Telugu Global
Arts & Literature

పునరావృతం (కథ)

పునరావృతం (కథ)
X

శేఖర్ కి చికాగ్గా ఉంది.

తన మీద తనకే కోపంగా ఉంది.

భార్య మీద,అత్తగారి మీద కూడా కోపం పరవళ్ళు తొక్కుతోంది.

తన చేతగాని తనం మీద కూడా అసహ్యం తో కూడిన కోపం ఉంది.

పక్కన తండ్రి ఏమీ జరగనట్టు నిశ్శబ్దంగా కూర్చున్నాడు.

కారు నెమ్మదిగా పోతోంది.

ఎవరి అలోచనల్లో వాళ్లున్నారు.

శేఖర్ కి గతమంతా కళ్లముందు కదలాడింది.

ఒక్కడే కొడుకవడం మూలాన తననెంతో గారాబంగా పెంచారు తల్లిదండ్రులు.

ఏది కావాలన్నా వెంటనే అమర్చారు.

చదువయ్యాక బేంకులో ప్రొబేషనరీ ఆఫీసర్ గా చేరి అంచెలంచెలుగా ప్రమోషన్లు సంపాదించాడు.

పెళ్లి కాణీ కట్నం లేకుండా చేసుకున్నాడు .

తల్లిదండ్రుల మెతకతనం చూసి అత్తవారు బాగా ఆటలాడుకున్నారు.

అన్నీ తెలిసినా అమ్మా నాన్న భవిష్యత్తు కోసం,తనకోసం నోరెత్తలేదు.

తను కూడా రభస ,గొడవలు ఇష్టం లేక ఏమనలేదు.

అయినా తనాశించిన ఫలితం దక్కలేదు.

పెళ్లయిన రెండేళ్ల కే కోడలి ప్రవర్తన కు బాధపడి,ఏమనలేక మనోవ్యాధితో తల్లి మరణించింది.

తల్లి మరణం తో తండ్రి మరీ క్రుంగిపోయాడు.

నిశ్శబ్దంగా ఉండేవాడు.

అయినా భార్యకు సంతృప్తి లేదు.

వేటగాడు మెత్తనైతే లేడి మూడు కాళ్లతో గెంతిందని..

భార్య ఆగడాలకు అంతేలేదు.

ఒకట్రెండుసార్లు తను మందలించేసరికి నానా రభస చేయడంతో భయపడి ఊరుకున్నాడు.

మూడు రోజులై తండ్రి ని ఎక్కడి కైనా పంపెయ్యమని పోరు పెడుతోంది.

భరించలేక పోతున్నాడు.

నిన్న జరిగిన సంగతి మరీ ఘోరం!

తండ్రి రాగయుక్తంగా గజేంద్ర మోక్షం లో పోతన పద్యం రాగయుక్తంగా చదువుతూ పదేళ్ల మనవడు రాజేష్ కి నేర్పిస్తున్నాడు.

పూరించెన్ హరి పాంచజన్యముఁ, గృపాంభోరాశి సౌజన్యమున్,

భూరిధ్వాన చలాచలీకృత మహాభూత ప్రచైతన్యమున్,

సారోదారసిత ప్రభాచకిత పర్జన్యాది రాజన్యమున్,

దూరీభూత విపన్నదైన్యమును, నిర్ధూతద్విషత్సైన్యమున్.

దుమారం లా వచ్చింది తన భార్య.

"చాల్లెండి..ఎందుకీ పద్యాలు..కూడుపెడతాయా! గుడ్డపెడతాయా!

వాడు పెద్దచదువులు చదివి అమెరికాలో సెటిల్ అవ్వాలని నేను చూస్తుంటే,వాడికీ ఎడ్లబండి రాగాలు నేర్పించడవేమిటి!

పోరా..నీ చదువు చదువుకో" అని వాడ్నక్కడినుంచీ తరిమేసింది.

తండ్రి మొహం చూడ్డానికి సిగ్గేసింది.

అయినా పెళ్లాన్నేమనలేకపోయాడు తను.

తండ్రి కి అన్నీ తెలిసే ఉంటాయి.

కానీ ఏమనడు.

