వేడుక చేయగ వేళాయే (కథానిక)
సెప్టిక్ లేబర్ రూమ్ నుంచి బయటికొచ్చి వాష్ చేసుకుంటున్న డాక్టర్ సుమన్, లాకర్ లోనుంచి మొబైల్ గణగణ విని హడావుడిగా చేతులు తుడిచేసుకుని చూసాడు. కాజువాలిటీ నుంచి. పక్కనే తన వాష్ పూర్తి చేస్తున్న డాక్టర్ గణేష్ తో “త్వరగా కానియ్యి సోదరా ! ఇంకో ఎమర్జెన్సీ ! కాజువాలిటీ నుంచి . ఆక్సిడెంట్ కేసు." అంటూ త్వరగా షర్టు, ఆప్రాన్ వేసేసుకుని బయటకు నడిచాడు
సుమన్ సీనియర్ సర్జికల్ రిజిస్ట్రార్, అసిస్టెంట్ ప్రొఫెసర్ అవడానికి లైన్ లో ముందర ఉన్నాడు. గణేష్ ఎం ఎస్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఫైనల్ ఇయర్. ఇద్దరూ మంచి దోస్తులు. వయసులో ఎక్స్పీరియెన్స్ లో తేడా ఉన్నా వారి హాబీలు , అలవాట్లు, ఒకటే అయ్యేసరికి జూనియర్, సీనియర్ అన్న భేదం పట్టించుకోరు. పనిలో పనిగా అంతకు ముందు రోజు నుంచి నైట్ డ్యూటీ కలిసే చేస్తున్నారు.
బయటికొచ్చిన గణేష్ తనకోసం స్కూటర్ ఆన్ చేసి రెడీగా ఉన్న సుమన్ వెనకాల కూర్చుని “పదండి సార్ !” అన్నాడు. అర్ధరాత్రి దాటి ఊరంతా గాఢ నిద్రలోకి వెళ్లిపోయింది అనిపిస్తోంది. టైం చూసుకున్నాడు గణేష్. రెండు దాటి పదిహేను నిముషాలైంది. సర్జికల్, మెడికల్ వార్డుల బిల్డింగులూ, టీ బీ బిల్డింగు దాటి మెయిన్ బిల్డింగ్ లోఉన్న కాజువాలిటీ కి చేరే సరికి పగటి పూట లాగానే ఉండక్కడ, హడావుడీ, పిల్లా పెద్దల ఏడుపులూ , పోలీసు వాన్ లు, ఆంబులెన్స్ లు,అడ్డ దిడ్డం గా మనుషులు, పరుగులు పెడుతున్న నర్సులు,
లోపలకి నడచివస్తుండగానే సి ఎం ఓ డాక్టర్ రామ మోహన్. ఎదురొచ్చి “రండి డాక్టర్ సుమన్ ! రోడ్ ఆక్సిడెంట్ కేసు , పాపం జాగ్రత్తగా పక్కనుంచి సైకిల్ మీద పోతున్న వాడిని లారీ వాడు
గుద్దడమే కాకుండా వెనకాల టైరు చెయ్యి మీదనుంచి వెళ్ళిపోయింది. నజ్జు అయిపోయినట్లుయింది. మిగిలినవన్నీ మైనర్ ఇంజ్యూరీలే . ఎం ఎల్ సి బుక్ చేసేసాను. ప్రిలిమినరీ రిపోర్ట్ రాసేసుకున్నారు పోలీసులు” అన్నారు.
వెళ్లి చూసే సరికి మంచం మీద నొప్పితో దొర్లుతున్న ముప్పై ఏళ్ళ అతను , మనకేం పక్కన స్టూల్ మీద రోదిస్తున్న భార్య కనిపించారు . వీరిద్దరూ కనిపించగానే ఆమె వారి కాళ్ళమీద పడిపోయింది. “నైట్ డ్యూటీ చేసి వస్తున్నాడు డాక్టర్ గారూ ! రేపటినుంచి డే షిఫ్ట్ ! వసుండగా ఈ ఘోరం జరిగిపోయింది . కుడి చెయ్యి సార్ ! మాకు ఇద్దరు పిల్లలు. రెండో పిల్ల ఏడాదిది. చెయ్యి తీసెయ్యకుండా చెయ్యండి సార్ ! చెయ్యి పొతే అందరం రోడ్డున పడతామండీ ! ముందూ వెనకా ఎవరూ లేరు సార్ !” అంటూ వెక్కుతున్న ఆమెకి ధైర్యం చెప్పి వివరాలు సేకరిస్తూ వాఁష్ చేసుకున్నారు.
