దీపావళి ఊసులు - రాయప్రోలు వెంకట రమణ శాస్త్రి
పండగల్లోకే ప్రత్యేకం దీపావళి పండగ.
పండగ అనే మాట వాడితే తక్కువ చేసినట్లు అన్పిస్తుంది. ఇది చిన్నా - పెద్దా పిల్లల సంబరం.
ఓ సంబరాల సమాహారం.
దీపావళి విషయంలో ఎవరి అనుభవాలు వాళ్ళవి. అందరివీ వీరోచిత గాధలే.
దీపావళి విషయమొస్తే ప్రతి ఒక్కళ్ళూ "మా చిన్నతనంలో అయితే…. " , " ఒక సారి ఏమైందో తెల్సా…" అంటూ దీర్ఘాలు తీస్తూ కబుర్లు చెప్పడం మొదలు పెడ్తారు.
అంటే ప్రతి ఒక్కరూ చిన్నతనం లో తలచుకుంటే పులకించి పోయేంతగా దీపావళి సంబరాన్ని ఆనందిస్తారు, అనుభవిస్తారు.
దీపావళి విషయంలో చిన్నతనం అంటే ఏ ఆరు, ఏడు ఏళ్ళ వయసుతోనో ఆగిపోదు, ఆ చిన్నతనం 25 — 30 సంవత్సరాల దాకా ఉంటుంది. టపాసులు కాల్చడానికి భయపడని వాళ్ళు
పెళ్ళి అయి పిల్లలు పుట్టాక కూడా దీపావళి ఎంతో సంబరంగా జరుపుకుంటారు.
ఎవరి దీపావళి అనుభవాలు వాళ్ళకి గొప్ప - అనిపించచ్చు. కానీ ప్రతి ఒక్కళ్ళ అనుభవం రమ్యంగానే ఉంటుది - అదే దీపావళి ప్రత్యేకత. అట్లాంటిదే మా చిన్ననాటి దీపావళి అనుభవం!
"మా చిన్ననాటి" అని చెప్పడానికి కారణం, నిజానికి ఇది ఏ ఒక్క వ్యక్తి అనుభవమో కాదు - మా పేట, వాడా మొత్తానిదీనూ. అక్కడ పెరిగిన రెండు మూడు తరాలదీనూ. ఆ ఆనందం అందరి వల్లా కలిగింది.
అందరూ దీపావళికి జువ్వలు (రాకెట్లు) కొనుక్కుంటారు! మాపేటలో కుర్రాళ్ళు జువ్వలు కొనరు - ఇంట్లో తయారు చేస్తారు. జువ్వలు బయట కొనడం ఒక పరువుతక్కువ పనిగా, చేతగాని పనిగా భావించే వాళ్ళం.
ఇంట్లో చేసిన అవ్వాయ్ చువ్వలు ఎగరేయడం మగతనానికి ప్రతీక మా పేటలో.
10 సంవత్సరాలు దాటిన ప్రతి మగ పిల్లడూ మొదలుపెట్టే ధీరోదాత్తమైన సర్టిఫికెట్ కోర్స్ - జువ్వలు ఇంట్లో చేసి కాల్చడం.
ఎంత ఆసక్తి, శ్రద్ధపెట్టి, శ్రమ పడి చేస్తారో ప్రతివాళ్ళూ.
అవ్వాయ్ చువ్వాయ్ ల తయారీ ప్రమాదభరితం కూడా. అయినా పిల్లల ఉత్సాహం పెద్దల్ని మౌనం వహించేలా చేస్తుంది. తమ సంతానం చేసిన జువ్వ ఆకాశం లోకి దూసుకు పోతుంటే ఆ తల్లిదండ్రుల కళ్ళల్లో ఆశ్చర్యం, ఆనందం చూసి తీరాల్సినదే.
