స్త్రీ శక్తికి వందనాలు
"యా దేవీ సర్వ భూతేషు
శక్తి రూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై
నమస్తస్యైనమోనమః”
అని సర్వ ప్రాణికోటిలో శక్తి (energy ) రూపంలో వున్న స్త్రీశక్తికి నమస్కరించుకుంటూ అసలీ శక్తి స్వరూపం ఎలా ఏర్పడిందో దేవిభాగవతం లోని శ్లోకంలో చూద్దాం.
"అతులం తత్ర తత్తేజః సర్వదేవశరీరజమ్।
ఏకస్థం తదభూన్నారీ వ్యాప్తలోకత్రయం త్విషా॥"
దేవతలందరిలోంచి పుట్టి, మూడు లోకాలలోనూ వ్యాపించిన ఆ సాటిలేని తేజస్సు ఒక్కచోట కలసి స్త్రీగా సంతరించుకుంది.
ఒకప్పుడు మహిషాసురుడు బ్రహ్మ గురించి తపస్సు చేసి మానవులు, దేవతల చేత మరణం లేకుండా వరం పొందుతాడు. వరప్రభావంతో దేవతల మీద, భూలోకం మీద దండెత్తిదేవతలను ,
మానవులను అణచివేస్తాడు. అప్పుడు దేవతలందరూ వారి వారి శక్తులన్నింటినీ క్రోడీకరించి సుందరమైన నవయవ్వన యువతిని మహిషాసురుణ్ణి చంపగల సమర్థురాలను సృష్టిస్తారు.
సర్వ శక్తిమంతురాలైన
ఆ దుర్గాదేవి అసురుడి తో యుద్ధంచేసి 9 వరోజు అతనిని సంహరించింది. అలా అజేయమైన స్త్రీ సృష్టి జరిగినది.
ఆ దేవి అంశగల స్త్రీలు అన్యాయాన్ని ,అధర్మాన్ని ఎదిరించగల శక్తులుగా నేటికీ విలసిల్లుతున్నారు.
రానున్న ఈ మార్చి 8 మహిళా దినోత్సవం నాడు మహిళలకు స్ఫూర్తిగా నిలచిన వారిని ఒక్కసారి స్మరించుకోవడం, వీలైతే ,నచ్చితే వారి బాటలో నడవడం ,అదీ కాదంటే వారి ధైర్య స్థైర్యాలకు చింతాకు(ఆలోచన అనే దళం) సమర్పించడం మన బాధ్యత.
మైత్రేయి ,గార్గి వంటి వేదకాలపు మహిళలు , సీత, సావిత్రి, ద్రౌపది వంటి ఇతిహాస కాల మహిళలు, ఝాన్సీ, రుద్రమదేవి వంటి మొన్నటి మహిళలు, సరోజినీ నాయుడు, ఇందిరాగాంధీ వంటి నిన్నటి మహిళలు, నిర్మలసీతారామన్ , రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వంటి నేటి మహిళలవరకు అనేకమంది విశిష్ట రంగాలలో తమ తమ అస్తిత్వాన్ని నిలుపుకొని ఆదర్శంగా నిలిచి ఉన్నారు.
"యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా
యత్రైతాస్తు న పూజ్యంతే సర్వాస్తత్రాఫలా: క్రియా:''
సర్వగుణ సమాహారమైన నారి ఎక్కడ పూజింపబడుతుందో అక్కడ దేవతలు ఆనందిస్తారు, వారు అగౌరవ పరచబడిన చోట సకల చర్యలు నిష్ఫలమన్నమాట అందరెరిగినదే.
సమాజాన్ని చక్కగా తీర్చిదిద్దగల సామర్థ్యం ,కుశలత ఆమె సొత్తు.దేవుడన్నిచోట్లా వుండలేక శక్తిస్వరూపిణి అయిన తల్లిని సృష్టించాడు అని చెప్తారు,
రాజుభార్య, గురువు భార్య, స్నేహితుని భార్య, భార్యతల్లి, స్వంతతల్లి- వీరైదుగురినీ మాతృమూర్తులుగా, శ్రేయోభిలాషులుగా,మార్గ నిర్దేశకులుగా, గౌరవనీయులుగా, సౌఖ్యప్రదాతలుగా,జీవిత. పరమార్థాన్ని బోధించేవారిగా గౌరవించి కృతజ్ఞతతో వుండాలని నేర్పించే పుణ్యభూమి మన భారతదేశం.
నేలనూ ,నీటి ని కూడా స్త్రీస్వరూపంగానే భావించి, భూమాత, నదీ మాతగా పిలుచుకునే మనం ఆ
స్త్రీ శక్తికి
వందనాలు చేద్దాం.
-డా.భండారం వాణి