ప్రయోగశీలీ, కథానికాజీవీ డా|| వేదగిరి రాంబాబు
డా॥వేదగిరి రాంబాబు 'కథానికా జీవి'. కధానికోద్యమ నిర్మాత, దర్శకుడు, సంచారరాయబారి. సాహిత్యంలో కథానిక, నవల, టీవీ, ఆకాశవాణి సీరియల్స్ ద్వారా పేరెన్నికగన్నవాడు. వీటన్నిటితో పాటు పత్రికా సంపాదకుడు, ఫ్రీలాన్స్ పాత్రికేయుడు, నటుడు, ప్రయోక్త, పరిశోధకుడు.వైవిధ్యభరితమైన జీవితాన్ని చవిచూసినవాడు. విస్తృతమైన సాహిత్యానుభవాల్ని గడించినవాడు.
ప్రాథమికంగా రాంబాబు కథానికా రచయిత. సుమారు 400 కథానికలు రాశాడు. 'సముద్రం' కథానికా సంపుటికి తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం లభించింది. అదిగాక, 10 కథా సంపుటాలు ఉన్నై, 'నాలుగు దశాబ్దాల నగరం', 'ఆంధ్రుల చరిత్ర' వంటి చరిత్ర గ్రంథాన్ని రాశాడు. బాలసాహిత్యం పదిసంపుటాలు వెలువడినై. ఉత్తమ పరిశోధకుడుగా రాంబాబు 'క్షేత్రస్థాయి'లో దేశద్రిమ్మరి. విభిన్న ఆధ్యాత్మక కేంద్రాల్ని దర్శించి, 'ఆధ్యాత్మిక అడుగుజాడలు' గ్రంథాన్ని వెలువరించాడు. 'ఒక మంచిమాట' సంకలనం, ఇతర వ్యాసాలూ ప్రచురించాడు.
రాంబాబుకి పరిశోధకుడుగా అనన్యమైన పేరు తెచ్చి పెట్టిన ధారావాహికలు - 'జైలు గోడలు మధ్య' 'పాపం పసివాళ్ళు' 'అగ్నిసాక్షి' 'వీళ్ళేమంటారు?’ ఇవన్నీ ఆయా తరగతులకు చెందిన విషాద జీవుల ఛిద్రజీవన వాస్తవ కథనాలు!
వైద్య విజ్ఞాన ప్రచారానికి రాంబాబు చేసిన కృషి ఎన్నదగినది. 8 గ్రంథాల్నీ, శతాధికంగా వ్యాసాల్నీ, వైద్యుల పరిచయాల్నీ రాశాడు. 'మన ఆరోగ్యం' మాసపత్రికకు గౌరవ సంపాదకత్వం వహించాడు.
'తెలుగు పత్రికలు - రచనా ధోరణులు' రాంబాబు పిహెచ్.డి. సిద్ధాంతగ్రంథం. ఇదిగాక, 'వెలుగుదారిలో తెలుగు పత్రికలు', 'ప్రజలను ప్రభావితం చేస్తున్న మాధ్యమాలు' గ్రంథాల్ని రచించాడు.
'కథనం రంగం' వంటి 8 విమర్శా గ్రంథాలూ 'నరసరావుపేట 200 ఏళ్ళ ప్రత్యేకసంచిక' 'కడప కౌస్తుభం' వంటి వాటికి అతను సంపాదకత్వం వహించాడు. 'బలివాడ కాంతారావు జయంతి ప్రత్యేకసంచిక' వంటివి ఆ పరంపరలో వెలువడినై. జీవితారేఖాచిత్ర గ్రంథాలుగా- 'మన గురజాడ', 'ఆధునిక ధ్రువతార', 'గిడుగు పిడుగు' 'సౌందర్యారాధకుడు బుచ్చిబాబు' 'పాలగుమ్మి పద్మరాజు' వంటివి వెలువడినై.
రాంబాబు, గురజాడ ఆరాధకుడు కావడమే కాక, 1994 కథాసదస్సుల నిర్వహణతో ఆయన స్ఫూర్తి పునరుజ్జీవనానికి ఉద్యమశీలిగా మారిపోయాడు. తెలుగుసాహితీ లోకంలో ఒక నవ్య చైతన్యాన్నీ, సంచలనాన్ని కలిగించాడు. ఆ కార్యక్రమాలన్నీ దేనికదే ఒక చారిత్రాత్మక ఘటనగా నిలిచాయి.
