గ్రామదేవతలు (వ్యాసం)
ఏ దేశానికైనా గ్రామాలు వెన్నెముక. గ్రామప్రజలు అందరూ సఖ్యతాభావన దైవచింతన, భిన్నత్వంలో ఏకత్వంతో వుంటే ఆ గ్రామ జీవితం స్వర్గతుల్యం.... ఆస్తికత సదా అందరికీ ఆనందదాయకం. ఈ సృష్టికర్తకు ఎన్నోపేర్లు.... ఏ పేరు తలచినా... కొలిచినా... విన్నపాలు చేరేది ఆ దైవానికే. దైవ నిరసన (నాస్తికత) శాస్త్ర విరుద్ధం. సంకటప్రదం. దైవాన్ని నమ్మకపోయినా, చులకనగా చూడకూడదు.
గ్రామాలు లేనిదే నగరాలు వుండవు.
నగరవాసులకు కావలసిన అన్నింటి ఉత్పాదన జరిగేది గ్రామాల్లోనే. ధాన్యం (రైస్) కూరగాయలు, పూలు, పండ్లు గ్రామ ప్రజల సాగుబడి నుండే వస్తాయి. నగరాలకు చేరుతాయి. నగరవాసులు వాటిని వినియోగించుకొంటారు.
ఒకనాడు....
ఆ గ్రామాలు ఎంతో నిర్మలంగా, ప్రశాంతంగా, దైవభక్తి చిన్నాపెద్దల విచక్షణతో అన్ని కులాల వారు, మతాలవారు సోదర భావంతో సమిష్టిగా అందరూ ఒక కుటుంబీకులుగా కలిసి మెలసి వుండేవారు.
విమర్శారహిత దైవ ఆరాధన... చింతన దానికి ముఖ్య కారణం. రాయిని కూడా నమ్మితే అది దైవం అవుతుంది. నమ్మిక లేనినాడు కొందరు అనుకొన్నట్లు, అంటున్నట్లు అది రాయిగానే కనబడుతుంది.
మన గ్రామ ప్రాంతాల్లో రామమందిరం, శివాలయం, గ్రామదేవతలుగా పిలువబడే మహాలక్ష్మమ్మ, పోలేరమ్మ, అంకమ్మ, కనకదుర్గమ్మ, పోతురాజుల ఆరాధన పల్లె ప్రజలకు ప్రీతికరం. వారి ఆరాధన వారికి ఆనందదాయకం. ముడుపులు, మొక్కుబడులు, వారి వారి కుటుంబ ఆచారాల ప్రకారం ఆయా దేవతలను పూజించడం, నమ్మడం, గ్రామవాసులకు ఆనందం. ప్రతి సంవత్సరం నవరాత్రుల సమయంలో గ్రామదేవతలకు కుంకుమ పూజ చేసి పానకం, వడపప్పు, టెంకాయలు, పొంగలి (తీపి)లను నివేదనగా సమర్పిస్తారు. ఆ చర్య వారికి పరమానందదాయకం. అది పిన్నలు, పెద్దలు కలిసి జరుపుకునే గొప్ప సంబరం.
అన్ని గ్రామాల్లో శివాలయం, రామాలయం రెండూ వుండకపోవచ్చు. ఆ రెండింటిలో ఏదో ఒకటి, మహాలక్ష్మి గుడి వుండి తీరుతుంది.
విద్యను మనకు చెప్పే గురువుల పట్ల మనకున్న గౌరవం, భక్తి మూలంగానే, మనకు సత్‍విద్య లభ్యపడుతుంది.
అలాగే ఆ గ్రామదేవత ఆరాధన..... ఆ గ్రామ ప్రజలను అన్ని విధాలా కాచి రక్షిస్తుంది.
