చూస్తున్నా ! (గజల్)
BY Telugu Global22 Nov 2022 12:39 PM IST

X
చూస్తున్నా ! (గజల్)
Telugu Global Updated On: 22 Nov 2022 12:39 PM IST
కాలి బూడిదయేలోపు..వస్తావని చూస్తున్నా..!
'నా' కోర్కెల చితికి నిప్పు..పెడతావని చూస్తున్నా..!
ప్రేమించుటకన్న అసలు..ఘోరనేర మేమిటిలే..
జ్ఞాపకాల గూడు కాల్చి..వెళతావని చూస్తున్నా..!
నిదురకేమొ అంటరాని..వాడినైతి నీదయతో..
నీ చూపుల గంధమింత..పూస్తావని చూస్తున్నా..!
వ్రాయలేక దాచుకున్న..తెల్లకాగితాల ఘోష..
అక్షరాల నా శ్వాసన..వింటావని చూస్తున్నా..!
మల్లెపూల తో 'రణమే..మనోహరం అంటావా..
మనకథనొక సినిమాగా..తీస్తావని చూస్తున్నా..!
ఎంత లేదు అనుకున్నా..వేధించే ఆశ చూడు..
దుపట్టాను కఫనులాగ..చేస్తావని చూస్తున్నా..!
మరిమాధవ పల్లకితో..మనకేమిటి పని చెలియా..
సుడిగాలియె మనతోడని..అంటావని చూస్తున్నా..!
- కొరుప్రోలు మాధవరావు
Next Story