Telugu Global
Arts & Literature

సరదాల దసరా... (జ్ఞాపకాల పందిరి)

సరదాల దసరా... (జ్ఞాపకాల పందిరి)
X

ఇప్పటి తరంవాళ్లు చూడడానికి కూడా నోచుకోని దసరా విల్లుంబులు గురించీ అలాగే నా చిన్ననాటి దసరా జ్ఞాపకాలను మీతో పంచుకోవడానికీ ఏదో.. ఓ చిన్న ప్రయత్నం.

ఇది ఓ యాభై ఆరు సంవత్సరాల క్రిందటి మాట. అవి మా సొంత ఊరు జగన్నాధగిరిలో నేను నాలుగో తరగతి చదువుతున్న రోజులు.

"అమ్మా ! మాకు రేపటి నుండి దసరా శెలవులోచ్...." బడి నుంచి రాగానే, పుస్తకాల సంచీని అలమారలో పడేసి, ఆనందంగా చెప్పాను, అమ్మతో.

"బడి లేదంటే చాలు, ఎంత ఆనందమో వెధవ మొహానికి. ముందు కాళ్ళు కడుక్కుని ఇవి తిను. తరువాత ఓవల్టీన్ తాగుదుగాని" కుంపటి ముందు కూర్చుని, వేస్తున్న జంతికలలోంచి ఒక చిన్న జంతిక చేతిలో పెడుతూ, సుతిమెత్తగా తిట్టింది అమ్మ.

"సరే కానీ, రేపటి నుండి ఉదయం పూట విల్లుంబులు పట్టి, ఇంటింటికీ తిరగాలిట. ఔనూ విల్లుంబులు, బుక్కా పొడి కొన్నారా మరి?" సందేహంగా అడిగాను.

"అన్నయ్య కి ఒంట్లో బాగా లేదు. తమ్ముళ్లు చిన్న పిల్లలు. ఎండలో తిరగలేరు. అందుకే నువ్వు ఒక్కడివే వెళ్లి తగలడు. ఇందాక సంత నుంచి గన్నెయ్య తాత ఓ బాణం పట్టుకొచ్చేడు. తాతబ్బాయి కొట్టుకెళ్లి నాన్న పేరు చెప్పి ఓ అద్దణా బుక్కా తెచ్చుకో..." అమ్మ మాటలు పూర్తి కాకుండానే కదన రంగంలోకి దూకబోయేను.

ఈలోగా వెనక వెంపు పెరట్లో తులసికోటకు నడుం ఆనించి, ఒకకాలు మడిచి, రెండో కాలు ఆ మడిచిన కాలుమీద వేసుకుని దర్జాగా కూర్చుని, నాకూ, అమ్మకు మధ్య జరిగిన తతంగం చూసిన అమ్మమ్మ, నన్ను దగ్గరకు రమ్మని సైగ చేసి,

"ఎందుకురా! వెర్రి నాగన్నా, అమ్మతో చివాట్లు తింటావు. ఇదిగో ఈ అద్దణా తీసుకుని బెల్లపచ్చు కొనుక్కో. ఎవరికీ చెప్పకు" అంటూ బోడి తలమీద ఉన్న ధవళ వస్త్రం కిందకి దింపి, ఆ చీర చివరనున్న ముడి విప్పి, ఓ అద్దణా నా చేతిలో పెట్టి, నెత్తి మీద ముసుగు సవరదీసుకని మళ్ళీ యధాస్థానానికి వెళ్లి పోయింది.

అంతే బండిని థర్డ్ గేర్ లో పెట్టి, బర్ర్ మని నోటితో శబ్దం చేసుకుంటూ, బూడిద తాతబ్బాయి కొట్టు వైపు శరవేగంగా పరిగెత్తుకుపోయాను.

* * * *

మొదటి రోజు ఉదయం మా బడి నుంచి బయలుదేరిన మా విజయ (దశమి) యాత్ర, హెడ్ మాష్టారు సుబ్బారావు గారు, మిగతా మాష్టార్లు నక్క నారాయణ గారు (ఈయన సన్నగా నక్కలా ఉండేవాడు మరి), కమలమ్మ గారు, కృష్ణమాచార్యుల గార్ల ఆధ్వర్యంలో బయలుదేరి, ముందుగా ప్రెసిడెంట్ వసంతరాయుడు గారి ఇంటి ముందు ఆగింది.