ఆతను పాలిటెక్నీక్ చేసి టెంపరరీ పోస్ట్ లో ట్రాన్స్ కో లో చేరాడు. సీనియారిటీ కూడా వచ్చింది. కొంచెం బెటర్ పొజిషన్ లోకి వెడతాను అనుకుంటుండగా ఇది జరిగింది.
వాష్ చేసుకున్నాక ఆమెను బయటకు పంపేసి డ్రెస్సింగ్ టేబుల్ మీద పడుకోబెట్టిన అతని చేతికున్న ప్రెషర్ బాండేజ్ జాగ్రత్తగా తీసిన వారిద్దరికీ దయనీయమైన దృశ్యం కంట బడింది.
మోచేయి క్రింద ఆరంగుళాల నుంచి మణికట్టు వరకు చర్మం లేచి పోయి ఒక పక్కకి వేలాడుతోంది. కండరాలు, టెండాన్స్, బ్లడ్ వెసెల్స్, నెర్వ్స్ అనాటమీ టెక్స్ట్ బుక్ లోలాగా ఓపెన్ గా కనబడుతున్నాయి. వాళ్ళిద్దరికీ ఇలాంటివి అలవాటే కాబట్టి. గబగబా ముందు గాయమంతా రక్తం లేకుండా మాప్ చేసేసి బ్లీడ్ అవుతున్న రక్త నాళాలని కాటరైజ్ చేసి రిపేర్ కి ఉపక్రమించారు. అలవాటైన చేతులు చకచకా కదులుతున్నాయి. ఒకరొకరికి బాగా సహకరించుకుంటూ సాగిపోయారు.
దాదాపు రెండుగంటల తర్వాత వాష్ చేసుకుని అతని భార్యకు మరొకసారి ధైర్యం చెప్పి, కేస్ షీట్ రాసి ఇంకొక పన్నెండు గంటల పాటు కాజువాలిటీ కి అటాచెడ్ గా ఉన్న ఐ సి యు లోకి షిఫ్ట్ చేయమని చెప్పి బయటికి వచ్చేసరికి తూర్పున తెల్లబడుతోంది.
మెయిటీ గేట్ పక్కనే టీ బండీ దగ్గర కాఫీ తాగుతుండగా మళ్ళీ ఫోను. టీ బీ వార్డ్ నుంచి.. కాఫీ ముగించుకుని హడావుడిగా టీ బి వార్డ్ కి వెళ్తే డ్యూటీ హౌస్ సర్జన్ వివరాలు చెప్పాడు. నైట్ డ్యూటీ డాక్టర్ ఇంటి నుంచి ఆయన భార్యకు హఠాత్తుగా ఫిట్స్ వచ్చాయని ఫోన్ వస్తే హౌస్ సర్జన్ కి బాధ్యత అప్పజెప్పి అంతకు ముందే వెళ్ళిపోయాడు. ఆయన అటు వెళ్లిన పది నిముషాలకి పేషేంట్ కి ఆయాసం ఎక్కువై కళ్ళు తేల వేసే సరికి ఆ జూనియర్ డాక్టర్ వీరికి కాల్ చేసాడు.
వీళ్ళు వెళ్లేసరికి ఆ పేషేంట్ కి ఊపిరి చాలా కొద్దిగా ఆడుతోంది. గుడ్లు పైకి వెళ్లిపోయాయి. పల్స్ మాత్రం సన్నగా, ఎక్కువ సార్లు కొట్టుకుంటున్నది గబగబా కేస్ షీట్ గణేష్, ఎక్స్ రే చూస్తూ ఉండగా సుమన్ ఆక్సిజన్ , మిగిలిన రిసస్కిటేషన్ పనులలో పడ్డాడు. ఒక్క నిముషం లోపునే గణేష్ “డాక్టర్ సుమన్ ! ఇతనికి టీ బీ ఎంఫీసెమా డయాగ్నోసిస్.. బుల్లే రప్చర్ అయి ఉండచ్చు.
