Telugu Global
Arts & Literature

దివ్వెల దీప్తులు - బి. శ్రీ రామ్ రెడ్డి

దివ్వెల దీప్తులు - బి. శ్రీ రామ్ రెడ్డి
X

ప్రమద లందరు లెండి

ప్రమిద లను తెండి

ప్రాంగణమ్ముల నిండ

ప్రభలు గూర్చండి


చీకటి రాకాసి

చెలరేగి పోయే

చీకటి బేరములు

శిఖరములు చేరే


నర రూప ధారులు

నరకాసురులు

బేహారి రాయుళ్ళు

విర్ర వీగేరు


కారుణ్య రహితులు

కఠిన మానసులు

ధరల రథము లెక్కి

తరుముచున్నారు


ధాన్య రాశి తో పాటు

ధన రాశి పెంచి

భూ స్వాములు ప్రతిన

బూని యున్నారు


పండిన పంటలు

పాతర్లు నిండ

పాలేరు నయనాల

బాష్పములు నిండ


గుండెలందున పెద్ద

కుంపట్లు మండ

మధ్య కుటుంబినుల్

మ్లానులై చూడ


ధన లక్ష్మి యెక్కడో

దాగి పోవంగ

దారిద్ర్య దేవత

తాండవం బాడ


చక్ర వడ్డీల తో

సవనమ్ము జేసి

మార్వాడి లెక్క లు

మార్పు గావించే


ధన రాశిని గాంచి

దండాలు వెట్టి

ఘన మైన పూజలు

గావించి మురిసే


బీదల రక్తము

పీల్చెడు వీరు

అసురులే నిక్కము

అన్యు లింకెవరు


ప్రతి యింతి ఒక

సత్య భామగా మారి

చీకటి మనసుల

చీల్చి చెండాడ


ధర పైకి నాకము

తరలి రా నుండ

బాణసంచా కాల్చు

బాల బంధువులు


తనివి తీరగ గాంచు

తల్లి దండ్రులును

ప్రతి డెందము లానంద

వారాశి కాగా


భారతి కనుల

దీపావళి మెరయ

రండు హైందవ వీర

రమణుల్లార

తెండు దివ్వెలు నవ్య

దీప్తులేపార.

First Published:  23 Oct 2022 1:36 PM IST
Next Story