల్లలను చాలా క్రమశిక్షణతో పెంచాను. పెద్దవాడు ఏర్ లైన్స్ లో, చిన్నవాడు లాయర్ గా హైకోర్ట్ లో పని చేస్తున్నారు. నీ పిల్లలు!? " తన గురించి చెప్పి జానకిని అడిగింది శారద.

"నాకు ఇద్దరూ కూతుర్లేనే. మా వారు రిటైర్ అయ్యాక, కిడ్నీ ఫైల్యూర్ తో కొంత కాలం పోరాడి పోయారు. ఇప్పటికి నాలుగేళ్లైంది. నా పిల్లలిద్దూ సాఫ్ట్వేర్ కంపెనీలలో మంచి జీతంతో పని చేస్తున్నారు. ఈ సిటీలోనే. వాళ్ళ భర్తలూ అదే ఫీల్డ్." జానకి మనసులోని నిశ్చింత ముఖంలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.

"అవునా! ఇంతకూ నువ్వెక్కడ ఉంటున్నావ్!? అయితే ఒంటరిగా ఉన్నావా!? నాతో పాటూ ఆశ్రయ గోల్డేజ్ హోం కు వచ్చేయ్ కూడదూ!? నా రూంలోనే ఉందుగానీ. చాలా బావుంటుంది అక్కడ. సపరేట్ ఏ సి గది, విత్ అటాచ్డ్ బాత్రూం. ఆ బిల్డింగ్ చుట్టు పెద్ద గార్డెన్. ఆర్గానిక్ కూరల పెంపకం. యోగా కేంద్రం, చిన్న దేవాలయం, ఇరవైనాలుగు గంటలూ డాక్టర్స్ అందుబాటులో ఉంటారు, చక్కని, తాజా ఆహారం సమయానికి అందిస్తారు. నేనున్న రూం ఒక్కరికైతే నెలకు ఇరవై నాలుగు వేలు, అక్కడే ఇద్దరుంటే ముప్పై వేలు." ఉత్సాహంగా జానకి రెండు చేతులూ తన చేతిలోకి తీసుకుని అడిగింది శారద.

"అదేంటీ!? నువ్వు ఓల్డేజ్ హోంలో ఉన్నావా!?" పట్టలేని ఆశ్చర్యంతో శారదవైపు చూస్తూ అంది జానకి.

"అవును!? ఏం!? అయినా...! అక్కడ చాలా సౌకర్యంగా ఉంటుంది. నువ్వూ ఒంటరిగానే ఉంటున్నావని అడిగాను!?" చప్పబడిన ఉత్సాహం జానకికి దొరకనివ్వకూడదనే ప్రయత్నం చేస్తూ, చిన్నగా తన చేతులు వెనక్కు తీసుకుంది శారద.

"లేదే. నేను నా కూతుర్ల దగ్గరే ఉంటున్నాను ఆయన పోయినప్పటి నుండీ. అది సరే! నీ పిల్లలు నిన్నిలా ఒంటరిగా ఎందుకు ఉండనిస్తున్నారు..!?" అంది జానకి.

శారద తన భావాలు ముఖంలో చూపకుండా ..."ముందు నువ్వు చెప్పు. నీ అల్లుళ్ళు నిన్ను తమ వద్ద ఉంచుకోవడానికి ఒప్పుకున్నారా...!?" ఆసక్తిగా చూసింది జానకి కళ్ళలోకి.

జానకి చెప్పటం మొదలుపెట్ఠింది.

"మా వారి ఉద్యోగం చిన్నదే.. అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా, నన్ను, పిల్లలని చూసుకునే వారు. ఉన్నంతలోనే సర్దుకుని ఉండేవాళ్ళం. ఎవరి ముందూ చేయి చాపే అవసరం లేకుండానే రోజులు గడిచేవి. నా కూతుళ్లు రమ, జ్యోతి ఇద్దరూ కూడా అందంలోనూ, చదువులోనూ పోటీ పడుతూ.. వారి తెలివితేటలతో మంచి కంపెనీలలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఉద్యోగాలు సంపాదించుకున్నారు. ఇద్దరికీ మంచి సంబంధాలు కూడా వాళ్ళే వెతుక్కుంటూ రావడంతో.. మాకున్నదాంట్లోనే ఏ లోటూ జరక్కుండా పెళ్ళిళ్ళు చేసాము. అల్లుళ్ళు ఇద్దరూ మొదట్లోనే చెప్పారు.. మేము మీ అల్లుళ్ళం కాదు, కొడుకులమే.. అని. మా ఇద్దరికీ ఆ మాట చాలా సంతోషం కలిగించింది. అలాగే మసలుకునేవారు కూడానూ. ఆ తర్వాత ఈయన జబ్బు పడడంతో మమ్మల్ని ఇక్కడకి తీసుకువచ్చి.. ట్రీట్మెంట్ ఇప్పించారు. ఖర్చు కూడా మొత్తం ఇద్దరూ పెట్టుకున్నారు. కానీ ప్రయోజనం లేకపోయింది. కిడ్నీ పూర్తిగా ఫెయిల్యూర్ అవడంతో చనిపోయారు. ఆ తర్వాత నేను మా ఊరు వెళ్లిపోతానని అన్నా, అక్కడ ఒంటరిగా ఉండలేవు, ఇక్కడ మాతోనే ఉండాలి.. అంటూ బలవంతంగా ఇక్కడే ఉంచేసారు.