ముస్లిం పీర్ల పండుగ నాడు, హైందవులు వాకిండ్లకు వచ్చి నైవేద్యాన్ని (బెల్లం, బొరుగులు, శనగపప్పు) స్వీకరించే ఆచారం, కొన్ని గ్రామాల్లో వుండినది. అలాగే ముస్లిమ్ సోదరులు హైందవ సోదరులతో కలసి కోలాటం, కులుకు భజన శ్రీరామ చరిత సంకీర్తనలతో పర్వదినాల్లో వారాంతా మహానందంగా కలిసి చేసేవారు.
"ఈశ్వర్ అల్లా తేరేనామ్" అని నోరారా పరవశంతో పనిచేసేవారు.
శివప్రభు వాహనాన్ని ఆ ముస్లిమ్ సోదరులు మోసేవారు. ముస్లింలు ఏర్పాటు చేసిన నిప్పుల గుండాన్ని హైందవులు నియమ నిష్టలతో వుండి ఆ సోదరులతో కలసి పరవశంతో త్రొక్కేవారు. ఆ సెగ అగ్ని కణిక వలన వారికి ఎలాంటి బాధా కలిగేది కాదు. కారణం ఆయాదైవాల (పేర్లు) మీద వారికి వున్న అపార నమ్మిక. చరచరాసృష్టి చక్రం.... జీవుల జీవిత విధానాలకు ఆధారం.... ఆలంబనం.... నమ్మిక.... నమ్మిక.
* * *
ఒక్కో వాతావరణరీత్యా దుష్టశక్తులు (2021, 2011లో వ్యాపించిన కరోనాలా) గ్రామాలకు వ్యాపించేవి. గ్రామదేవతలకు ఆ సంకేతం తెలియగానే ఆ గ్రామంలోని సశీలురైన వారిని ఆవహించి, గ్రామవీధులన్ని ఆవేశంతో ఆ శక్తి (వ్యక్తి) తిరిగి, గ్రామద్వారాలకు లోనికి వచ్చే వీధి మొదట్లో వేప మండలను వుంచి వెలుపలి దుష్ట (వాయువు) శక్తిని లోనికి రానీకుండా అరికట్టేవారు.
ఆ దైవాలు మహాలక్ష్మమ్మ, పోలేరమ్మ, అంకమ్మ, కనకదుర్గమ్మ, పోతురాజులు తమకు నచ్చిన వ్యక్తులను ఆవహించి, గ్రామ ప్రజల రక్షణకు కావలివారిలా వూరంతా (అన్ని వీధులు) తిరిగి దుష్టశక్తులను గ్రామంలోకి రానీయ్యకుండా చేసేవారు. కొన్ని ప్రాంతాల్లో ఆ దేవతల పండుగ (నవరాత్రి) జాతర పేరున చేస్తారు. పానకం, వడపప్పు, టెంకాయలు, పులుసన్నం, బెల్లపు పొంగలిలను, కుంకుమ పూజానంతరం ఆ దేవతలకు నివేదనగా సమర్పిస్తారు.
ఆ సమయంలో గణాచార్లు జనంమధ్యన పరమానందంగా నర్తిస్తారు.
’తల్లీ!... మా తప్పు ఒప్పు మన్నించు. మమ్ములను కాచి రక్షించు’ అని జనం వేడుకొంటారు.
చివరిరోజున నిమజ్జనం....
వూరి వెలుపలవున్న చెరువులో కలశ నిమజ్జనం జరుగుతుంది. గ్రామపెద్దలు పూజారిగారు ఆ చెరువుకు చేరి పూజారిగారి చేతిలోని అమ్మవారి (మహాలక్ష్మమ్మ) కలశాన్ని ఆ జలంలో నిమజ్జనం చేస్తారు. అందరూ ఆ తల్లి చింతనంతో ఆనందంగా ఇండ్ల వైపుకు తిరిగి వస్తారు.
ఒకసారి...
నాస్తికుడైన గ్రామపెద్ద "నీవు మహాలక్ష్మమ్మవా... నిదర్శనం ఏమిటి?" అని అవహేళనగా గణాచారిని ప్రశ్నించాడు.