దీపావళి వస్తోందంటే ఇంట్లో ముందే వార్నింగు - "ఈ సారి ఆ జువ్వల తయారీ పెటకం పెట్టావంటే ఊరుకొనేది లేదు". ఇది సిగిరెట్ పెట్టె మీదా, మద్యం సీసా మీద ఉండే హెచ్చరిక లాంటిది. దానికి పిల్లలు ఇచ్చే విలువ - పోలీసు లేని ట్రాఫిక్ సిగ్నెల్ కి ఉన్నంత.
వద్దనడానికి కారణాలు - ఇంట్లో ఒక గది కాని, అందులో సగం కాని ఈ కార్ఖానాకి వదిలెయ్యాలి. అదికాక ఆ జువ్వల మందులో వాడే సూర్యకారం, బొగ్గు, గంధకం నుండి వచ్చేవాసన (పడని వాళ్ళు కంపు
అంటారనుకోండి), ఇల్లంతా పరిచి ఉండే తయారి వస్తువులు, మందు గొట్టాలలో కూరేటప్పుడు అయ్యే శబ్దం, ఇవన్నీ భరించాలంటే కొంచెం కష్టం, మరి కొంచెం చికాకునూ. బొగ్గు నూరి సన్నగా వస్త్రకాయితం పట్టేటప్పుడూ, గొట్టాల్లో మందుకూరేటప్పుడు ,చీదినా నల్లటి పదార్ధం వస్తూంటుంది.
అవ్వాయ్ చువ్వల తయారీకి వారం నుండి పది రోజులు కావాలి. మందు కూరే గొట్టం తయారు చేయడానికి వాడేసిన పోస్టు కార్డులు, పేక ముక్కలు, వాడేసిన కార్డబోర్డ్ ఛార్ట్ లు వెతుక్కోవాలి. తేలికపాటి బొగ్గు కోసం బాదం కట్టె గాని, ప్యాకింగ్ కోసం వాడే జాజిచెక్క పెట్టెలుగాని ఏర్పాటు కావాలి. వీటి కోసం ముందుగా ప్లాన్ చేసుకొని ఉండాలి, అప్పుడే కావల్సినంత బొగ్గు దగ్గర పెట్టుకోవచ్చు. జువ్వలకి కావల్సిన గొట్టాలు చేసుకొని, మందు కూరేటప్పుడు గొట్టం పగల కుండా ఉండడం కోసం చుట్టూ నార గాని, సన్నటి పురికొస గాని చుడుతాం. ఇందుకోసం మైదా కావాలి.
తర్వాత మందు సామాను కొనడానికి డబ్బులు కావాలి. కాబట్టి ఇంట్లో వాళ్ళకి తెలియకుండా, డబ్బులు తీసుకోకుండా చేసే అవకాశం లేదు అందుకే వాళ్ళ అనుమతి అవసరం.
అనుమతి అడిగితే "ఈసారికి వద్దులే" అంటారు. చివరి వారంలో "ఊ.. కానీ. ప్రతిసారీ ఇదొక గోల ఇంట్లో" అంటూ ఒప్పుకున్నా అప్పుడు సమయం చాలదు. పైగా ఏ వర్షాలో తగులుకున్నాయంటే ఇంక అస్సలు కుదర్దు. అందుకే సగం తయారీ అయ్యే దాకా రహస్యంగా ఉంచే వాళ్ళు పిల్లలు.
అవ్వాయ్ చువ్వాయ్ తయారీలో ఇంట్లో ఆడవాళ్ళ సహాయ సహకారాలు కూడా ఉండేవి. మైదాపిండి వండి ఇవ్వడం, వస్త్ర కాయితం కోసం పాత కాటన్ చీరె దానం చేయడం - అమ్మ పని.
చుట్టిన గొట్టాలు ఆరబెట్టడం, వర్షమొస్తే ఇంట్లో పెట్టడం, బొగ్గు సూర్యకారం నూరి సన్నని వస్త్రకాయితం పట్టడం లో చేతి సాయం, కూరిన జువ్వలకి చీపురు పుల్లలు కట్టడం - ఇత్యాది పనులన్నింటిలో అక్కచెల్లెళ్ళు, మేనకోడళ్ళు, వదిన, పిన్ని అందరూ చెదోడు వాదోడే.
