Telugu Global
Arts & Literature

దక్షిణ (కథ) - రాధిక మంగిపూడి (సింగపూర్)

దక్షిణ (కథ) - రాధిక మంగిపూడి (సింగపూర్)
X

శ్రీమతి మంగిపూడి రాధిక ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రముఖ రచయిత్రి, కవయిత్రి, వక్త, వ్యాఖ్యాత, అంతర్జాతీయ సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాల రూపకర్త, "శ్రీ సాంస్కృతిక కళాసారధి" సింగపూర్ సంస్థ ప్రధాన కార్యనిర్వాహకవర్గ సభ్యురాలు.

"గోల్డెన్ హెరిటేజ్ ఆఫ్ విజయనగరం" సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు, మరియు సంఘసేవకురాలు.



సింగపూర్ నుండి తొలి తెలుగు కథా రచయిత్రిగా 'తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్' పురస్కారం, సాంఘిక సేవా రంగంలో "సింగపూర్ ఉమెన్ ఎక్సలెన్సీ" పురస్కారం, "అంతర్జాతీయ ప్రవాస తెలుగు పురస్కారం – 2021", "స్వర్ణ వంశీ శుభోదయం అంతర్జాతీయ మహిళా పురస్కారం 2022" తదితర పురస్కారాలు అందుకున్నారు.

2 కవితా సంపుటులు, 2 కథా సంపుటులు, ఒక పద్య శతకం రచించారు.



"ఈ ముసలాడు మళ్లీ వచ్చాడు నా ప్రాణానికి! ఒకసారి చెప్తే అర్థం కాదు. నాలుగుసార్లు గట్టిగా చెప్పే విషయం కాదు." విసుగ్గా లోలోపలే తిట్టుకున్నాడు ట్రెజరీ ఆఫీసు గుమాస్తా వేణు.

"చూడండి తాతగారు! మీ పెన్షన్ ఎరియర్స్ కోసం కాగితాలు అన్నీ ఇచ్చేశారు కదా! మేము చూసుకుంటాం! మీరు ఇన్నిసార్లు ఇక్కడికి రానక్కర్లేదు. ఈసారి మీ అబ్బాయినో మనవడినో పంపండి. ఏదైనా అవసరమైతే వాళ్లతో చెప్పి కబురు పెడతాం." అన్నాడు వేణు, వాళ్ల దగ్గరైనా తమ దక్షణ వసూలు చేయవచ్చనుకుంటూ.

"నా కొడుకు కోడలు యాక్సిడెంటులో పోయి చాలా కాలమైంది నాయనా! నాకు ఒక్కతే మనవరాలు. దానికి వచ్చే నెలలో పెళ్లి. ఈ ఎరియర్స్ డబ్బులు ఈ నెలాఖరి లోపల అందకపోతే పెళ్లి ఆగిపోతుంది. అందుకే ఇన్నిసార్లు వస్తున్నాను. ఏమీ అనుకోకండి నాయనా! కొంచెం త్వరగా పని చూసిపెట్టండి. మీకు పుణ్యం ఉంటుంది." అంటూ బతిమాలాడు బడిపంతులు రామయ్య

. "మరి మా మామూలూ.." నసిగాడు వేణు.

"మీకు ఇది మామూలు విషయమే కావచ్చు. కానీ నాకు ఈ డబ్బు చాలా అవసరం. కొంచెం అర్థం చేసుకోండి బాబూ!" అన్నాడు రామయ్య ఇంకా దీనంగా.

రామయ్యకి ఎలా చెప్తే అర్థమవుతుందో వేణుకి తోచలేదు.

"కొంచెం మా ఫార్మాలిటీస్ మాకు ఉంటాయి. మీరు అర్థం చేసుకోవాలి తాతగారూ! "అన్నాడు మళ్లీ ప్రయత్నిస్తూ.

"అవును బాబూ! అందుకే అన్ని కాగితాలు జెరాక్స్ లు తీయించి పట్టుకొచ్చాను. ఏవి కావాలో చెప్పండి" అన్నాడు రామయ్య తడుముకోకుండా.

చేయి తడపనిదే ఆ ఆఫీసులో పనులు జరగవని వేణుకి బాగా తెలుసు. ఈ దరఖాస్తు పెట్టిన అందరి దగ్గర 10వేల రూపాయల దక్షణ వసూలు చేయడం వారికి మామూలే. అది ఆఫీసులో అందరూ పంచుకుంటారు. కానీ ఈ పెద్దాయనను చూస్తే వేణుకి జాలేసినా, దక్షణ విషయం ఎలా చెప్పాలో తెలీక విశ్వప్రయత్నం చేసి విఫలమయ్యాడు.

ఇంతలో పక్కగదిలో నుండి బయటకువచ్చిన పై ఆఫీసర్ నారాయణకు వేణు మాటలు వినిపించి

"ఎవరాయన? ఏం సమస్య?"అంటూ అడిగాడు.

పెద్దాయన నారాయణను చూసి నిలబడి నమస్కారం పెట్టాడు.

