అమ్మానాన్న (కథ)
"అమ్మకీ నాన్నకీ ఒంట్లో సరిగాలేదుట.అస్సలు లేవలేక పోతున్నారు" ప్రొద్దున్నే అన్నయ్య ఫోన్.
"ఆపల్లెటూరిలో ఎందుకు? నీదగ్గరకు తెచ్చుకోకపోయావా? నీ దగ్గరైతే వైద్యసౌకర్యం అదీ ఉంటుందిగా? " అన్నాన్నేను .
" నేనంత బిజీగా ఉంటానో తెలుసుగా? మీ వదినకీ అమ్మకీ పడదుగా?! అదీగాక ఈ వయసులో ఆఊరు వదిలి రావటానికి ఇష్టపడరు వాళ్ళు... సరేలే ఓ రోజు నేనే వెళ్ళి చూసివస్తాలే... మీ అత్తా మామా ఎలా ఉన్నారు..అయినా పూవుల్లో పెట్టి చూసుకునే నువ్వండగా వాళ్ళకేం బానేఉంటారులే.... " అన్నాడు.
"కేవలం చూసివస్తే సరిపోతుందా?.."
నేను అడిగే లోపలే ఫోన్ పెట్టేసాడు.
ఏమిటంత బిజీ... అయిన వాళ్ళతో కూడా మాట్లాడలేనంత....?
"అమ్మా ..." పిలుపుకు బయటికి వెళ్ళా.
"సింతసిగురు తెచ్చానమ్మా!? చెట్టు ఎక్కి కోసే వయసు కాదుగా నాదీ.. చిన్నచిన్న సెట్లకే తెంపుకొచ్చా. మీ కోసమే తెచ్చినా ఓ యాభై ఇయ్యండమ్మా! "
"నాకక్కర్లా తీసుకుపో" అన్నాను.
"మీ కోసం కాకపోయినా నాకోసం తీసుకోండమ్మా.... సానా కష్టాల్లో ఉన్నాను"
అంటూ భోరున ఏడ్చింది లక్ష్మమ్మ.
"అయ్యో! ఎందుకంత ఏడుపు ..ఇవ్వుతీసుకుంటా "
"మీకు తెలుసుగా అమ్మాయిగారూ?! నేను తట్టెత్తుకుని ఇల్లిల్లూ తిరిగి కూరగాయలు అమ్మినా... దాంతోనే ఐదుగురు ఆడపిల్లలను సాదినా!... పెల్లిళ్ళు చేసినా!...
ఇయాళ నాకు బువ్వెట్టటానికి ఒక్క కూతురుక్కూడా సాతకాట్లా అమ్మా!పెద్దకూతురు సచ్చిపోతే దానిసంతానాన్నీ కూరగాయల తట్టతోనే సాదినా? ఇయాళ
నీ లెక్కేంది? అని పోయిండ్రు "
"మరి నీ రెండో కూతురు సుభద్ర... మామిడిపండ్ల తట్టతో మాయింటికి వచ్చేది
ఇప్పుడు రావట్లేదనుకో! దానికేం రోగమయిందీ? ఊళ్ళోనేగా! రెండు రోజులు ఉంచుకోవచ్చుగా! "
మళ్ళీ పెద్దపెట్టున ఏడ్చి కళ్ళుతుడుచుకుని
"ఏందమ్మాయ్ గారూ?!దానిమగడు ఆటో తోలి మూడుఆటోలు కొన్నడు. ఇదీ యాపారం సేసుద్ది. పిల్లలూ పెద్దోళ్ళయిండ్రు.
ఏం!?తల్లికి ఇంత ముద్దపెట్టలేదా సెప్పండి.
"సూడండి... ఈ ఎడమచెయ్యి ఇరిగింది.
గవన్నమెంట్ ఆస్పత్రి కాడ చూయించుకుని
మీ లాంటి అమ్మకాడ పదిరూపాయలు అడుక్కుని... మందులు వాడుకున్నా.
చేయి పైకిలేవదు.. చూసారుగా... కుడిచేత్తోనే పనంతా చేసుకోవాలి. పాసి వాకిలి ఊడ్చాల్నా... బాసన్లు తోముకోవాల్నా... ఏందమ్మాయిగారూ ఈబతుకు... ఐదుగురు కూతుళ్ళుండీ... "
"కూతుళ్ళని మెుగుళ్ళు రానీయవద్దా లచ్చుమమ్మా... నీకు కొడుకుల్లేరుగా "
అని ఇందాక అన్నయ్య ఫోన్ గుర్తుకువచ్చి నాలిక్కరుచుకున్నా..
