Telugu Global
Arts & Literature

నీలో దీపం వెలిగించు (కవిత)

నీలో దీపం వెలిగించు (కవిత)
X

మాటలలో తెలుపగలమా

మనసు విప్పి చూపగలమా

విలువెంతో వెల కట్టగలమా

నిస్సందేహంగా ఇదీ అంటూ

నిర్వచించగలమా?!

అనంతమైనది

విశ్వప్రేమ స్వరూపం...

అంతర్వాహిని అది

నిరంతరం!

బాధ్యతను

బరువుగా తలచనిది

ఐక్యతతో, అన్యోన్యతతో

బలపడునది!

పసి మనసు వలె

నిష్కాపట్యమైనది

పండు వెన్నెల వోలె

మనసంతా పరచుకొనునది!

ఏదో ఆశించి చేరిన

దరిచేరదు

కారణముచేత ఇట్టే

జనించెడిది కాదు

ఇవ్వడం తప్ప

తీసుకోవడం ఎరుగదసలు!

నీలో దీపం వెలిగిస్తే

నిన్ను నీవు తెలుసుకుంటే

నీ నడతను మార్చుకుంటే

బాంధవ్యాలను అందంగా మలచుకుంటే

కాంచగలవు ప్రేమతత్వం!

అదే సుగుణాలకు మూలం

అరిషడ్వర్గాలను

జయించిన వేళ

నిత్యము,సత్యమైన

పరిపూర్ణ

ప్రశాంతస్థితినందించే

నాశములేని శాశ్వతానందం

ప్రేమయే దైవం!

భయపెట్టి

చేయించలేని కార్యం

ప్రేమగా చెపితే సిద్ధించు

వ్యక్తిగత నడతను

మార్చుకుంటే

అభిప్రాయ భేదాలు,

విభేదాలు దూరమై

సమాజ సంస్కరణ

సాధ్యమగు

దేశ ప్రగతి పరిఢవిల్లు!!!

- చంద్రకళ దీకొండ

First Published:  25 Feb 2023 4:37 PM IST
Next Story