Telugu Global
Arts & Literature

ఇంకొంచం అలానే నవ్వుతూ వుండు..!

ఇంకొంచం అలానే నవ్వుతూ వుండు..!
X

ఎందుకో నువ్వలా చూస్తే చాలు

కాసేపు వెన్నెల్ని తెంపి

కళ్ళల్లో ఆరబోసుకుంటున్నాను .

చలి మంటల్ని దూసి

గుండెల్లో ఒంపేసుకుంటున్నాను .

నీ చూపుల్లో దీపాలు కొద్ది కొద్దిగా

ఆశల సువాసనలు వెదజల్లుతున్నాయి.

నీ కొప్పులో మల్లెలు మురిసి

కోర్కెల పందిళ్లు వేస్తున్నాయి .

కాసిన్ని గాలులు ముసురుతున్నా

కొంటె చినుకులు తడుపుతున్నా

చిలిపి గాజులు అల్లరిచేస్తున్నా

వసంతం లో ఉత్సవాన్ని

నీ దేహ శిఖరాలపై ఆరేసుకుంటూ

క్షణాల్ని తాగుతున్నాను .

ఆకాశపు తీగలు లాగుతుంటే

జారే మేఘాల లోతుల్లోంచి

పరవశించి పరిమళించి

అమృతపు పరవళ్ళుగా

ఆ నదులు పొంగుతున్నాయి .

సీతాకోక చిలుకలు తట్టినట్లు

వొళ్ళంతా చుట్టినట్లు

నీ నయనాలు ఆక్రమించుకుంటున్నాయి .

క్షణాల్ని అలంకరించే

నువ్వు కాస్తా

ఇంకొంచం అలానే నవ్వుతూ వుండు .

ఆశలు కౌగిలించుకున్నా

పూల ద్రవ్యాలు పంచుతున్నట్లు

ఆకాశం ఊగి పడినట్లు

రగిలిన ఆవేశాలు మత్తెక్కుతున్నాయి.

మరుక్షణం అలా భళ్ళున వర్షిస్తున్నాయి .

ఇక సుఖాలు చల్లని మేఘాలు గా తేలిపోతున్నాయి .

-గవిడి శ్రీనివాస్ ( బెంగళూర్ )

First Published:  19 May 2023 6:37 PM IST
Next Story