న్యూమో థొరాక్స్ లాగ ఉంది” అంటూనే కుడి వైపు ఛాతీ గబగబా స్టెత్ తో పరీక్ష చేసి ఒక ఐ వీ నీడిల్ ఛాతీ వెనుకగా ఇంటర్ కోస్టల్ స్పేస్ లోకి గుచ్చి పక్కనే ఖాళీ గా ఉన్న ఐ వీ సెట్ ట్యూబ్ కి కనెక్ట్ చేసి మంచం పక్కనే క్రింద ఉన్న మంచి నీళ్ల సీసా లోకి రెండో చివర ముంచేశాడు. బుడబుడా బోలెడంత గాలి ఛాతీ లో నుంచి బయటకి వచ్చేసింది. నెమ్మదిగా పేషేంట్ శ్వాస ఆడడం మొదలు పెట్టి కళ్ళు మామూలు స్థితికి వచ్చాయి. ఒక అరగంట తర్వాత రెగ్యులర్ అండర్ వాటర్ డ్రైన్ పెట్టి, ఐ వీ కాన్యులా పెట్టి, డ్రిప్ స్టార్ట్ చేసి జూనియర్ డాక్టర్ కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి బయటకి వచ్చేసరికి తెల్లగా తెల్లారిపోయింది.
ఇద్దరికీ ఆకలి నకనకలాడుతోంది. డ్యూటీ రూమ్ కి వచ్చి పళ్ళుతోమేసుకుని ముఖం తోముకుని ఆవురావురంటూ వెళ్లి ఇడ్లీ, దోశె కౌంటర్లో తీసుకుని తింటుండగా సర్జరీ అసోషియేట్ ప్రొఫెసర్ వీళ్ళ ఎదురుగా కూల బడ్డాడు కాఫీ కప్ తో. “ఏమిటి సుమన్, గణేష్ ? ఎలా వుంది డ్యూటీ ? టైం బాగానే గడిచిందా ?” అన్నాడు వీళ్ళ ఎర్రటి కళ్లు, ముఖం లో నీరసం చూసి చిరునవ్వుతో.
“బాగా గడవటమేమిటి సార్ ! ఉక్కిరిబిక్కిరే !’ అని అంతకు ముందు రోజు వాళ్ళు చేసిన కేసులు వేళ్ళు ముడుస్తూ లెక్క చెప్పాడు సుమన్.
"నిన్న మధ్యాహ్నం వస్తూండగానే హెడ్ ఇంజరీ ప్లస్ అక్యూట్ అబ్డామెన్ ! ఎమర్జెన్సీ సర్జరీ, న్యూరో సర్జన్ డాక్టర్ పరమేష్ కాల్ డ్యూటీ ! వెంటనే రెస్పాండ్ అయి పావుగంటలో వచ్చేశారు. ఆయన క్రేనియాటమీ, మేము లాపరాటమీ ! సింపుల్ సబ్ డ్యూరల్ హెమటోమా ! ఆయన వర్కు అరగంటలో అయిపోయింది. పొట్ట ఓపెన్ చేస్తే ఇంటస్టైన్ రప్చరూ, స్ప్లెనిక్ రప్చరూనూ ! రిపేర్ చేసి స్ప్లీన్ రిమూవ్ చేసి అబ్డామెన్ క్లోజ్ చేసేసరికి మూడు గంటలు పట్టింది. గాడ్స్ గ్రేస్ ! బాగానే కోలుకున్నాడు. వైటల్స్ స్టేబుల్ గా ఉన్నాయని ఇందాకనే అప్డేట్ వచ్చింది. "
ఆ తర్వాత ఒక్క అరగంట గ్యాప్ లో పీడియాట్రిక్ వార్డ్ నుంచి కాల్. ఫీవర్ తో అడ్మిట్ అయిన ఎనిమిదేళ్ల పాపకి అపెండిసైటిస్ అని తేలి ఆ కేసు సర్జరీ. జనరల్ లో అపెండిసెక్టమీ. ఆ పాప కూడా బాగానే ఉన్నదిట.
సాయంత్రం అయ్యేసరికి దొమ్మీ కేసు ! నలుగురికి మల్టిపుల్ ఇంజరీలు, సూచర్సు, ఎమ్ ఎల్ సీ షీట్ లు రాయడం ! అదో టీడియస్ పని అయ్యింది.