"కొడుకులుంటే మాత్రం ఏ కొడుకులు సూత్తన్నారమ్మాయ్ గారూ?! "
"ఎందుకు చూడరులే....ఎక్కడో తప్ప కొడుకులు చూడకపోతే ఎవరుచూస్తారూ?
మా ఆయనగారూ, నేనూ.... "
"మీలాంటోళ్ళు ఎక్కడో ఉంటారు అమ్మాయిగారూ! "
"ఇంద ఈ డబ్బులు బట్టలూ తీసుకుపో... అవసరం ఐతే రా.. ఏడవకూ"
లక్మమ్మ ను పంపి లోపలికి వచ్చా...
పాతపేపర్లు సర్దుదామని ఉపక్రమించా..
ఓ వార్తఆకర్షించింది. "ఆడపిల్లకి కూడా ఆస్థిలో సమాన హక్కు... " అని మనసులో చదివి ,మరి బాధ్యతలో "? అని పైకే అనేసా...
"మీ సత్యం పెదనాన్న పోయాట్టోయ్ ..." ఫోన్ లో మాట్లాడుతూనే నాతో చెప్పారీయన.
"పోతేపోయాడు కష్టాలు గట్టెక్కినాయ్ " అన్నాను ఉదాసీనంగా.
అలా ఎందుకన్నానో ఆయనకి తెలుసుకాబట్టి... ఏంమాట్లాడకుండా.. అవతలికి వెళ్ళిపోయారు.
నేను వంటింట్లో వంటచేస్తూనే.. పెదనాన్న గురించి ఆలోచిస్తున్నా.
ఎప్పటిసత్యంపెదనాన్న ?ఎప్పటికథ?
ఇప్పటికీ ఈవయసులో నాఫోన్ రిసీవ్
చేసుకుని విని, సమాధానం చెప్పగలుగుతున్నాడంటే
చాలా ఆశ్చర్యం గాఉంటుంది.
పలకరించటానికి ఎప్పుడు ఫోన్ చేసినా,
ఒకే రికార్డ్ ,నా చెవిలో మ్రోగించే వాడు పెదనాన్న.
"హలో! పెదనాన్నా! ఎలాఉన్నారు? "
"హలో!ఎవరే?నువ్వు పార్వతికదూ?!
ఏం చెప్పమంటావే నాకష్టాలబ్రతుకూ,
చిన్నప్పట్నించీ ఇంతేకదా! మా అమ్మానాన్న పోతే ఇల్లిల్లూ తిరిగి 'ఆయవారాలు' చేసుకుంటూ,ఆయవారాలంటే తెలుసుగా రోజుకో ఇంట్లో భోజనానికి చెప్పుకుని వాళ్ళుపెట్టిందితిని, అలాగే చదివా!"
"ఏదో... పోష్టాఫీసు గుమాస్తా నయ్యానా?!
ఇక మీ పెద్దమ్మ మగపిల్లాడి కోసం, నలుగురు ఆడపిల్లలకు తల్లయి... ఆరోగ్యం బాగుండక మంచం పట్టిందా? అప్పుడూ
చాకిరీ చేసుకోవాల్సివచ్చిందా!?
"పిల్లల చదువులు, పెళ్ళిళ్ళు, పురుళ్ళూ పుణ్యాలూ, ఒంటిచేత్తో లాగానా?!
ఆడపిల్లలంతా ఎవరిదారిన వారు పోయారు
మీ పెద్దమ్మా పోయింది.
వీడూ.....నీ తమ్ముడు శీనూ నేనూ ఏదో ఇంత వండుకుని తింటున్నామ్. పెళ్ళి చేసుకోరా అంటే చేసుకోడు... ఏదన్నా సంబంధం ఉంటే చెప్పరాదుటే... "
"సరేపెదనాన్నా! ఇప్పుడు శ్రీను వంటచేసి వెళ్ళాడా?! ఆఫీసుకీ "
"ఆ... నాశ్రాద్దం.. వాడు కొంపలో ఉంటేగా ఎప్పుడూ ఆఫీసులోనేనయ్యే....
ఇప్పుడు నాకు 90 ఏళ్ళు....ఈవయసులో
ఇంటి చుట్టూ ఊడ్చుకురావాలా?! అంట్లుతోముకోవాలా?! నా బట్టలన్నా నేను ఉతుక్కోవాలా?! ఇక అన్నం వండుకోవాలా?