వీళ్ళూ జువ్వలు ఎగరేస్తారు - బాగా ఎగిరితే మెచ్చుకుంటారు, ఎగరకపోతే "తుస్సు మంది" అంటూ వెక్కిరిస్తారు.
అవ్వాయ్ చువ్వలు ఈ పండక్కి తయారు చేస్తున్నామా లేదా అనేది స్నేహితుల మధ్య కూడా రహస్యంగా ఉంచేస్తుంటాం. చేస్తున్నట్లు పండగ ఇంకా రెండు రోజులో , ఒక రోజో ఉందనంగా ఎట్లా అయినా అందరికీ తెలిసి పోతుంది.
నరక చతుర్ధశి ఉదయం నాలుగు వీధుల కూడలిలో ( సెంటర్ అని పిలిచే వాళ్ళం) నరకాసుర వధ, దహనం అయ్యాక ఒక్కొక్కళ్ళు వాళ్ళు చేసిన జువ్వలు, సిసింద్రీలు (ఇది కూడా జువ్వల మందుతోనే చేస్తాం) తెచ్చి దేవుడి రధం దగ్గర "చద్ది టపాకాయ"గా కాల్చినప్పుడు అందరికీ తెలిసి పోతుంది.
ఈ తయారీ విషయాన్ని రహస్యంగా మిత్రులకి కూడా చెప్పకుండా ఉంచడానికి కారణాలేంటంటే - మనం చేసిన జువ్వలు సరిగ్గా తయారవక ఎగరకపోతే అందరిలో అవమానం, ఇంకోటి - "అరే, నువ్వు చేసినవి తేరా, చూద్దాం " అనే మిత్రుల వత్తిడికి పండగకి ముందే చేసినవన్నీ అయిపోతాయని.ఇంకా
మనం చేసిన జువ్వలు నరక చతుర్దశి నాడు మాత్రమే బయట పెట్టి అందరికీ ఒక ఆశ్చర్యం కలిగించాలనుకోడం, - ఇవన్నీనూ.
చతుర్ధశి ఉదయమే లేచి తలస్నానం చేసి తయారై సెంటర్ కి వచ్చేవాళ్ళం. వేణుగోపాలస్వామి గుడి నుండి రథం లో స్వామి , సత్యభామా సమేతుడై నాలుగు వీధులా ఊరేగి చివరికి కూడలి దగ్గరకొస్తాడు.
గడ్డి తో చేసిన నరకాసురుడి బొమ్మని ఎత్తి పట్టుకొని ఒక వ్యక్తి గెంతులు వేసుకుంటూ వచ్చి రథం చుట్టూ వీరంగం వేస్తాడు. కొంచెం దూరం వెళ్ళి అక్కడి నుండి పరిగెత్తుకుంటూ రథం దగ్గరకొచ్చి స్వామిని కవ్వించి నట్టుగా ఎగురుతుంటాడు. అలా వాడిని ఎగరనిచ్చి ఎగరనిచ్చి కొద్ది సేపటి తర్వాత, ఆచారిగారు స్వామి చేత, అమ్మవారి చేత బాణాలు వేయిస్తారు. దాంతో నరకాసురుడు వధింప బడతాడు. ఈ సంబరం చూడ్డానికి పిల్లా పెద్దా అంతా సెంటర్ చేరుకొని ఉంటారు.
అప్పటిదాకా దేవుడి రథం దగ్గరే చేరి వినోదం తిలకించిన అందర్నీ కొంచెం దూరం జరిగించి, నరకాసురుణ్ని తీసుకెళ్ళి కూడలిలో ఉన్న ఒక పెద్ద బండకి ఆనించిఉంచినిప్పంటిస్తారు.