కథానిక మీద ఆరాధనాభావంతో - వేదగిరి కమ్యూనికేషన్స్ పక్షాన డైరెక్ట్ కథలతో - 'కొత్తకథ', 'సరికొత్తకథ', 'వినూత్నకథ' 'నవతరం కథ' 'పంచసప్తతి' సంకలనాలని తన ఖర్చుతో ప్రచురించాడు.
సాహిత్య చరిత్రలోనే అపూర్వప్రయోగ మనవలసిన 'కథానికా సమీక్ష' గ్రంథాల్ని ఏఏటికా యేడు వెలువడిన అన్ని ప్రతికల అన్ని కథల విశ్లేషణతో- సంవత్సరాలవారీగా 1994, 95, 96, 97- ప్రచురించాడు. ఈ సమీక్షల్ని ప్రతిసంవత్సరం సుమారు 30మంది లబ్ధప్రతిష్ఠులైన విమర్శకులూ, కథారచయితలూ చేశారు. ఇది ఒక 'నభూతో నభవిష్యతి' విజయంగా నిలిచింది.
బుచ్చిబాబు అవార్డుని నెలకొల్పి ఏడుగురు సుప్రసిద్ధ కథానికా రచయితల కధాసంపుటాల్ని ప్రచురించి ఇచ్చారు. భమిడిపాటి జగన్నాధరావు., డి. వెంకట్రామయ్య, శివరాజు సుబ్బలక్ష్మి, అరిగే రామారావు, ఇచ్ఛాపురపు జగన్నాథరావు,రావి-ఎన్-అవధాని, వీరాజీ గారలు ఈ పురస్కారాల్ని పొందారు.
1997లో కేంద్ర సాహిత్య అకాడెమీ పక్షాన నిర్వహించిన ఐదురోజుల కార్యగోష్టికి రాంబాబు సమన్వయకర్త, ఆ కార్యక్రమాన్ని సంచలనాత్మకంగా నిర్వహించాడు. ఫలితంగా అకాడెమీ - రాంబాబు, వాకాటి సంపాదకత్వంలో 'బంగారుకథలు' సంకలనాన్ని ప్రచురించింది.
రాంబాబు నూతనమైన సాహితీ ప్రయత్నాల గురించే అహరహమూ తపించిన చింతనపరుడు. 2009 ఫిబ్రవరి 9,10 తేదీల్లో విజయనగరంలో గురజాడవారి ఇంటి నుండి 'కథానికా శతజయంతి ఉత్సవాన్ని ప్రారంభించాడు. వందమందికి పైగా కథకులూ, మరో రెండువందల మంది సాహితీ ప్రియులూ ఆ పండుగల్లో పాల్గొన్నారు. ముగింపుసభలో వందమంది కథకులకి ప్రత్యేక జ్ఞాపికలతో, మెడల్స్ సత్కారం జరిగింది. అప్పట్నుంచీ ఒక ఏడాదిపాటు అవిభక్త ఆంధ్రప్రదేశ్ లోని 23 జిల్లాలూ పర్యటించి ప్రతిచోటా కథానికా సదస్సుల్ని జరిపాడు. ఏ జిల్లాకా జిల్లా కథానికా వికాసం మీద వ్యాసాలు రాయించి, ఆ రచయితలకు పారితోషికం ఇచ్చి, ఆ వ్యాసాల సంకలనం 'తెలుగు కథానికకు వందేళ్ళు' ప్రచురించాడు. రచయితల డైరెక్టరీని వెలువరించాడు. ఔత్సాహిక కథకులకు పోటీలు నిర్వహించి, ఆ కథల్ని సుప్రసిద్ధ కథకుల కథల సరసన ప్రచురిస్తూ - 'అద్దం' పేరుతో సంకలనాన్ని తెచ్చాడు.
ఆ తర్వాత నాలుగు ప్రాంతీయ సదస్సుల్ని కరీంనగర్, విజయవాడ, కడపలలో నిర్వహించి, చివరి సభ - రాష్ట్ర స్థాయిలో 2010 ఫిబ్రవరి 7,8 తేదీల్లో విజయనగరంలోనే జరిపాడు. గురజాడ వారి ఇంటికి గ్రిల్స్ ని ఏర్పాటు చేయించి, ప్రతి గదిలోనూ ఫ్యాన్లు, పుస్తకాల ర్యాక్స్ ని అన్నీ తన ఖర్చుతో సమకూర్చడం ఒక నిర్మాణాత్మక కార్యక్రమం.