నాకు వీలుగా ఉండాలని ఇద్దరూ పక్కపక్కన ఇళ్ళలో ఉంటున్నారు. ఈయన లేరు అనే లోటు తప్ప నాకే వేరే ఏ లోటూ లేకుండా చూసుకుంటున్నారు. ఈయనది చిరుద్యోగం పెన్షన్ వంటిదేదీ లేదు. కనీసం సొంతిల్లు కూడా సమకూర్చుకోలేకపోయాము. ఆర్థికంగా ఆడపిల్లల మీద ఆధారపడ్డానే అని కించిత్తు బాధ ఉందికానీ.. తప్పనిపరిస్ధితి అయింది. అలా అని వాళ్లు నన్ను ఎక్కడా తక్కువ చేయడం లేదు కూడా.

నా మాటకి గౌరవమిస్తూ, ప్రతీదీ నన్ను సంప్రదిస్తూ ఉంటారు. నేను కూడా ఆ రెండు కుటుంబాలకీ నాకు చేతనైన సహాయం.. వాళ్లు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఇంటిపనీ, వంటపనీ చేయడం.. మనవల ఆలనాపాలనా చూసుకోవడం.. మధ్య మధ్య ఇలా సాహితీసేవ.. ఇదిగో అక్కడేగా నువ్వు నాకు ఇలా పరిచయమయావు. ఇవీ నా సంగతులు.. నీ గురించి చెప్పు శారదా! పిల్లలతో ఉండకుండా ఎందుకు ఓల్డేజ్ హోమ్ లో ఉంటున్నావు, అసలు ఉండగలుగుతున్నావా? " అని అడిగింది.

" ఓ.. అవునా! జానకీ! ఒకటి చెప్పు, నిజంగా సంతృప్తిగా ఉన్నావా? వాళ్ళు వాళ్ళ అవసరం కొద్దీ నిన్ను ఉంచుకున్నారేమో అనిపించడం లేదా?

జీతం లేని పనిమనిషివి దొరికావు. అందుకే నీతో మంచిగా ఉంటున్నారేమో.. వేరు వేరుగా దూరంగా ఉంటే.. ఒకరి అవసరాలే తీరుతాయి, మరొకరికి ఇబ్బంది అవుతుందనే ఆలోచనతో పక్కనే ఇళ్లు తీసుకుని రెండు ఇళ్ళకీ నిన్ను బందీ చేసారు. ఎంత వెర్రిదానివి జానకీ! ఆర్ధికంగా నీకు ఏ వెసులుబాటు లేకపోయేసరికి, అవసరానికి రాజీ పడిపోయావనిపిస్తోంది నాకు. అక్కడ నీకు ఏమాత్రం మనసు కష్టంగా ఉన్నా చెప్పు.. నాతో ఉందువుగాని. నాకు పెన్షన్ ఎనభై వేల రూపాయలు వస్తోంది . నేను ఎవరిమీదా ఆధారపడక్కర్లేదు. నీకు ఏ అవసరం వచ్చినా నాకు చెప్పు " ఒకరకమైన ఆత్మవిశ్వాసం తొణకిసలాడే మోముతో అంది శారద.

