చెట్టు కొద్దీ గాలి
యజ్ఞపతిరావు గారు ఆ రోజు నిద్రనుండి అత్యుత్సాహంగా లేచేరు. వాకింగులో బ్రిస్క్ నెస్ కనబరుస్తూ చక చకా నడిచేరు. జాగింగ్ లో ఎన్నడూ కన్నెత్తి చూడని, పన్నెత్తి పలకరించని పరమాణువుల్లాటి వారొకరిద్దరిని,
" ఏవాఁయ్, ఎలాగుంటోంది ఆరోగ్యం?" అంటూ, నడక ఆపకుండానే కుశలం వాకబు చేసేరు.
ఎనిమిదో వింత చూస్తున్నట్టు నిలువునా కట్రాళ్లలా నిలబడిపోయిన వాళ్ళ జవాబు కోసం చూడకుండా అలాగే వదిలేసి, అలవాటుగా ముందుకు నడిచేసేరు.
బ్రేక్ ఫాస్ట్ టేబుల్ మీద వేడి వేడి ఇడ్లీలు, కారప్పొడి, కొబ్బరి పచ్చడి ఉంచి, పక్కనే మౌనంగా, అంతకన్నా, భయం భయంగా నిలుచున్న భార్య వైపు చూసి, చిరునవ్వు నవ్వేరు.
అత్యంత దయ కనబరుస్తూ "కూర్చో." అనేసేరు!! ఆమె కంగారు పడుతూ లోపలికి వెళ్లిపోయింది.
తొమ్మిదవుతుండగా తయారైపోయి, హాల్లోకి వచ్చేసేరు. తెల్ల బట్టల డ్రైవర్ అప్పటికే, వరండాలో నిలబడి అయ్యగారి కోసం చూస్తున్నాడు. బూట్ల టకటక వినగానే, గబుక్కున లోపలకి వచ్చి, బ్రీఫ్ కేసు అందుకుని, కారు దగ్గరకు పరుగెత్తేడు, తలుపు తెరవటం కోసం.
తారు రోడ్డు మీద జారుతున్న కారులో సుఖంగా వెనక్కి జారగిల్లేరు యజ్ఞపతిరావు గారు.
ఆర్యుల అత్యుత్సాహానికి కారణం వారి ఫ్యాక్టరీలో ఆరు వారాల పాటు నడిచిన లాక్ డౌన్ ఈ రోజు ఎత్తివేయ గలగటం. లాక్ డౌన్ కి కారణం మామూలే. జీతాలు చాలటం లేదని వర్కర్ల ఏడుపు. లాభాలు తగ్గిపోతున్న యజమానుల కష్టాలు వాళ్ళకి పట్టవు. బిలియన్లలో వచ్చే లాభాలు మిలియన్లలోకి దిగిపోతుంటే వర్కర్లకి చీమయినా కుట్టదు.
ఎంతసేపూ బోనసు శాతం పెంచాలనీ, ఇంక్రిమెంట్లు ఇవ్వాలనీ... ఇలాటివే గొంతెమ్మ కోరికలు.
నయాన చెప్పి చూశాడు. వినలేదు. భయాన పెట్టి చూశాడు. లొంగలేదు. గేట్లు మూసేసి, పొమ్మన్నాక, నెల తిరిగేసరికల్లా జేబులో పడే జీతం డబ్బులు కరువయ్యాక, ఇప్పుడు దారిలోకి వచ్చారు.
గత నాలుగు రోజులుగా పర్సనల్ మేనేజరు నడిపిన చర్చలు నిన్న రాత్రి ఫలప్రదమై, బోనసు ఎప్పటిలాగే మినిమమూ, దసరాలనుంచీ మూడు శాతం ఇంక్రిమెంట్లు ఇస్తామనే ఒప్పందం పై, వర్కర్లు ఇవేళ ఉదయం ఆరు గంటల షిఫ్ట్ కి పనిలోకి వచ్చేశారు.