అలా దహనమౌతున్న నరకాసుడు లోంచి టపాకాయలు
పేలుతుంటాయి- చేతుల్లో, కళ్ళల్లోంచి కాకర పువ్వొత్తుల రవ్వలు; పొట్ట దగ్గర చిచ్చుబుడ్డి, మతాబుల పూలరవ్వలు; చివరిగా తలకాయలో పెట్టిన బాంబుతో కపాల మోక్షం; - ఇవన్నీ చూడడం ఓ గొప్పఅనుభూతి.
నరకాసుర దహనం తర్వాత స్వామి రథం తిరిగి కోవెలకి వెళ్ళి పోతుంది. అప్పటి దాకా దూరంగా ఇళ్ళ అరుగులెక్కి ఉత్సవం వేడుక చూస్తున్న పిల్లలంతా ఒక్కసారి క్రిందికి వచ్చి వాళ్ళ వెంట తెచ్చుకున్న టపాకాయలు కాల్చడం మొదలు పెడ్తారు.
జువ్వలు చేసిన వాళ్ళు అవి తీసుకొచ్చి కాల్చడం, స్మేహితుల చేత కాల్పించడం చేస్తారు. మనం చేసిన జువ్వలు ఆకాశంలోకి దూసుకెళ్తుంటే సంబరం అంబరాన్నంటుతుంది. అందరూ మెచ్చుకుంటుంటే ఛాతి విరుచుకొని పొంగిపోయి వడివడిగా ఇంటికెళ్ళి ఇంకో పది జువ్వలు తెచ్చి కాల్చే వాళ్ళం, కాల్పించే వాళ్ళం.
జువ్వలు చేత్తో కాల్చడం ఒక నేర్పు కూడా. జువ్వని వెలిగించి నాలుగైదు సెకన్లు పట్టుకొనే ఉండాలి. జువ్వ రెండోభాగం అంటుకోగానే దానికి ఎగిరే బలం వస్తుంది, అప్పుడు వదలగానే ఆకాశంలోకి దూసుకు పోతుంది. ఇది చేతకాక చేతులు కాల్చుకునే వాళ్ళు, ఎదుటి వారి మీద పడేసే వాళ్ళ వల్ల ప్రమాదాలు కూడా జరుగు తుండేవి.
ఇళ్ళల్లో తయారు చేసిన మతాబులు, చిచ్చుబుడ్లు, సిసింద్రీలు, జిల్లీలు తెచ్చి కాల్చేవాళ్ళం. పిల్లలు కాల్చే టపాసులతో ఆ ప్రాంతమంతా ఉత్సాహ, సంబరాలతో నిండి పోయేది.
లక్ష్మీకాంతం గారు వెలగకాయ ని తొలిచి అందులో జువ్వల మందు కూరి చేసిన వెలగబుడ్డి, చేత్తో కాలుస్తుంటే ఎంత వీరోచితంగా ఉండేదో. అది చాలా ప్రమాదకరమైన విన్యాసం కూడా. ఆయనకి ఒక యాభై అడుగుల దూరం వరకు ఎవ్వరం ఉండే వాళ్ళం కాదు. ఆ మాదిరి వెలగబుడ్డి టపాకాయ ఆయన తప్ప వేరే వాళ్ళెవరూ చేయగా, కాల్చగా నేను చూళ్ళేదు. అలా ఒక రెండు గంటలు నరక చతుర్ధశి ఉదయం వేడుక జరిగేది.
మిగిలిన రోజంతా స్నేహితుల తోనే గడిపే వాళ్ళం ఒక్క అన్నం తినడానికి మాత్రం ఇల్లు చేరే వాళ్ళం. పదేళ్ళ లోపు పిల్లలైతే స్నేహితుల కి తాము కొన్న టపాసులు చూపించడం, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళు కొన్నవి చూడడం ఒక సరదా.
