సహృదయ రచయిత డాక్టర్ ధేనువకొండ శ్రీరామమూర్తి
సంప్రదాయం, ఆధునికతల మేళవింపు డాక్టర్ ధేనువకొండ శ్రీరామమూర్తి (01 జూన్ 1947 - 17 ఆగస్టు 2017) జీవితం, సాహిత్యం. వారు వెళ్ళిపోయి ఇవాళ్టికి అయిదేళ్ళవుతుంది.
సంప్రదాయం, ఆధునికతల మేళవింపు డాక్టర్ ధేనువకొండ శ్రీరామమూర్తి (01 జూన్ 1947 - 17 ఆగస్టు 2017) జీవితం, సాహిత్యం. వారు వెళ్ళిపోయి ఇవాళ్టికి అయిదేళ్ళవుతుంది. మొన్న ఒక రోజు కంప్యూటర్‌లో పాత ఫైల్స్ చూస్తుండగా ధేనువకొండ గారి ఫోటోలు కనబడ్డాయి. చాన్నాళ్ళ కిందట అనుమల్ల గంగాధర్ ఆ ఫొటోలు తీశారు. ఆ ఫోటోలతోపాటు మరోసారి ధేనువకొండ గారి రచనలని చూసాను. ఆయన ఆకస్మిక మరణం గుర్తుకొచ్చింది. 2015లో కేంద్ర సాహిత్య అకాడమీ తరఫున చైనా బుక్‌ఫెయిర్‌కు హాజరయి చైనాలో పర్యటించారు. ఆ పర్యటన నుంచి వచ్చిన కొన్నాళ్ళ తర్వాత వారి ఆరోగ్యం దెబ్బతిన్నది. కానీ ఏడు పదుల వయసుకే అస్తమిస్తారని ఎవరం అనుకోలేదు. ఇప్పటికీ అనేక సందర్భాల్లో డాక్టర్ ధేనువకొండ గారు గుర్తుకొస్తారు. హైదరాబాద్, చీరాల, ఒంగోలు ప్రాంతాలకు చెందిన సాహితీ మిత్రుల మదిలో వారి స్మృతులు పదిలంగా ఉన్నాయి.
కవిత్వం, కథ, నవలా ప్రక్రియల్లో రచనలు చేయడంతో పాటు వైద్యవృత్తికి సంబంధించిన అనేక వ్యాసాలు రాశారు. ఆయుర్వేదాన్ని ఒక వైద్యంగానే గాక జీవన విధానంగా వ్యాప్తి చేసి అనేకమందికి స్వస్థత చేకూర్చారు. శరీర బాధలకు మందులు ఇవ్వడమే కాదు, మనసులకు సైతం చికిత్స చేసేవారు. ఓదార్పునీ, ధైర్యాన్నీ, బతుకుపై మమకారాన్నీ పెంచేలా ఆత్మీయమైన మాటలు చెప్పేవారు.
2002-03 ప్రాంతాన మొదటిసారి హైదరాబాద్ హరిద్వార్ హోటల్‌లో కాశీభట్ల వేణుగోపాల్ సమక్షంలో శ్రీరామమూర్తి గారు పరిచయమయ్యారు. ఆ పరిచయం స్నేహంగా మారడానికి ఎక్కువకాలం పట్టలేదు. అప్పటికి 'ఆశల సముద్రం' కవితా సంపుటి మాత్రమే వచ్చింది. 'అమ్మఒడి' దీర్ఘకవిత పుస్తకరూపం దాల్చబోతున్నది. ఆ క్రమంలో రమణజీవి దగ్గర బుక్ డిజైన్ చేస్తున్న సందర్భంగా ఆ పుస్తకం మొత్తం చదివాను. గ్లోబలైజేషన్ తాకిడికి ఊళ్ళు కొట్టుకుపోతున్న దృశ్యం కనిపించింది ఆ దీర్ఘకవితలో. అభివృద్ధి పేరిట గుండ్లకమ్మ నది సమీపాన కట్టిన ప్రాజెక్టులో వారి స్వగ్రామం ధేనువకొండ నీట మునిగిపోయింది. శతాబ్దాల జీవన చరితం, సాంస్కృతిక వారసత్వం, ఆడిపాడిన నేల, ఆప్యాయంగా చూసుకున్న చెట్టు చేమలు రిజర్వాయర్‌లో మునిగి అదృశ్యమయ్యాయి. ఆకస్మికంగా అమ్మఒడి నుంచి దూరంగా విసిరేయబడ్డ పసిబాలుడు ఎలా తల్లడిల్లుతాడో ఈ కవి ఆవిధంగా అల్లాడాడు. ఆ సంవేదనలోంచి పుట్టిందే 'అమ్మఒడి'. భారతీయ గ్రామీణ జీవితం, ఆ జీవితంలోని పచ్చని ఛాయ కనుమరుగవుతున్న హృదయ విదారక సన్నివేశాన్ని 'అమ్మఒడి'లో రూపు గట్టించారు.