తనకీ బాధగా ఉంది. దేవుడు లాటి నాన్నని భార్య సహించకపోవడం.

కానీ తను ఏంచేసినా రచ్చ.ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులు...

ఇంట్లో అశాంతి.

సాండ్విచ్ లా..అడకత్తర లో పోకచెక్కలా మారింది తన బతుకు.

ఇవాళ తను కారు బయటకి తీసి

తండ్రి ని రమ్మన్నాడు.

సిద్దంగా ఉన్నట్టు వచ్చి తండ్రి తన పక్కన‌కూర్చున్నాడు.

ఎక్కడ కని అడుగుతాడే మోనని తను ఎదురు చూస్తున్నాడు.

కానీ తండ్రి ఎమీ అడగకుండా ధ్యానసమాధి లో కూర్చున్న మునీశ్వరుడి లాఉన్నాడు.

తనకి పలకరించడానికి భయం వేస్తోంది.

కారు కదుల్తోంది నెమ్మదిగా.

శేఖర్ కి బయటి నుండి వస్తున్న చల్లగాలికి కళ్లు మూతలు పడ్డాయి.

***********

....శేఖర్ కి అంతా అగమ్యగోచరంగా వుంది.తండ్రి ఎక్కడికి వెళ్లి వుంటాడు.

దారి లో లఘశంక కోసం తండ్రి కారు దిగినపుడు తన ఆలోచనల్లో తనున్నాడు.తండ్రి ఎప్పటికీ రాకపోయేసరికి

తనకు సందేహం కలిగి బయటకు వచ్చేడు.కాస్సేపు తచ్చాడి ఎందుకయినా మంచిదని కారంతా వెదికాడు.

అప్పుడు కనిపించిందది.

వెనక సీటు కింద ఓ కవరు.

అందులో వుత్తరం.

గబగబ తీసి చదవనారంభించేడు.

చి.శేఖర్,

నా గురించి నువ్వు దిగులు పడకు.

నీపరిస్ధితి,వేదన నేనర్ధం చేసుకోగలను.

దగ్గరగా వుండి చికాకులు పడేకన్నా దూరం గా వుండి సంబంధం మెరుగు పరచడం మంచిది.

నేను నా బాధ్యతలు అన్నీ సక్రమంగా నిర్వర్తించే ను.

నువ్వు కూడా నీ కుటుంబం తో సుఖంగా వున్నావు.నీ బాధ్యత నువ్వు సక్రమంగా నెరవేర్చే ప్రయత్నం చెయ్యి.

నీ పిల్లల్ని వృధ్దిలోకి తెచ్చే ప్రయత్నం చెయ్యి.నా ఆశీర్వాదం మీ అందరికీ ఎప్పుడూ వుంటుంది.

ఇహ నా సంగతంటావా

నా పెన్షన్ నాకుంది.

నాకు ఎప్పటినుంచో సంపూర్ణ భారతయాత్ర చెయ్యాలనుండేది.

ఈ రూపంలో అది తీరనుంది.

నే నిక్కడనుంచి తిన్నగా విశ్వేశ్వర నగరం కాశీ చేరుకుని,అక్కడ పవిత్ర గంగా స్నానం తో నా యాత్ర ఆరంభిస్తాను.

నా గురించి బెంగ అనవసరంగా పెట్టుకోకు.

అన్నట్లు.. మరో విషయం...

ఎవరు అడిగినా నన్ను తీర్ధయాత్ర లకు తెలిసినవాళ్లతో పంపించినట్లు చెప్పు.

దాని వల్ల నీకు చెడ్డపేరు రాదు.

నాకేమయినా అవసరమయితే

నీకు కబురు చేస్తాను.

మరోసారి ఆశీర్వాదాలతో-

నాన్న

శేఖర్ కళ్లు ధారాపాతంగా వర్షిస్తున్నాయి.

హిమాలయ పర్వతం లా పెరిగిపోయిన తండ్రి వ్యక్తిత్వం ముందు మరుగుజ్జులా ఫీలవుతూ ఇంటిదారి పట్టాడు శేఖర్.

- భాగవతుల కృష్ణారావు

First Published:  13 Nov 2023 2:44 PM IST
Next Story