"ఏరా నీకు సాక్ష్యం కావాలా!..." పళ్ళు పటపట సవ్వడితో ఆ వ్యక్తి ఎదురుగా వున్న వేపచెట్టు కొమ్మను చూచి... ఎగిరి ఆకును దూసి...
"పట్టరా... పట్టు... చేతిని పట్టు..." గాండ్రించింది ఆ మాత.
గ్రామపెద్ద చేతిని ముందుకు సాచి తెరిచాడు.
గంగాచారి చేయి ఆ గ్రామపెద్ద చేతికి పైన చేరింది. పిడికిలి నుండి సింధూరం జారి గ్రామపెద్ద చేతిలో పడింది. ఆశ్చర్యంతో గ్రామపెద్ద నోరు తెరిచాడు. అతని శరీరం చమటతో తడిసిపోయింది. పూజారి గణాచారిని సమీపించి శాంతి మంత్రాన్ని జపిస్తూ చేతులు జోడించారు.
ధైర్యవంతులైన పెద్దలు గ్రామపెద్ద చేతిలో కుంకుమను తీసికొని తమ నొసటను వుంచుకొన్నారు. తమ పిల్లలకు పెట్టారు. గ్రామపెద్ద లజ్జతో తలదించుకొన్నాడు.
డొంగలో జనాన్ని తప్పించుకొని ఇంటికి చేరారు.
వాకిట కట్టేసి వున్న గేదె పెద్దగా అరిచి నేల కూలింది. దాని అసువులు గాల్లో కలిసిపోయాయి. గ్రామపెద్ద ఆశ్చర్యంతో, ఆవేదనతో నేలకూలాడు.
* * *
ప్రమాణకథనం :
దక్ష ప్రజాపతి - బ్రహ్మదేవుని సుతుడు తాను తలపెట్టిన యాగానికి, తన చిన్న కుమార్తె సతీదేవి (దాక్షాయని) తన్ను ధిక్కరించి పరమశివుల వారిని వివాహం చేసికొన్న కారణంగా.... వరుసకు అల్లుడైన శివదేవుని సతీదేవిని ఆహ్వానించలేదు.
తండ్రిమీద మమకారంతో సతీమాత శివుని మాటను ధిక్కరించి తండ్రి చేయుచున్న యాగానికి వచ్చింది.
దక్ష ప్రజాపతి కుమార్తెను నీచంగా మాట్లాడాడు. సతీదేవి ఆగ్రహావేశాలతో ఆ యజ్ఞగుండంలో దూకి అశువులను బాసింది.
ఆ సమయంలో ఆమె నొసటనుంచి స్వేదబిందువులు క్రిందకు రాలాయి. ఆ బిందువులే గ్రామదేవతలు మహాలక్ష్మమ్మ, అంకమ్మ, పోలేరమ్మ, కనకదుర్గమ్మ, పోతురాజుగా అవతరించారు.
’కలియుగంతో అమాయక ప్రజల జీవిత విధానం ఆస్తికతా నాస్తికతల మధ్యన నలిగిపోకుండా, దైవత్వం మీద వారికి నమ్మకం కలిగేలా మీరు ప్రతి గ్రామాన వెలుస్తారు. దైవత్వాన్ని నిరూపిస్తారు. ఆ అమాయక దీనులందరినీ రక్షింతురుగాక!....’ చివరిక్షణాల్లో మంటల్లో ఆహుతి అగుచూ సతీదేవి పలికిన పలుకులు అవి.
మన హైందవ ఆయువుపట్టు ఆస్తికత.. ఆస్తికత ను నమ్మండి. దైవాన్ని అభిమానించండి. గౌరవించండి. ఆనందించండి. హైందవతత్త్వాలు తెలియని వారికి తెలియజేయండి. మనసు సువిశాల భారతదేశాన్ని మన హైందవతను కాచి రక్షించేది ఆస్తికత...
ఆస్తికత.. ఆస్తికత..!
-చతుర్వేదుల చెంచు సుబ్బరాయ శర్మ
(చెన్నయ్)