"శుక్లాంబరధరం" తర్వాత "రాజాదిరాజా" తర్వాత "ఏదయా మీదయ మా మీద లేదు" పాటలు పూర్తవ్వగానే, పొందూరు ఖద్దరు పంచె కట్టుకుని, నోట్లో లంక పుగాకు చుట్ట కాల్చుకుంటూ లోపలి నుంచి వచ్చిన ప్రెసిడెంట్ గారు, మాష్టార్లుకు విడివిడిగా డబ్బులు ఇచ్చి, మా పిల్లకాయలకు వాళ్ళ పాలేరు కళ్యాణం చేతికి నిమ్మతొనలు ఇచ్చి పంచిపెట్టమన్నారు.

నేనైతే మొహమాటం విడిచి, "ఇదిగో కళ్యాణం! ఒంట్లో బాగాలేక మా అన్నయ్య, తమ్ముళ్లు రాలేదు. అందుకే, వాళ్లకు కూడా ఇవ్వు" అని అడగటంతో, నేను డాక్టర్ గారి అబ్బాయిని అనీ, కోపం వస్తే నాన్నతో చెప్పి ఓ ఇండీసను పొడిపించేస్తానని భయపడ్డాడు కామోసు, ఓ నాలుగు నిమ్మతొనలు అదనంగా ఎవరూ చూడకుండా జేబులో పెట్టాడు.

అయితే, ఎండలో తిరిగి తిరిగి, ఎప్పటికో ఇంటికి వెళ్లడం వలన కాబోలు, ఆ బిల్లలు కరిగిపోయి, చొక్కా పాడవడంతో అమ్మ ఆ చొక్కానీ , నన్నూ కూడా ఉతికి ఆరేసిందనుకోండీ. అది వేరే సంగతి.

ఆ తర్వాత మా యాత్ర, పాటలు పాడుకుంటూ, నల్లా సత్యారావు అనే దత్తుడు గారి ఇంటిముందు ఆగింది. ఆయన పంచిన అటుకులు, బెల్లం ఆరగిస్తూ, కొటికెలపూడి వెంకట్రావు గారు ఇచ్చిన మరమరాలు తీసుకుని, కరణం సత్తిరాజు గారి ఇంటి ముందు ఆగింది. రెట్టించిన ఉత్సాహంతో పాటలు పాడడం ప్రారంభించాం, ఏదో పెద్ద సరుకు తినడానికి దొరుకుతుంది అని.

మా ఉత్సాహం నీరుగారుస్తూ వచ్చాడు, కరణం గారి మూడో అబ్బాయి, సన్నటి మీసకట్టుతో శోభన్ బాబులా ఉండే లచ్చిబాబు. "మేష్టారూ, నాన్న గారు పని మీద ద్రాక్షారామం వెళ్లారు. ఇదిగో మీకూ అలాగే పిల్లల పప్పు బెల్లాలకూ" అంటూ కొంత సొమ్ము హెడ్ మాష్టారు చేతిలో పెట్టాడు.

అయితే, ఆ పప్పు బెల్లాలు ఆ తర్వాత రోజుల్లో కూడా మా నోటికి రాలేదు. ఈ విషయం నేను అంత సీరియస్ గా తీసుకోలేదు కానీ, నా స్నేహితుడు అమలకంటి రమణ గాడు అదే మా కొండగాడు మటుకు ఊరుకోలేదు. సరికదా, "ఒరే, బుద్ధవరపూ, మనకు పప్పుబెల్లాలు కొని ఇవ్వకుండా, మనల్ని ఎలా ఎండల్లో తిప్పుతున్నారో చూసావా?" అంటూ విసుకున్నాడు, జేబులో వేసుకున్న మిగిలిన మరమరాలు విసురుగా నములుతూ.

* * * *

ఇక రెండో రోజు యాత్ర కలిదిండి భాస్కరరాజు గారి ఇంటి నుంచి ప్రారంభం అయ్యింది. రెండు పాటలు పాడి, ఆఖరి పాట "ఏదయా మీదయా మా మీద లేదు" అని పాడుతూంటే, హెడ్ మాష్టారు వచ్చి, "ఒరేయ్ పిల్లలూ అయ్యవారికి చాలు ఐదు వరహాలు" అని గట్టిగా పాడండి అని చెప్పడంతో, దానితో పాటు "పిల్లవాళ్లకు చాలు పప్పు బెల్లాలు" అనేది కూడా కర్ణభేరి పగిలిపోయేలా పాడేసాము.