మా స్నేహం పెరుగుతున్న కొద్దీ వచనం వైపు మొగ్గు చూపుతూ వచ్చారు. కథలు రాయడం ఆరంభించారు. 'ఆయతనమ్' అనే కథ రాయడం కోసం ధర్మపురి క్షేత్రాన్ని సందర్శించాలనుకున్నారు. నేనూ, పగడాల నాగేందర్ కూడా వారితో పాటు ధర్మపురి ప్రాంతాన్ని సందర్శించాం. అక్కడి గోదావరి తీరప్రాంతం, అగ్రహారాలు, అక్కడి వేద పండితుల ఇళ్ళలోని తాళపత్ర గ్రంథాలు చూసాం. శతాబ్దాల ప్రాచీన వైభవాన్ని కోల్పోతున్న ధర్మపురిని ప్రత్యక్షంగా చూసాకనే 'ఆయతనమ్' కథ రూపు దిద్దుకుంది. 'ఆయతనమ్' కథకీ, ధర్మపురికీ ప్రత్యక్ష సంబంధం లేదు. కానీ ప్రాచీన సంప్రదాయానికీ, వారసత్వానికీ ప్రతీకగా నిలిచిన గ్రామ సందర్శన తన కథ పరిపుష్టికి తోడ్పడుతుందని భావించారు. కనుకనే కథారచనకు, నవలా రచనకు అవసరమైన సందర్భాల్లో క్షేత్ర సందర్శనకు వెళ్ళేవారు శ్రీరామమూర్తి గారు. 'యజ్ఞోపవీతమ్' కథ కూడా సాంప్రదాయానికీ, ఆధునిక జీవనశైలికీ నడుమ సంఘర్షణని చిత్రించింది.
తన కథలలో స్థానికతకు పట్టం గట్టారు డాక్టర్ శ్రీరామమూర్తి. అభివృద్ధి చెందిన ప్రాంతంగా పేరొందిన కోస్తాంధ్రలో వెనకబడిన ప్రకాశం జిల్లాకు చెందిన రచయిత డాక్టర్ ధేనువకొండ. చీరాల, ఒంగోలు వాటి పరిసర ప్రాంతాలతో ముడిపడిన జీవితాన్ని తన కథల్లో ప్రబలంగా చిత్రించారు. 'ఐలాండ్ విల్లా' కథల సంపుటిలోని కథలన్నీ ఈ కోవకు చెందినవే. శ్రీరామమూర్తి రాసిన 'ఐలాండ్ విల్లా, రంగారాయుడు చెరువు, కోర్టు సెంటర్' ఒంగోలు ప్రాంత నిర్దిష్టతని ప్రతిఫలించాయి.
'ఐలాండ్ విల్లా' ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ప్రకాశం పంతులు నివాసం పేరు. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ప్రకాశం పంతులుది ఘనమైన చరిత్ర. వారి జ్ఞాపకార్థం వారి నివాసాన్ని ఒక స్మారక భవనంగానో, మ్యూజియంగానో తీర్చిదిద్దవచ్చు. కానీ అపార్ట్‌మెంట్ల నిర్మాణం కోసం దానిని కూల్చివేశారు. తన జ్ఞాపకాల్ని నిలుపుకోలేని ఒక ప్రాంత దుస్థితిపై శ్రీరామమూర్తి గారు ఆవేదనతో రాసిన కథ 'ఐలాండ్ విల్లా'. ఇదే శీర్షికతో తొలి కథా సంపుటి వచ్చింది. అయిదు దశాబ్దాల కిందటి ఒంగోలు కోర్టు సెంటర్‌ను 'కోర్టు సెంటర్' కథలో దృశ్యమానం చేశారు. అలాగే ఒకనాడు ఒంగోలు నీటిసమస్యను తీర్చిన 'రంగరాయుడు చెరువు' క్రమంగా ఎలా అదృశ్యమవుతూ వచ్చిందో చెప్పిన కథనే 'రంగరాయుడు చెరువు'. ఒంగోలులో అరవై ఏళ్ళ కిందటి బతుకు దృశ్యాన్ని, ఆనాటి రాజకీయ నాయకుల చేతననీ, మనుషుల్లోని మంచీచెడును చర్చకు పెట్టిన చక్కటి కథ ఇది.