టైలర్ దగ్గర ఇచ్చిన కొత్త బట్టలు తెచ్చుకోవడం కూడా ఒక పెద్ద కార్యక్రమమే. చెప్పిన టైమ్ కి బట్టలు కుట్టి ఇవ్వక పోవడం, మనల్ని కూర్చోబెట్టి మన ఎదురుగానే, కాజాలు - గుండీలు కుట్టటం వంటి విషయాలు సర్వ సాధారణం. దీని వల్ల పండగ సమయం కొంత నిరుపయోగం అయ్యేది.
దీపావళి ముందు రోజు లేదా దీపావళి రోజు ఉదయం కల్లా అవ్వాయ్ చువ్వల తయారి అయిపోవాల్సిందే. కొంత మంది పండుగ రోజు సాయంత్రం దాకా కూడా జువ్వల తయారిలో తల మునకలై పండగ అసలు సంబరాలని కూడా పోగొట్టుకునే వాళ్ళు.సంధ్యా సమయంలో దీపాలు వెలిగించాక కొన్న టపాకాయలూ, చేసుకున్న మతాబులు, చిచ్చుబుడ్లు కాల్చిన తర్వాత మన హోమ్ మేడ్ జువ్వలు ఇంట్లో అందరు పెద్దవాళ్ళూ ఆడ మగా తేడా లేకుండా కాల్చేవాళ్ళం.
ఇంటి దగ్గర టపాకాయలు కాల్చడం అయ్యాక రాత్రి తొమ్మిది గంటలకి కుర్రాళ్ళు అందరూ జువ్వలు పుచ్చుకొని సెంటర్ చేరే వాళ్ళం. అక్కడ ఒక వీధి చివర కొంత మంది చేరే వాళ్ళు. అప్పటి నుండి ఒక గంట సేపు జువ్వలు నేలబారుగా ఈ రెండు గుంపులు ఒకరి మీదికి ఇంకొకళ్ళు వదిలే వాళ్ళు. అది ప్రమాదకరమే అయినా, ఒకరిని చూసి ఇంకొకళ్ళు వీరోచితంగా వదిలే వాళ్ళు. మీదికి వస్తున్న వాటిని కొబ్బరి మట్టతో, చీపురుతో ఆపెయ్యడం, దాన్నే తిప్పి అది వేసిన వాళ్ళమీదకి పంపడం ఇట్లాంటి విన్యాసాలు జరిగేవి. అట్లా , ఎవరో ఒకళ్ళ వైపు జువ్వలు అయిపోయేదాకా, లేకపోతే పోలీసులు వచ్చేదాకా ఆ పోటీలు సాగుతుండేవి. మధ్యలో కొంతమం ది పోలీసులొస్తున్నారని పుకారు తెచ్చేవాళ్ళు. దాంతో ఎక్కడి జువ్వలు అక్కడ గప్ .. చుప్ … మళ్ళీ కాసేపటికి మళ్ళీ మొదలు.
అలా దీపావళి రాత్రి సాగేది.
*****
దీపావళి మర్నాడు స్కూలుకు గాని, కాలేజీకి గాని వెళ్ళాలంటే మనసొప్పేది కాదు. ఏదో తెలియని మాంద్యం మనసును ఆవహించి వదిలేది కాదు. అది మూడో వైరాగ్యం మనసుకు.
మొన్న మా ఊరేళ్ళి నప్పుడు స్నేహితుల దగ్గర వాకబు చేస్తే, "ఇంటి దగ్గర జువ్వలు చేసేంత సమయం ఎక్కడరా ఇప్పటి చదువుల్లో" అన్నారు.
"అక్కడ మందుగుండు కొని ఇక్కడ కొచ్చి చేద్దాం, మా పిల్లలకి ఆ ఆనందాన్ని చవి చూపిద్దాం" అనుకున్న నా ఆశ నిరాశే అయింది - "ఇప్పుడు అలా అమ్మడం నేరం" అని పచారీషాపు అతను చెప్పాడు.
మా తరం దీపావళి ఆనందం అంతరించి పోయింది.
సంతోషం ఏంటంటే - ఆ జ్ఞాపకాలు అంతరించిపోవు జీవించి ఉన్నంతకాలం .