శ్లోకమాధురి : భారవి భావన
సంస్కృత పంచ మహాకావ్యాలలో ఒకటైన భారవి రచించిన కిరాతార్జునీయం, అష్టాదశ వర్ణనలతో, కల్పనలతో, గంభీరమైనటువంటి భావములతో కూడి ‘భారవేరర్థ గౌరవం’ అని కీర్తనార్జించుకొన్నది.
రాజశేఖరుడు క్షేమేంద్రుడు వంటి కావ్యశాస్త్ర పండితులు సూర్యతేజస్సు వంటిది భారవి కావ్యంఅని ‘భారవేరివ భారవేః’అని ప్రశంసించారు.
ప్రధానంగా కావ్య ప్రథమసర్గలో
వనేచరుడు దుర్యోధనుని రాజ్య పరిపాలన పద్ధతి విధానము, అది విని వ్యథ అవమానముతోకూడిన ద్రౌపది ఉపదేశవచనములు, కోపోద్రిక్తుడైన భీముడు ఆమెను సమర్థిస్తూ చేసిన గర్జనలు , వారిద్దరిని అనునయిస్తూ ధర్మరాజు పలికిన నీతియుక్త శాంతి వచనములు, తృతీయసర్గలో ధర్మరాజ వ్యాసభగవానుల సంవాదం,ఇంకా ఇంద్రార్జునుల,శివదూత-అర్జునుల సంవాదము--- ఇలా సంస్కృత సాహితీ జగత్తులో స్వల్ప శబ్దంలో అపారమైన అర్ధాన్ని ఇనుమడింపజేసి రసానుకూలముగా పాత్రల యొక్క స్వరూప స్వభావాలకు తగినట్టుగా వాక్చాతుర్యాన్ని ప్రదర్శిస్తూఆద్యంతము ఔచిత్యాన్ని దాటకుండా శాంతిపూర్వకంగా సమన్వయము చేస్తూ భారవి రచనారీతిని అర్థగాంభీర్యాన్నితెలుపుతున్నాయి.
భారవి కవి గొప్పతనాన్ని చాటుతూ మల్లినాథుడు నారికేళపాకమని అభివర్ణించి ఘంటాపథమనే వ్యాఖ్యానం రచించాడు.
ధర్మరాజు భీముని మాటలను పొగుడుతూ అన్ని మాటలు ‘ఇతని మాటలలో స్ఫుటత్వం దూరంకాలేదు,అర్థగౌరవం
వదలివేయబడలేదు,మాటలు తమతమ అర్థాన్ని చెబుతున్నాయి,వాటి సామర్థ్యం ఎక్కడా కుంటూ పడలేదు’
అన్న మాటలు భారవి కవిత్వానికి కూడా వర్తిస్తాయి.
అలా అంటూనే "ఏ పని చేసినా చాలా జాగ్రత్తగా ఆలోచించి చెయ్యాలి తొందరపాటు పనికిరాదు ,అవివేకం అనేక కష్ట నష్టాలకు మూలం.బాగా ఆలోచించి కార్యనిర్వహణకు పూనుకునే వివేకవంతునికి సద్గుణమునందు ప్రీతి గల సంపదలు తామంత వచ్చి స్వయంగా వరిస్తాయి కదా "అని అంటున్న శ్లోకమిది - సహసా విదధీత న క్రియా మవివేకః పరమాపదాం పదం వృణుతే హి విమృశ్యకారిణం గుణలుబ్ధా స్స్వయమేవ సంపదః (2-30)
ఆవేశం లో ,కోపంతో తొందరపడిచేసిన పని వలన కార్యాకార్యాది విచక్షణ నశించి, శరీరానికి, ఇంద్రియాలకు కూడా హాని కలుగుతుంది. సమయంకాని సమయంలో ఉద్రేకంలో ఆచరించిన వానివలన అనర్థపరంపరలు కలు గుతాయి
పై శ్లోకాన్ని మదుపు పెట్టుకున్న వర్తకుడు 20 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చి నవ యువకుని తో నున్న భార్యనుచూసి అనుమానించి శిక్షింపబోతూ శ్లోకార్ధాన్ని చదివి ఒక పూట - ఆ రాత్రికి ఆగి మర్నాడు పొద్దున యువకుడు తన కుమారుడే అని తెలిసి- తనకు ఆ శ్లోకం చేసిన మేలును గ్రహించి అక్షర లక్షలు ఇచ్చి కావ్యాన్ని కవిని సత్కరించాడన్న
కథ అందరికీ తెలిసిందే.
అలాగే కూతురు దేవయాని పట్ల అతిప్రేమ తో శుక్రాచార్యుడు కచునికి మృతసంజీవనీ విద్యనేర్పాల్సి వచ్చింది, అంతేగాక అల్లుడయిన యయాతిని వృద్ధుడవమనిశపిస్తాడు,ఆలోచించకుండా కోపంలో కానీ ,అతిప్రేమతో కానీ చేసే పనులు అనార్థానికే దారి తీస్తాయి.
ఇలాంటివే పంచతంత్ర అపరీక్షత కారకంలో విష్ణుశర్మ బ్రాహ్మణ నకుల కథల ద్వారా ఇదే విషయాన్ని నొక్కి వక్కాణించాడు.
ఏ పనిని గాని సరిగా చూడక. సరిగా తెలుసుకొనక, సరిగా పరీక్షింపక చేయకూడదు అనీ , వివేకరహితంగా చేసే కర్మ శుభ ఫలితాలనివ్వదు. విధినిషేధ కర్మలను ఆలోచించి ఆచరిస్తే సంపదలు వాటంతటవే కార్య సాధకుని పరిస్తాయి. ఏ విధంగా స్వయంవరంలోని కన్య అందరి మధ్యలో తనకు అనుకూలమైన వరుని వరిస్తుందో అలాగే విజయశ్రీ విమృశ్య కారులనే వరిస్తుంది.
ఏ పని అయినా చేసే కన్నాపూర్వమే దానిలోని లాభనష్టాలను, సుఖదుఃఖాలను,కష్టసుఖాలను బేరీజు వేసుకొని లాభమైనటువంటి కర్మ సుఖకరమైనటువంటిది జయము నిచ్చినది అయిన కర్మల నాచారించాలి,మాట్లాడాలి.
ఇట్టి రచనా నైపుణ్యంతో పదిమంది ప్రశంసలకు పాత్రుడయ్యే విధంగా ప్రజ తమ ప్రవర్తనను దిద్దుకునే లాగా గంభీరభావాన్ని వ్యక్తం చేయటమే భారవి ప్రత్యేకత.
డాక్టర్ .భండారం వాణి