ఎల్ నినో ఎఫెక్ట్ (కవిత)
చలి కాలం ముంగిట
దసరాలెళ్ళిపోయి ...
దీపావళి వచ్చేస్తుంటే కూడా
తగ్గని ఉబ్బరం ...ఉక్కపోత...
రాత్రి గానీ ...తెల్లవారి గానీ...
స్నానానికి వేణ్ణీళ్ళ ఊసే రావట్లేదు...
వాకింగ్ కి వెళితే...
మార్నింగయినా ఈవెనింగైనా...
కార్మిక కర్షకులే కాకుండా ...
ఎవరి కాయం నిండానైనా కాలువ కట్టే ఘర్మజలానికి ఖరీదు కట్టే ...
యాప్ లు ఆండ్రాయిడ్ లోనూ...ఐఓఎస్ లోనూ లేవోయ్...
కారణం ...?
ఎల్ నినో ఎఫెక్ట్...
ఆ ఎండకీ...
మండే గుండెకీ...
కారే ఉక్కకీ...
మొరిగే కుక్కకీ...
అరిగే పిక్కకీ...
ఎర్రచందనపు చెక్కకీ...
వార్తల్లోకెక్కిన బీఫు ముక్కకీ...
చిరిగిపోయిన పక్కకీ...
అన్నిటికీ కారణం ...?
ఎల్ నినో ఎఫెక్ట్...
భరించలేకపోతున్నాం...
ఉక్కని కాదు...
అమాంతం పెరిగిపోతున్న వేడిని...
పక్క వాణ్ణి సహనం తో చూడలేని చూపుల వేడిని...
మాటల వాడిని...
కౄరమైన దాడిని...
జోరెక్కిన నాడిని...
తలదన్నే తాడిని...
ధృతరాష్ట్రుడి లా చూస్తున్న...
మోడి ని...
భరించలేకపోతున్నాం...
కారణం...?
ఎల్ నినో ఎఫెక్ట్...
అవార్డు లు వెనక్కిచ్చేస్తున్నరు
నలుగురూ నవ్విపోతున్నరు
తిట్టేటోళ్ళు తిడుతున్నరు
పొగిడేటోళ్ళు పొగుడుతున్నరు
అప్పుడెందుకియ్యలే...
ఇప్పుడే ఎందుకిస్తున్నవ్...
నువ్వు సిక్యులర్ ...అంటున్నరు...
కారణం...?
ఎల్ నినో ఎఫెక్ట్...
రచయితలతో మొదలయ్యింది
సినిమా వాళ్ళకి అంటుకుంది
మాజీ సైనిక వీరులూ సై అంటున్నారు...
ఇది దేశం డీ.ఎన్.ఏ లోనే లోపం అంటూ సైంటిస్టులూ ఎవార్డ్ వాపసీ అంటున్నారు...
అసలు రాష్ట్రపతి గారే సహనంగా, సంయమనం గా ఉండమనాల్సొచ్చింది...
బిరుసు తలలని కాస్త కంట్రోల్ చెయ్యమంటూ
"రెయిన్ ఇన్ (rein in) ...లేకుంటే మూడుతుందని " మూడీస్ వాడు
సాక్షాత్తు మోడీనే కదా
హెచ్చరించింది...
ఆఖరికి ..
ఇన్ టాలరెన్స్ రేట్ తగ్గించమని...
ఈ మధ్యే వడ్దీ రేట్లు తగ్గించిన
రఘురామ్ రాజన్ కూడా...
తన కచ్చని వడ్డీతో సహా తీర్చుకున్నాడు...
కల్చరల్ డిక్టేటర్ షిప్...వచ్చేస్తుందేమో అని సంగీతకారుడు జుబిన్ మెహతా... భయం వెలిబుచ్చాడు...
కారణం...
ఎల్ నినో ఎఫెక్ట్...
ఒక్క పంటలెండిపోడానికో
వర్షం పడకపోడానికో
వేడి పెరిగిపోడానికో మాత్రమే
ఎల్ నినో ఎఫెక్ట్ కారణం కాదు...
అన్నిటికీ...
హెచ్చుకీ తగ్గుకీ...
అతివాదానికీ...ఉగ్రవాదానికీ...
వితండవాదానికి...
ఖేదానికీ...వికృత మోదానికీ...
మౌన ఆమోదానికీ ...
అన్నిటికీ కారణం...
ఎల్ నినో ఎఫెక్ట్...
అయినా సరే..
.అప్పుడెప్పుడో నేను సరదాగా రాసినట్టు...
వాన రాలే...వానరాలే...
వా...నరాలే... వానరా...లే...
( 2015 అక్టోబర్ 31 న వ్రాసిన కవిత. మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవార్డ్ వాపసీ అంటూ అనేకమంది ప్రముఖులు అవార్డులు తిరిగి ఇచ్చేసిన సందర్భం లో వ్రాసిన కవిత.
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, అప్పటి ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ ప్రధానమంత్రి ని కాస్త నిష్టూరమాడిన సందర్భం )
- సాయి శేఖర్