ఒంగోలు ప్రాంత నిర్దిష్టతతోపాటు సామాజిక జీవనంలోని వైరుధ్యాల్నీ, వ్యక్తుల జీవితాల్లోని కల్లోలాల్నీ, వైద్యవృత్తికి సంబంధించిన అంశాల్ని మంచి కథలుగా మలిచారు. వీటితో 'మోహతిమిరం' శీర్షికన రెండో కథల సంపుటి వచ్చింది. 'చిగురించని శిశిరం, జలయజ్ఞ సమిధలు, క్రౌంచ వియోగం, పశ్యతి, మోహతిమిరం, నల్లబ్బి, పశుర్వేత్తి' వంటి కథలు వారి నుంచి వచ్చాయి.
వ్యవస్థలు ఎంత సంక్లిష్టంగా ఉన్నా, చుట్టూ వున్న వారిలో స్వార్థం, చెడ్డతనం ఎలా వున్నా మంచిని మాత్రమే చూసే నైజం డాక్టర్ శ్రీరామమూర్తి గారిది. ఈ సానుకూల దృష్టికోణమే వారి కథల్లోని కనిపిస్తుంది. గత, వర్తమానాల మధ్య అల్లుకున్న మానవ జీవనయానాన్ని డాక్టర్‌గారు తమ కథల్లోనూ, నవలల్లోనూ చిత్రించారు. రెండు నవలలు సీరియల్‌గా వచ్చాయి. తొలి నవల 'స్నిగ్ధచ్ఛాయ'. మరో నవల 'కామరూప' సీరియల్‌గా వచ్చింది కానీ పుస్తకరూపం దాల్చలేదు.
వచనం రాస్తున్నప్పటికీ కవిత్వం నుంచి దూరం కాలేదు. తాత్వికపరమైన చింతన వారి కవిత్వంలో దాగుంది. 'ఆశల సముద్రం' తరువాత 'వల్మీకం', 'చింతయామి' అనే రెండు కవితా సంపుటాలు వెలువడ్డాయి. రెండు పుస్తకాలుగా వెలువడాల్సినన్ని కవితలు, కథలు ఉన్నాయి. ఆయుర్వేదానికి సంబంధించి దాదాపు వందకు పైగా వ్యాసాలు రాశారు. వారు 'సెరిబ్రల్ పాల్సీ' మీద 'వార్త'లో రాసిన వ్యాసానికి మంచి స్పందన వచ్చింది. నెలల తరబడి డాక్టర్ గారి అడ్రసు కోసం వందల మంది ఫోన్లు చేశారు. తరచుగా సాహిత్యం గురించీ, తను చేయాలనుకున్న రచనల గురించి చెప్పేవారు. ఓ బృహత్తరమైన నవల రాయాలన్నది వారి ఆలోచన. తన కన్నా వెనకటి రెండు తరాల నుంచి మొదలుకొని తన మనవడు అచ్యుత్ తరం వరకు గల జీవన వైశాల్యాన్ని ఇతివృత్తంగా తీసుకొని పెద్ద నవల రాయాలని తలపోశారు. ఈవిధంగా అయిదుతరాల జీవితాన్ని రికార్డు చేయాలని సంకల్పించారు. ఈ విషయమై అనేకసార్లు తన ఆలోచనల్ని పంచుకున్నారు. కానీ కాలం చిత్రమైంది.
ఆకస్మికంగా తనని ఆగస్టు 17, 2017న తీసుకెళ్ళిపోయింది. అపుడే వారు వెళ్ళిపోయి అయిదేళ్ళయిందా అనిపిస్తుంది. వారి కవిత్వానికీ, కథలకీ, ఇతర రచనలకీ ప్రాసంగికత వుంది. ఎందుకంటే ఏదో ఒక తీవ్రతకు లోనుగాక సంయమన దృక్పథంతో డాక్టర్ శ్రీరామమూర్తి గారు చేసిన రచనలు విలువైనవి. మన కాలానికి అవసరమైనవి. కనుకనే డాక్టర్ ధేనువకొండ శ్రీరామమూర్తి రచనలు సమగ్ర సంపుటాలుగా వెలువడటం అవసరం. తద్వారా వారి సాహిత్యం ముందుతరాల పాఠకులకు అందుబాటులో ఉంచినట్టవుతుంది. ఇదే వారికి మనం అర్పించే సుమచిత నివాళి.