ఇది అయ్యే సరికి ఎనిమిదిన్నరకి లేబర్ రూమ్ నుంచి కాల్ ! ముప్ఫై అయిదేళ్ళ ప్రైమీ ! మెంబ్రేన్స్ రప్చర్ అయి, లేబర్ సరిగా ప్రోగ్రెస్ కాక ఫీటల్ డిస్ట్రెస్ వచ్చాక ఫోర్సెప్స్ వేశారు. సీజెరియన్ చేసేసినా పోయేది. డయాబెటిక్ మదర్. అది ఇక్కడ అడ్మిట్ అయ్యాక తెలిసిందిట. భగవాన్ ! సర్వైకల్ టేర్స్ తోపాటు పీ పీ హెచ్ ! బ్లీడింగ్ ఆగదే !!
మొత్తం మీద యూటిరైన్ హెమొరేజి గైనిక్ సర్జన్ టాకిల్ చేశారు, మేము కష్టం మీద సర్వైకల్ సూచర్స్ వేసి కిందా, మీదా పడి కంట్రోల్ చేశాము. బ్లడ్ రెండు యూనిట్లు ఇచ్చారు. మళ్ళీ బ్లీడింగ్ రిపీట్ అయితే హిస్టరెక్టమీ చేయాలని ఆవిడ భర్తకీ చెప్పారు పాపం !"
తెల్లారుతుండగా టీ బీ వార్డ్ లో స్పాంటేనియస్ న్యూమో థొరాక్స్ ! టైముకి గుర్తించి టాకిల్ చేశాడు గణేష్, లేకపోతే ప్రాణం దక్కేది కాదు" నిట్టూర్చాడు డా. సుమన్.
సానుభూతిగా విన్న ప్రొఫెసర్ ఒకటే అడిగాడు. "వీటిలో మీకు ఏమి లాభం కనిపించింది?"
గణేష్ చిరాకుని అణిచిపెట్టుకుని సమాధానం ఇచ్చాడు "లాభం ఏమిటి సార్ ? నిన్న అస్సలు రెస్టే లేదు. ఇవాళ డ్యూటీ అయిపోయాక ఇంటికెళ్లి పడుకుంటే ఇంక రేప్పొద్దున్న లేవడమే ! ఇవాళ మా మారేజీ డే, చక్కగా లంచికి బయటికెళ్ళి, ఆ తర్వాత మధ్యాహ్నం మూవీకెళ్ళి, సాయంత్రం పార్క్ కి వెళ్ళి రాత్రి కాండిల్ లైట్ డిన్నర్ అనుకున్నాను ! లాభం కాదు సార్ ! అంతా లాసే !" అని సమాధానం ఇచ్చాడు.
ప్రొఫెసర్ "లాస్ అంటారేమిటి గణేష్ ? నిన్నటి నుంచి మీరు ఎన్ని ప్రాణాలు కాపాడారు ? ఒక వ్యక్తికి సమయానికి స్ప్లినెక్టమీ చేసి అతడిని ఒడ్డున పడేశారు. ఒక జంటకి వారి ప్రియమైన కూతురికి సమయానికి ఆపరేషన్ చేసి సేఫ్ గా అందించారు. కుటుంబానికి ఆధారమైన వ్యక్తికి చేయి కాపాడి కుటుంబాన్ని నిలబెట్టారు. ప్రషస్ ప్రెగ్నెన్సీ కేసులో భర్తకి భద్రంగా అతని భార్యని, బిడ్డని అప్పగించారు. మృత్యువు తలుపు తడుతున్న అతనికి సమయస్ఫూర్తితో ప్రాణం పోశారు. ఇవాళ మీ సెలబ్రేషన్ కోల్పోయి ఉండచ్చు, కానీ ఎన్ని కుటుంబాలలో మీ వలన పండగ వాతావరణం నెలకొన్నదో ఆలోచించండి. అది లాభాలకెల్లా లాభం కదా !"
సుమన్, గణేష్ ఇద్దరి ముఖాలు నెమ్మదిగా విప్పారి చిరునవ్వుతో వెలిగిపోయాయి. "నిజమే సర్ ! ఆలోచిస్తే మా మారేజ్ డే సెలబ్రేట్ చేసుకోవడానికి ఇంతకన్నా గొప్ప కారణమేముంది ? థాంక్ యూ వెరీ మచ్ సర్ " అని ప్రొఫెసర్ చేయి పట్టుకుని ఊపేశాడు డాక్టర్ గణేష్.
-బొగ్గవరపు మల్లికార్జునరావు