శ్రీపాదసుబ్రహ్మణ్యశాస్త్రిగారికి నివాళిగా రాజమండ్రిలో వారి నిలువెత్తు విగ్రహాన్ని ప్రతిష్టింపజేయటం - రాంబాబు కృషి హారంలో కొలికిపూస. ఆ సందర్భంగా వీరాజీ గారు రాసిన శ్రీపాదవారి 'మోనోగ్రాఫ్'నీ ప్రచురించాడు. ఆ తర్వాత శ్రీపాద విగ్రహానికొక వెల్లగొడుగునీ ఏర్పాటు చేయించటం జరిగింది.
గురజాడ నివాళిగా, కథానికా శతజయంతి బహూకృతిగా విహారి ధారావాహికలుగా రాసిన 300పైగా కథానికల పరిచయాలు- పరామర్శలు 'కథాకృతి' పేరున సంపుటాలుగా 'వేదగిరి కమ్యూనికేషన్స్' ప్రచురణగా వచ్చాయి. తానుగా రాంబాబు - ఇనాక్ గారి 'దళిత కథలు', యర్రంశెట్టి శాయి 'హాస్యకథలు', కాలువ మల్లయ్య 'నేలతల్లి', 'శిరంశెట్టి కాంతారావు 'మట్టితాళ్ళ వల', సింగమనేని నారాయణ కథాసంపుటి, కాటూరి రవీంద్ర త్రివిక్రమ్ కథానికా సంపుటాల్ని ప్రచురించాడు.
రేపటితరం పౌరుల్లో సాహిత్యాభినివేశం కలిగించటానికి - అవసరాల రామకృష్ణారావుగారి 'కేటూ- డూప్లికేటూ', డి.ఆర్. భాస్కరశాస్త్రిగారి 'తాత చెప్పిన కథలు' వంటి బాల సాహిత్యాన్ని వెలువరించాడు. వీటిన్నిటినీ ఉచితంగా పాఠశాలల్లోని పిల్లలకు పంచటం జరిగింది.
గురజాడ రచనల్లో, వ్యావహారిక భాషోద్యమంలో అత్యంత ప్రధానఘట్టంగా భావింపబడే - 'మినిట్ ఆఫ్ డిసెంట్' (అసమ్మతిపత్రం) 1914లో వావిళ్ళవారి ప్రచురణగా వచ్చింది. 96 ఏళ్ళ తర్వాత దాన్ని పునర్ముద్రణగా వెలువరించాడు. రాంబాబు. ఇదొక విశేష కార్యక్రమం. అలాగే, గురజాడ కథానికలు, ముత్యాలసరాలు (పూర్ణమ్మ, కన్యక) సిడిలుగా వెలువరించాడు. గిడుగు వెంకటరామమూర్తిగారి 'ఏ మెమోరాండమ్ ఆఫ్ మోడ్రన్ తెలుగు' 1913 ప్రచురణని డా॥పోరంకి వారి సంపాదకత్వంలో పునర్మిద్రించాడు.
దేశభక్తి గేయాన్ని ఏకంగా 24 భాషల్లోకి అనువదింపజేసి ప్రచురించటం రాంబాబు సాహిత్యారాధనా భావానికి నిలువెత్తు సాక్ష్యం. గురజాడకు నివాళిగా సుప్రసిద్ధకవుల 60 కవితలతో - సుధామ సంపాదకత్వంలో 'అక్షర' కవితా సంపుటిని ప్రచురించాడు.
గిడుగు రామమూర్తిగారి 150వ జయంతిని ఆయన ఎక్కువకాలం నివసించిన పర్లాకిమిడినుండి, విజయనగరం, రాజమండ్రి, విశాఖపట్నం, తణుకు, కొవ్వూరు, చెన్నై వరకు 'అమ్మనుడి' సంపాదకులు సామల రమేశ్ బాబు గారితో కలిసి సదస్సులు నిర్వహించారు. గిడుగు రచనల్ని సేకరించి, పాడైపోతున్న వాటిని డా॥పోరంకి, విహారి గార్లచే శుద్ధి చేయించి, గిడుగు రచనా సర్వస్వం గ్రంథాన్ని తెలుగు అకాడెమీ ద్వారా ప్రచురింపజేశాడు. రెండవ సంపుటి 'సవర సంబంధి' ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో తానే ప్రచురించాడు. 1100 పైబడిన పేజీల ఉద్గ్రంథం అది. రాంబాబు ప్రచురించిన పుస్తకాలన్నీ ఆకర గ్రంథాలే.