ఆ మాటలకి, చిరునవ్వుతో సమాధానం చెప్పింది." ఆర్ధికంగా నాకు లేకపోవచ్చు.. కానీ ఆత్మాభిమానం మెండుగా ఉంది శారదా! మానవ సంబంధాలు కేవలం ఆర్థిక సంబంధాలే అనే మాట నిజమే అవొచ్చు.. కానీ ఆ బంధాలకి రెండోవైపు సన్నని బంగారుతీగతో చుట్టబడిన కుటుంబ అనుబంధాలు కూడా ఉన్నాయి. అక్కడ కుటుంబ విలువలూ, ఆప్యాయతలూ వంటివి మెలివేసుకుని ఉన్నాయి. నేను నా కూతుళ్ళనిద్దరినీ ఉన్నత విలువలు తెలుసుకుని మసలుకునేలా పెంచాను. నా పెంపకం ఎన్నటికీ వమ్ము కాదు. నా అదృష్టమే

నా కూతుళ్ళనిద్దరినీ నుంచి వచ్చిన అల్లుళ్ళు ఇద్దరూ కూడా కొడుకులకంటే ఎక్కువ అయారు. గతమంటావా గడిచిపోయింది. వర్తమానం హాయిగానే ఉంది. భవిష్యత్ గురించి నాకే ఆలోచనా లేదు. ఇలాగే సాగిపోతుందనే నమ్మకం పూర్తిగా ఉంది. అయినా అయినవారికోసం చేస్తున్నప్పుడు పనిమనిషి అనే భావన ఎందుకు వస్తుంది శారదా? వాళ్ళు పరాయివారు కాదే.. నా కూతుళ్లు, అల్లుళ్ళు, మనవలేగా! నాకోసం ప్రాణం పెట్టే నావారికి నేను చేసుకోవడం నాకు దైవారాధన లాగే భావిస్తాను. అందులో నాకు ఏ కష్టమూ అనిపించదు.

ఇకపోతే నువ్వు ఇలా ఓల్డేజ్ హోమ్ లో ఎందుకు ఉండాల్సివచ్చిందీ, అని ఇందాక అడిగాను. ఇప్పుడు నువ్వు నన్ను అడిగిన నీ మాటలని బట్టి అర్ధం చేసుకున్నాను. నీ పిల్లలని చాలా క్రమశిక్షణ తో పెంచానన్నావు. అయితే వారి దగ్గర నీ శేషజీవితం ఎలా ఉంటుందో అనే సందేహాలతో అభద్రతగా ఫీలయివుంటావు. పైగా నీకు అంటూ స్వంత సంపాదన ఉందనే ఆత్మవిశ్వాసం తో ఒంటరిగా గడిపేయగలుగుతున్నావు. పేరుకి హాయిగా ఉన్నాను అని నీ మనసుకి సర్దిచెప్పుకున్నావు కానీ.. కొడుకులకి, కోడళ్ళకీ, మనవలకీ దూరంగా ఉండడం ఎంత బాధగా ఉండి ఉంటుందో ఒకసారైనా నువ్వు అనుకోకుండా ఉన్నావంటే నేను నమ్మను. డబ్బు ఉండవచ్చు... కానీ మనవారితో కలిసి ఉంటే వచ్చే హాయి, ఆనందం, మనశ్శాంతి డబ్బుతో కొనలేము. ఆశ్రయ హోమ్ లో సౌకర్యాలు ఉండవచ్చు కానీ అనుబంధాలు ఉండవు. ఒకసారి ఆలోచించు.అయినా నీవేపు పరిస్థితి ఏంటో తెలీకుండా ఉచిత సలహాలు ఇచ్చినందుకు మన్నించు. నీకు ఎప్పుడైనా బయటకి వచ్చి నాలుగు రోజులు గడపాలని అనిపిస్తే నా దగ్గర కి తప్పకుండా రావచ్చు. ఇదే నా ఆహ్వానం... ఇదిగో మా చిన్నల్లుడు నన్ను పికప్ చేసుకుందికి వచ్చి బయట వెయిట్ చేస్తున్నానని మెసేజ్ పెట్టాడు. మరి వెళ్లిరానా? మరోసారి కలిసినప్పుడు ఈ విషయాలు కాకుండా మన చిన్ననాటి సంగతులు ముచ్చటించుకుందాం. తరచూ ఫోన్ చేస్తూ ఉండు. ఆరోగ్యం జాగ్రత్త " అంటూ సెలవు తీసుకుంది జానకి.

వెడుతున్న జానకి వేపు చూస్తూంటే.. తన ముందు ఓ పెద్ద ప్రశ్నార్థకం కనిపించింది. ఆ ప్రశ్నకు జవాబు చెప్పుకునే దిశలో ఆలోచించడం మొదలెట్టింది శారద.

-కలవల గిరిజా రాణి.

First Published:  25 Sept 2023 11:19 PM IST
Next Story