దస్తూరి ( కవిత)
BY Telugu Global3 Feb 2023 8:24 PM IST
X
Telugu Global Updated On: 3 Feb 2023 8:25 PM IST
చేతి వేళ్ళ మధ్య
అందంగా ఇమిడి
రంగు రంగుల లేఖినీలతో
అప్పటి మన మనసు లాంటి
తెల్ల కాగితంపై
అలవోకగా రాసిన
అక్షరాలను
తిరిగి ముద్దాడాలని ఉంది!
కాలం మారి
కలాలు కనుమరుగై
అక్షరాలను మింగేసిన యంత్రాలు
టైప్ మిషన్,
అచ్చు మిషిన్లు
కంప్యూటర్ కీ బోర్డ్
రూపాలు గా ఉన్నా
వాటికి చేతితో వ్రాసిన దస్తూరి
ఆయువు పట్టుగా ఉండేది
సెల్ ఫోన్ మాయాజాలం
జాడ్యమై
రాత కనుమరుగై
మనిషి ఆలోచనలకు
కాగితం, కలం మధ్య
అన్యోన్యత కరిగి
బొటన వేలు మీట నొక్కటాలతో
జీవం లేని అక్షరాలన్నీ
తెరమీద
దర్శనమిస్తున్నాయి నేడు
అయితేనేమి..
వేగం పెరిగినా
ఆధునిక విజ్ఞానం
రాతను కబలించినా
స్పందించే హృదయ గతులను
కదిలించే భావాలను హరించే
మర మనుషులం కానందుకు
మనమింకా ధన్యులమే సుమా !
( నీ చేతి వ్రాత ముత్యాల్లా ఉంటాయి అన్న మిత్రుడి పొగడ్త విని )
- డా.కె.దివాకరా చారి
Next Story