ఇదిగో ఇప్పుడే వంకాయకూర వండి
కంచంలో అన్నంపెట్టుకుని, ఫోన్ ఎవరన్నా చేస్తే వినబడదని దగ్గరెట్టుకుని.. కూర్చున్నానే....వాడు ఎప్పుడు వస్తాడో
ఎప్పుడు పోతాడో వాడికే తెలీదు..
ఓపిక ఉండట్లేదే అమ్మాయ్... "
తొంభ్బై ఏళ్ళ మనిషి ఇంకా "ఓపిక ఉండట్లేదే అమ్మాయ్" ...అంటుంటే సిగ్గు పడాల్సినివిషయం కాదా?!
ఎన్నిసార్లు ఫోన్ చేసినా పెదనాన్న
ఇదే వినిపించినా
విసుగులేకుండా నేను వింటూనే ఉన్నాను.
"అదికాదే అమ్మాయ్! నీకు తెలుసుగా బందరులో ఉన్న బాలక్క మెుగుడు కరోనా తో పోయాడు .అప్పుడే దాదాపు ఏడాదౌతోంది. ఇక్కడికి రావే! ఇద్దరం కలిసి ఉందాం.. కాస్త నాకు వండిపెట్టు.. నేను నీకు ఆర్ధికంగా అండగా ఉంటానూ.. అనిచెప్పానే
వస్తానందీ... రాలా!.. ఈ ముసలాడు ఎవరిక్కావాలీ ?!సరేలే ఉంటా..." అనిఫోన్ పెట్టేసేవాడు.
పెదనాన్న పోయాడు. ఏమిటిదీ? కులమేదైనా, మతమేదైనా,వృధ్దులభారతం యువభారతానికి భరించలేనంత బరువౌతోందిగా!?
ప్రతి సమస్యకీ ఎన్నో కోణాలున్నట్లు ,ఈ సమస్యకూ ఎన్నో కోణాలు.
ముసలిప్రాణానికి ఇంత ముద్ద వేయలేక పోయారా? అని వయసు మళ్ళినవారి వాదన. ముద్ద ఒక్కటే సరిపోతుందా?
ఇన్ని వృధ్ధాశ్రమాలూ ముద్దల కోసమే ఏర్పాడ్డాయా? ముసలి వాళ్ళంటే ఎన్ని బాధలుంటాయ్... చేసేవాళ్ళకీ, చేయించుకునే వాళ్ళకీకూడానూ !?
ఇదివరకు ఉమ్మడి కుటుంబాలు, ఉండేవీ, దూరదేశాల్లో ఉద్యోగాలు లేదుకాబట్టి,
ఎవరోఒకరు కనిపెట్టుకునే ఉండటం వలన,అత్తాకోడళ్ల పోట్లాటలే తప్ప, ముసలివాళ్ళు ఏకాకులై పోవటం తక్కువ. ఇప్పుడు పొట్ట చేతబట్టి అందరిజీవితాలూ పోరాటంగానే ఉంటున్నాయ్. అందుకే...
ఆడపిల్లలకైతే, 'మా ఆయన వప్పుకోడు' అనీ, మగపిల్లలయితే, 'అత్తకీ కోడలికీ పడదుగా' అని ... భాగస్వామి మీదకి నెట్టేసే వంకలు. తమ జీవన పోరాటం లో తమ పిల్లలతో పాటు, పెద్దవాళ్లూ ఓ భాగమే అనుకుంటే అంతా మంచిదే... లేదంటే ఇలా..... 'అనుకుంటూ నిట్టూర్చాను.
"మర్నాడు అత్తయ్యా! అమ్మనీ నాన్ననీ చూసిరావటానికి వెడదామనుకుంటున్నాను." అన్నాను.
"చూసిరావటం కాదు. వాళ్ళిద్దరినీ కారులో ఇక్కడికి తీసుకురా? మనతో పాటే వాళ్ళూ
వాళ్ళతో పాటే మేమూనూ..
కోర్టు ఆడపిల్లలకీ సమాన హక్కని తీర్పుచెప్పపోతోంది... మరి బాధ్యతలు
సమానం అని తీర్పూ చెప్పాలిగా! కాదా?! అయినా! ఇప్పుడు వాళ్ళ ఆస్థి మనకు అక్కర్లేదులే మనకున్నది చాలు .
బాధ్యతలు పంచుకో చాలు " అంటున్న,
అత్తయ్యను,ఆయన్నీ కన్నార్పకుండా చూస్తుండిపోయాను.
- భాగవతుల భారతి