ఈ నెల చివరికల్లా గవర్నమెంటుకి డెలివరీ కావలసిన సామగ్రి తయారీ ముగింపు దశలో ఉంది. దాని విలువ కోట్లలో ఉంది. అది సకాలంలో డెలివర్ కాకపోతే, పడనున్న పెనాలిటీ లక్షల్లో ఉంది. అందుకే, గత పది రోజులుగా యజ్ఞపతిరావు గారి మదిలో అంచెలంచెలుగా పెరిగిపోతున్న బెదురుంది.
వర్కర్లు ఈ వారం లొంగి రాక పోతే, మరిన్ని 'బిస్కట్లు' విసిరేయటానికి ఆయన మానసికంగా సిద్ధపడే ఉన్నారు.
అయితే, నిన్నటి రాత్రి విజయం తో ఆ అవసరం రాలేదు. ఇవేల్టినుంచీ వర్కర్లని దివారాత్రాలూ తోమి, డెలివరీలు సమయం లోపు పూర్తిచేసుకోగలరు ఆయన. అందుకే ఆ ఉత్సాహం. అందుకే ఆ సంతోషం.
యజ్ఞపతిరావు గారి కన్నా చాలా ముందరే మేలుకున్నాడు వీరబాబు. నిజానికి, గత రాత్రి నిద్రే పోలేదు వాడు. ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని చీకటి ఆకాశం కన్నా ఆతృతగా ఎదురు చూశాడు వాడు.
వాడి పెళ్ళాం కూడా భర్త తోటే మాగన్నుగానే ఉండిపోయింది. మూడు దాటగానే, అసహనంగా లేచి పోయాడు. పెళ్ళాం, పిల్లలని బయలుదేరదీశాడు. ఊరు తెల్లవారకుండానే, పాక దాటేశాడు. వాడి వెనకే నడిచారు వాడి సైన్యం. ఆ సైన్యంలో వాడి భార్య ఉంది. వాడి పన్నెండేళ్ల కొడుకు ఉన్నాడు. పదేళ్ల కూతురు ఉంది. ఎనిమిదేళ్ల దాని చెల్లెలు ఉంది. పటాలమంతా ఉత్సాహంగా పరుగులు పెడుతోంది.
ఆరు వారాల కరువుకి ఆ రోజునుంచీ శలవు చెప్పబోతున్నారు వాళ్ళు. అందుకే ఆ ఉత్సాహం. ఆరు వారాల తరవాత అయిదు వేళ్లూ నోటిలోకి పోయే అవకాశం వస్తోంది. అందుకే ఆ ఉత్తేజం.
'ఆరు వారాలుగా మూత బడ్డ ఆ పాకని శుభ్రం చేసుకోవాలి. కావలసిన వస్తు సంబారమంతా చక చక సమకూర్చుకోవాలి. వీలైనంత తొందరగా మొదటి వాయ టిఫిన్లూ, టీ, కాఫీలూ తయారు చేసేసుకోవాలి.
గల్లా పెట్టె దుమ్ము దులిపి, దాని కడుపు గలగల లాడించే శుభ ఘడియలకి శ్రీకారం చుట్టాలి. ఇన్నాళ్లు గా అరకొర తిండితో ఆవురావురుమంటున్న తమ పేగులకి తృప్తిగా భోజనం పెట్టాలి.'
అదే ఊపుతూ, అదే ఉత్సాహంతో ముందుకు నడుస్తున్నారు వీరబాబు కుటుంబం.
యజ్ఞపతిరావు గారి ఫ్యాక్టరీ ఎదుటే క్యాంటీన్ నడుపుకునే వీరబాబుకి, ఫ్యాక్టరీ తో పాటే మూత బడ్డ క్యాంటీన్ తెరుచుకుని కుటుంబపు ఆకలి తీర్చే ఎక్స్ పిడిషన్ అది!
ఎంత చెట్టుకి అంత గాలి.
పి .వి .ఆర్ .శివకుమార్ (ముంబై)