Telugu Global
Arts & Literature

నకిలీ లోకం

నకిలీ లోకం
X

అబద్ధాలకు అలవోకగా

అలవాటు పడుతూ

అందరిని బురిడీ చేస్తూ

బోల్తా కొట్టిస్తుంది నేటి సమాజం..

మాయ చేసి మండుటెండలో

చలిని పుట్టిస్తుంది చేతగానితనం..

తేనె పూసిన కత్తిలా నమ్మకాన్ని

మన్నుతో కప్పేస్తుంది నవ సమాజం..

దేహాన్ని పెకిలించి చూస్తే

అంతా నకిలీనే,

అన్నీ అసత్యాల పుట్టలు

కుప్పలు కుప్పలుగా బయట పడతాయి..

మంచిమాటలన్నీ మూట కట్టి

భద్రంగా దాచిపెట్టి,

దెయ్యాలు వేదాలు వల్లించినట్టు

దగాకోరు వంచనపు మాటలు జల్లిస్తున్నారు…

ఎక్కడుంది సత్య లోకం ఇక్కడ

అంతా అసత్య ప్రపంచమే కదా.

మోముపై చిరునవ్వు 'నకిలీ',

మంచి చేయాలన్న మాట 'నకిలీ',

బతకాలన్నా 'నకిలీ',

తిందామన్నా 'నకిలీ',

అన్నింటిలో 'నకిలీ',

ఇంతా అంతా కాదు జగమంతా 'నకిలీ'.

అమాయకులు..అభాగ్యులు.

ఒక్కరు కాదు ఇద్దరు కాదు

అందరినీ బలిస్తుంది

మోసాన్ని అణువణువునా

ఇముడ్చుకున్న వంచనతనం..

- పోలోజు రాజ్ కుమార్

హైదరాబాద్.

9959056095

First Published:  31 Oct 2022 4:42 PM IST
Next Story