ఈ లోగా లోపలినుంచి వచ్చిన గుండుపిక్కలా బలిష్టంగా ఉండే భూస్వామి భాస్కరరాజు గారు, "ఏవర్రోయ్ పిల్లలూ! అలా బుక్కా పొడి కొట్టి, కొత్తగాసున్నం వేసిన గోడలు పాడుచేయకండర్రా" అంటూ మందలించి, మాకు పిప్పరమెంటు బిల్లలు ఇచ్చి, మాష్టార్లకు డబ్బులు ఇవ్వడంతో, ఆనందంగా పాడుకుంటూ తరువాత మజిలీగా ర్యాలి సూర్యావు కిరాణా కొట్టుముందు ఆగేము, కొట్టులో గాజు సీసాల్లో అందంగా పేర్చిన బెల్లపచ్చులు, వేరుశనగ ఉండలు వైపు ఆశగా చూస్తూ.

మా పాట పూర్తి అవ్వగానే, లోపలినుంచి పంచె సర్దుకుంటూ వచ్చిన సూర్యావు, "హెహెహె..మాష్టారూ ఇదిగోండి మీ బహుమతి, పిల్లలకు కూడా ఏదన్నా కొనిపెట్టండి" అంటూ కొన్ని డబ్బులు హెడ్ మేష్టారు చేతిలో పెట్టాడు.

ఆ డబ్బుతోనే తన దుకాణంలో పిల్లలకు తప్పకుండా ఏదో ఒకటి కొంటారనుకొన్న అతని వ్యాపార తెలివితేటలను పసిగట్టిన మాష్టారు "అలాగే, కొనిపెడతాం" అంటూ ఆ డబ్బులు జేబులో వేసుకున్నారు, సూర్యావు ఆశల మీద, మా ఆశలు మీద కూడా నీళ్లు చల్లుతూ.

అక్కడ నుండి, అమ్మలు హొటల్ మీదుగా ఎక్కల వీర్రాజు ఇంటికి బయలుదేరిన మా యాత్ర ఆ రోజు అర్ధాంతరంగా ఆగిపోయింది, కారణం మా కొండ గాడి బొడ్డులోంచి రక్తం కారడంతో.

బెంబేలెత్తిపోయిన హెడ్ మాష్టరు, పిల్లలను ఆ పూటకి ఇంటికి పొమ్మని, మా కొండగాడిని తీసుకుని ఆసుపత్రికి వెళ్లమని ఆచార్యులు మేష్టారుకి చెప్పి, తోడుగా నన్నూ పంపించారు, ఎందుకంటే డాక్టర్ మా నాన్న గారే కదా మరి.

"ఆసుపత్రికి నేను రాను, ఇంటికి పోతాను " అని వాడు ఏడుస్తున్నా, ఆచార్యులు మేష్టారు "అలా బొడ్డులోంచి రక్తం కారకూడదురా, కొంచెం ఓపిక పట్టు" అని ఎర్రటి తాంబూలం నములుతూ, వాడికి ధైర్యం చెప్పారు. దోవలో అలో లక్ష్మణా అంటూ ఏడుస్తూ, నా వైపు కొండగాడు చూసిన చూపు ఇప్పటికీ జ్ఞాపకమే.

విషయం తెలుసుకున్న వాళ్ల నాన్న చిన్నబ్బాయి ఆదుర్దాతో అప్పటికే హాస్పిటల్ కి వచ్చేసాడు. ఆసుపత్రిలో నాన్న గారు శల్య పరీక్షలు చేసి, తేల్చిన విషయం ఏమిటంటే..మొలతాడుకు ఉన్న రేకు తావీదుతో తన బొటన వేలు కోసుకుని, రక్తం కారుతున్న ఆ వేలును బొడ్డు దగ్గర పెట్టుకుని అలా నటించాడని.

అంతే అసలు విషయం తెలుసుకున్న చిన్నబ్బాయి, పాపం మా కొండగాడిని రోడ్డు పొడుగునా నడిపించుకుంటూ, రామడోలు వాయిస్తున్నట్టుగా, వీపు మీద ప్రైవేటు చెప్పుకుంటూ, ఇంటికి తీసుకుపోయాడు.

ఆ తర్వాత తెలిసిన విషయం ఏమిటంటే, కొందరు ఇచ్చిన డబ్బులతో మాకు పప్పు బెల్లాలు కొనకుండా, ఎండలో తిప్పతున్నందుకు మేష్టారు మీద కోపమొచ్చి, ఈ నాటకం ఆడేడని.