నారాయణకు నోటమాట రాలేదు. ఎదురుగా, చిన్నప్పుడు గాలికి తిరుగుతున్న తనను బడిలో చేర్పించి విద్యాబుద్ధులు నేర్పి ప్రయోజకుడిని చేసిన తన రామయ్య మాస్టారు. ఎప్పుడు నవ్వుతూ సుతిమెత్తగా పాఠాలు చెప్పిన మాస్టారు, చూపు మందగించి చిక్కి సగమైపోయి ఉన్నాడు.

నారాయణ వెంటనే రామయ్య కాళ్లకు దండంపెట్టి పలుకరించి కూర్చోబెట్టి కుశలప్రశ్నలు వేసాడు. రామయ్య కూడా నారాయణను పోల్చుకుని తన శిష్యుడు ప్రయోజకుడై ఆఫీసర్ అయినందుకు ఎంతగానో సంతోషించాడు.

నారాయణ విషయమంతా కనుక్కుని, వెంటనే రామయ్య కాగితాలు తెప్పించి సంతకాలు పెట్టి, నెలాఖరుకు అతని డబ్బులు బ్యాంకులో పడతాయి అని ధైర్యం చెప్పి పంపించాడు.

బాగా అలవాటైన దక్షిణ అందకపోయినా, తన గురువుకు సమయానికి సహాయం చేయగలిగానని నారాయణకు మాత్రం చాలా సంతృప్తిగా అనిపించింది ఆరోజు.

సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన నారాయణ ఇవాళ ఆ స్థానంలో ఉన్నాడు అంటే కారణం రామయ్య మాస్టారే. జీవితంలో నైతిక విలువలు, బాధ్యతలు అన్నింటి గురించి రామయ్య శిక్షణలో నేర్చుకునే పైకి వచ్చాడు.

కానీ ప్రభుత్వ ఉద్యోగంలో చేరాక తోటి అధికారుల తీరు, కుటుంబ పరిస్థితుల ప్రభావం, పట్టణవాసం "మరి మనం కూడా అవకాశం ఉన్నపుడే కాస్త వెనకేసుకోవాలి కదా! కాస్త మా గురించి కూడా ఆలోచించండి సార్!" అంటూ సహోద్యోగుల సలహాలు, అన్నీ కలిసి నారాయణ ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేశాయి.


కొన్నాళ్ల తర్వాత ఒకరోజు రామయ్య మళ్లీ నారాయణ ఆఫీసుకి వచ్చాడు. డబ్బులు అందాయని కృతజ్ఞతలు చెప్పి, మనవరాలి పెళ్లి శుభలేఖతో సహ ఒక చిన్న సంచి నారాయణ చేతిలో పెట్టాడు.

నారాయణ శుభలేఖ చూసి ఆనందించి స్వీట్లు అనుకొని సంచి తెరచి చూశాడు. సంచీలో 10వేల రూపాయల కట్ట కనిపించగానే నిర్ఘాంతపోయాడు.

రామయ్య నవ్వుతూ "పెళ్ళి పిలుపులకు తిరుగుతూ అనుకోకుండా మిగతా టీచర్లను కలిశాను. అందరి దగ్గర నువ్వు 10 వేల రూపాయలు తీసుకొని సంతకం పెట్టావని తెలిసింది. నేను నీకు చిన్నప్పుడు చదువు చెప్పినందుకు నాకు ప్రభుత్వం జీతం ఇచ్చింది. నా ఉద్యోగం నాకు భగవంతుడు ఇచ్చిన బాధ్యత అనుకుని చేశానే కానీ ఇన్నాళ్లూ ఎప్పుడూ విద్యార్థుల నుండి ఏది ఆశించలేదు. నీ నుండి ఇప్పుడు ఈ వయసులో నాకు వేరే గురుదక్షిణ అక్కర్లేదు. నీ రుణం నాకు వద్దు నాయనా! నాకోసం నువ్వు నీ వ్యక్తిత్వాన్ని మార్చుకోనవసరం లేదు. సుఖంగా ఉండు." అని చెప్పి లేచి వెళ్ళిపోయాడు.

నారాయణ బొమ్మలా ఉండిపోయాడు. నోట మాట రాలేదు. కాళ్ళు వణికాయి. కళ్ళు తెలీకుండానే చెమ్మగిల్లాయి. చేతిలో పదివేల కట్ట బదులు ఏదో పెద్ద రాయి ఉన్నట్లు చాలా బరువుగా అనిపించింది. రామయ్య మాస్టారు మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత కూడా నవ్వుతూనే సుతిమెత్తగా తను చెప్పదలచుకున్న పాఠం తాను చెప్పి వెళ్ళిపోయాడు.

నారాయణ అన్నాళ్ళూ పరిస్థితుల కారణంగా, కాలానుగుణంగా మారాననుకున్నాడే కానీ తన వ్యక్తిత్వమే తన అస్తిత్వం అనే ఈ విషయాన్ని తెలుసుకోలేకపోయానని గ్రహించాడు.

ఆ రోజు నుండి జీవితంలో నారాయణ మళ్లీ దక్షిణ జోలికి పోలేదు.

First Published:  19 Oct 2022 12:30 PM IST
Next Story