ప్రయోగశీలిగా రాంబాబు కృషి అపూర్వమైనది. పిల్లల మొట్టమొదటి వీడియో మేగజైన్ 'ఇంద్రధనస్సు' వాల్యూమ్స్ కి అతనే సంపాదకుడు. 'పాపం పసివాళ్ళు' సీరియల్ కి బంగారునంది, 'అడవిమనిషి'కి (పిల్లల టెలీఫిలిమ్)కి రజతనంది అవార్డులు - దర్శకుడిగా, నిర్మాతగా కూడా లభించాయి. గురజాడవారి 'దిద్దుబాటు', శ్రీపాదవారి 'కలుపుమొక్కలు', చింతాదీక్షితులుగారి 'దాసరిపాట', వేలూరి శివరామశాస్త్రిగారి 'డిప్రెషన్ చెంబు', చాసో గారి 'ఎంపు' లాంటి కథానికలు 'కథావీధి' శీర్షికన నాటికలుగా దూరదర్శన్ లో ప్రసారమైనాయి. వాటన్నిటికీ రచయిత, దర్శకుడు రాంబాబే.
ఆకాశవాణిలో వందల సంఖ్యలో నాటకాలకీ, రూపకాలకి రచనా నిర్వహణ చేశారు. ప్రసంగాలూ, చర్చలూ, ఇంటర్వ్యూలూ సరేసరి, లెక్కకు మించినవి!
'విపుల' మాసపత్రికలో 'కథకుల ఫైల్' 98 నెలలు నిర్వహించాడు. నవంబరు సంచికలో ఆ శీర్షికన కీర్తిశేషుడుగా అతని కథే 'తల్లి' వచ్చింది. సూర్య దినపత్రికలో 'తప్పక చదవాల్సిన వందకథలు' శీర్షికన వందకథల్నీ పరిచయం చేశాడు.
మాతృభాషాభివృద్ధికి కూడా తన వంతుగా అనేక కార్యక్రమాల్ని నిర్వహించాడు. వాటిలో ఒకటి 'అమ్మనుడి' పత్రికలో భాషోద్యమ కథానికల్ని రాయించటం!
రాష్ట్ర రాష్టేతర ప్రాంతాల్లోని అనేక సాహిత్య సాంస్కృతిక సంస్థలు రాంబాబుని సన్మానించి, సత్కరించి గౌరవాన్ని పొందాయి. ఆకాశవాణిలో జింగిల్స్ కి ప్రసారభారతి అవార్డ్ వచ్చింది. నంది అవార్డు వచ్చినై. రాష్ట్రప్రభుత్వం వారి గురజాడ స్మారక అవార్డు, గిడుగు భాషా పురస్కారం లభించాయి. రాంబాబు అనారోగ్యంతో ఉన్నప్పుడే అజోవిభో కందాళై వారి విశిష్టప్రతిభామూర్తి అవార్డు వచ్చింది. ఆ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని తానుగా తీసుకోవడానికి వెళ్ళలేకపోయినందుకు చాలా బాధపడ్డాడు. ఆ సంస్థ నిర్వాహకులే ఇంటికి వచ్చి దానిని రాంబాబుకి అందజేశారు.
రాంబాబు సమాజసేవాభావన కలిగిన పరోపకారి కూడా. నిమ్స్ లో తండ్రిపేరున డయాబెటిక్ రిసెర్చ్ సెంటర్ కు, హిమోఫీలియా క్లినిక్ లకు, చుండూరులో సత్ర నిర్మాణానికి విరాళాలిచ్చాడు. ఇలా...ఒక వ్యక్తిగాక, ఒక మహోద్యమశక్తిగా -ఇన్ని మహత్తరమైన, చారిత్రక ప్రాధాన్యం కలిగిన సాహిత్య కార్యక్రమాల్ని నిర్వహించిన రాంబాబు అనారోగ్యంతో అకాలమరణానికి గురికావటం సాహితీలోకానికి తీరని లోటు.
సింహప్రసాద్ సాహితీ పీఠం వారు వేదగిరి రాంబాబు అవార్డుని యువ కథా రచయితలకు అందజేస్తున్నారు. బాలసాహిత్య అవార్డునీ ఇస్తున్నారు.
అసలు వేదగిరి రాంబాబు కథానికా రచన ప్రవేశానికీ, అతని సాహితీ ప్రస్థానంలోని ముఖ్యఘట్టాల్లో మార్గదర్శకత్వానికీ నేను కారణం కావటం- నాకొక గౌరవంగానే భావిస్తున్నాను. తెలుగు సాహిత్య చరిత్రలో రాంబాబు కృషి ఒక ప్రత్యేక పరిచ్ఛేదంగా గుర్తింపబడాలి. అదే అతనికి సముచితమైన నివాళి అవుతుంది!
-విహారి