అయితే ఎండలు మాట ఎలా ఉన్నా వాళ్ల నాన్న కొట్టిన దెబ్బలకు ఒళ్ళు పులిసిపోయి ఆ తర్వాత రోజుల్లో వాడు యాత్రలో పాల్గొనలేదు.

* * * *

ఇక మూడో రోజు యాత్ర కామాచార్యులు గారి ఇల్లు, దవులూరి స్వామి ఇల్లు, బూడిద తాతబ్బాయి ఇంటిమీదుగా మా ఇంటికి వచ్చింది.

అంతే! రెట్టించిన ఉత్సాహంతో, మా ఇల్లు ఇదే అని మిగతా వారికి చూపించాలన్న వెర్రి ఆనందంతో, జారిపోతున్న లాగును పైకి ఎగలాగుతూ, వేగంగా మెట్టు ఎక్కబోయేను.

"ఎక్కడికీ, మాంఛి ఉషారుగా వెళిపోతున్నావు?" అంటూ చొక్కా పట్టుకుని లాగారు నక్క మేష్టారు.

"ఇది మా ఇల్లు. లోపలికి వెళ్లి మా వాళ్లను పిలుస్తాను" అని చెప్పగానే,

"ఏం అవసరం లేదు, మాకు తెలుసు. వెళ్లి ముందు వరసలో నిలబడి పాట పాడు" అంటూ కేకలేసారు.

అందరి ముందు అవమానం జరిగింది అని మానసికంగా బాధపడి, అందరితో పాటు కింద నిలబడే పాటలు పాడి, ఇక ఆఖరి పాట "ఏదయా మీ దయ మా మీద లేదు " అనే పాటలో, ఆఖరి చరణంలో..

"అయ్యవారికి చాలు ఐదు వరహాలు

పిల్లవాళ్లకు చాలు పప్పు బెల్లాలు"

అనేచోట నా స్వంత పైత్యం ఉపయోగించి,

"అయ్యవారికి మటుకు అర్దణా చాలు

పిల్లవాళ్లకు మటుకు పప్పు బెల్లాలు"

అని కొంచెం వెటకారం జోడించి, నెమ్మదిగా పాడి, నా కసి తీర్చుకున్నాను, ఎవరికీ వినపడదులే అనుకుంటూ.

ఈలోగా, మా నాన్న, అమ్మ, పెద్దన్నయ్య, చిన్నక్క మేష్టార్లకు బట్టలు, కమలమ్మ గారికి చీర పెట్టి, పిల్లలందరికీ ద్రాక్షారామం నుంచి తెప్పించిన నువ్వు పప్పు జీళ్లు పెట్టడంతో ఆ రోజు కార్యక్రమం దిగ్విజయంగా ముగిసింది.

* * * *

దసరా పండగ వెళ్లింది. మళ్లీ బడులు ప్రారంభం అయ్యాయి. ఈసురోమంటూ బడికి బయలుదేరాను.

కాసేపటికి, నక్క మేష్టారు రమ్మంటే ఆయన ఉన్న మూడవ తరగతి క్లాసు వైపు నడిచాను, బహుశా మా వాళ్ళు ఇచ్చిన బట్టలుకి కృతజ్ఞతలు చెప్పడానికి కామోసు అనుకుంటూ.

నన్ను చూడగానే ఆయన కుర్చీ లోంచి లేచి, పేకబెత్తంతో నా వీపు మీద భజన కార్యక్రమం ప్రారంభించారు.

ఆ తర్వాత చెప్పారు... ఆ రోజు నేను వెటకారంగా పాడిన పాట ఆయనకు నచ్చి ఇచ్చిన బహుమతి అది అని.

ముక్తాయింపు ::

చిన్నతనంలో, తెలిసీ తెలియని జ్ఞానంతో మా పప్పు బెల్లాలకు ఇచ్చిన డబ్బులు మేష్టార్లు వాడేసుకున్నారు అని అపోహ పడేవాళ్లం గానీ, ఆ తరువాత రోజుల్లో తెలిసింది, చాలీచాలని జీతాలుతో, గంపెడు సంతానంతో, అలా వచ్చిన డబ్బులతోనే పాపం సంసారాలు నెట్టుకొచ్చేవారని.

(ఈ సందర్భంగా నా ఉన్నతికి కారణమైన ఉపాధ్యాయులందరికీ నమస్సులతో... బుద్ధవరపు కామేశ్వరరావు )

రచన ::

బుద్ధవరపు కామేశ్వరరావు

(హైదరాబాద్)

First Published:  24 Oct 2023 8:19 AM
Next Story