నిర్ణయం..!! (కథ)
ఆ ఫోన్ కాల్ వచ్చినప్పటి నుండి స్వాతి మనస్సంతా ఏమిటేమిటోగా కంగారుగా ఉంది. ఏం చెయ్యాలో తోచటం లేదు. ఆరోజు మధ్యాహ్నం ఆఫీసులో లంచ్ అవర్లో చూసుకుంది. స్వాతి ఆ మిస్డ్ కాల్ ని. అత్తయ్య దగ్గరనుండి.
సహజంగా ఆఫీసు పని వేళల్లో అత్తయ్య ఫోనే చెయ్యదు అనటం కంటే ఆవిడకు ఫోన్ చెయ్యాల్సిన అవసరం కలగదు అనటం సబబేమో. పిల్లలు స్కూళ్ళకు, కాలేజీలకు వెళ్ళిన తర్వాత ఆమెకు మిగతా కాలక్షేపం అంటే టి.వి. సీరియల్స్ తో ,లేదంటే రామకోటి రాస్తూనో గడుపుతుంది. “ఆఫీసు పని ఒత్తిడిలో చూసుకోనేలేదు నేను మళ్ళీ...” అనుకునేంతలో ఫోన్ మోగింది.
అవతలి వైపునుండి అత్తయ్య కంఠస్వరం. వింటున్న స్వాతి మనస్సంతా అలజడికి లోనైంది. ఆందోళనతో ఆమె ముఖాన చిరుచెమటలు ఏం చెయ్యాలి? ఏమని చెప్పాలి? వద్దనా? అవుననా? కిం కర్తవ్యo? ఇదే పరిస్థితి తమకూ ఎదురైంది. అప్పుడెలా స్పందించింది సమాజం. ఇప్పుడు...? స్వాతి మనస్సు గతంలోకి పరుగులు తీసింది.
స్వాతి చలాకీ ఐన అమ్మాయి. దానికితోడు చదువులోనూ ఫస్టే. కష్టపడి బ్యాంకింగ్ పరీక్షల్లో నెగ్గి ఉద్యోగం సంపాదించుకుంది. పెళ్లీడుకొచ్చిన స్వాతికి ఒక మంచి సంబంధం చూసి తొందర్లోనే వివాహం చేయ సంకల్పించాడు రాఘవయ్య.
“నాన్నా! అమ్మలేని నన్ను ఇన్నాళ్ళు ఏలోటు రాకుండా పెంచావు. నాకు పెళ్ళయి వెళ్ళిపోతే నీవెలా ఉంటాననుకున్నావు. మీ బాధ్యతను కూడా తీసుకునే వారైతేనే నేను వివాహం చేసుకుంటాను. చూస్తూ చూస్తూ ఈ వృద్ధాప్యంలో మిమ్మల్ని ఇలా ఒంటరిగా నేను ఉంచలేను. క్షమించండి” అంటూ నిష్కర్షగా తన జవాబు చెప్పింది స్వాతి.
ఆలోచనల్లో పడ్డాడు రాఘవయ్య. తనన్న దాంట్లోనూ నిజం లేకపోలేదు. స్వాతి పసివయసులోనే పార్వతి గతించింది. కుంగిపోయాడు రాఘవయ్య. రెండో వివాహానికి బంధువర్గం ఎంత నచ్చజెప్పి ఒప్పించాలని చూసినా ససేమిరా అన్నాడు. స్వాతికి అన్నీ తానే అయి అల్లారుముద్దుగా పెంచాడు. అలాంటి అమ్మాయి పెళ్లి అయి వెళ్ళిపోతే ఇల్లంతా బావురుమన్నట్లు గుడ్డిపిట్టలాగా తానొక్కడే ఎలా ఉండగలదు? ఎన్నేళ్ళని వెళ్ళదీయగలడు? పోనీ తానెలాగో ఉండగలిగినా సమాజం ఉండనిస్తుందా? ఈడొచ్చిన తరువాత తనదారి తాను చూసుకొని ఆడపిల్ల వెళ్ళిపోయింది. ఆలనా పాలనా చూసిన కన్నతండ్రిని ఇలా ఒంటరి చేసి ఎలా వెళ్ళగలిగింది? అందరూ అంతే...? అంటూ నా చిట్టితల్లిని లోకం ఆడిపోసుకోదూ?! అనుకున్నాడు రాఘవయ్య.
రేపు ప్రొద్దున పెళ్ళివారు స్వాతిని చూసుకోవటానికి వస్తున్నారన్న విషయాన్ని ఆయన ఆలోచనల్లో పడి మర్చిపోయాడు.
*********************
ఆరోజు ఎలాగూ ఆదివారం. కాస్త బద్దకంగా నిద్రలేద్దా మనుకున్న స్వాతికి తెలతెలవారుతుండగా తలుపు తట్టిన శబ్దానికి మెలకువ వచ్చింది. “ఎవరూ?” అంటూ తలుపు తీసింది. 'పిన్ని కాంతమ్మేనా? 'మరోమారు కళ్ళు నులుముకొని చూసింది. ఆశ్చర్యం ఆవిడే..!
“రా... పిన్నీ!” అంది పక్కకు తప్పుకుంటూ.
“బావుందమ్మా మీ తండ్రీ బిడ్డల నిర్వాకం. ఈరోజు పెళ్లిచూపులు. ఆడదిక్కులేని సంసారం. పిండివంటలవీ చేయాలి తొందరగా రా, అంటూ పక్క ఊరినుండి నన్ను పరిగెత్తించి రప్పించిన తండ్రీ కూతుళ్ళు ఇంకా ఆలాగే ఉన్నారేం?” అంటూ సందడిగా ఇల్లంతా కలియదిరగ సాగింది కాంతమ్మ.
“ఓహో! ఇది నాన్న పనన్నమాట” చిన్నగా నవ్వుకుంది స్వాతి.
“స్వాతీ! మర్చిపోయా ఉదయం పన్నెండు లోపల వర్జ్యం లేదు బాగుందన్నారు. ఆ లోపల పెళ్లిచూపులు అయిపోవాలి. నువ్విలాగే ఉంటే లాభం లేదు. తొందరగా తెమలాలి!” అన్నాడు రాఘవయ్య.
“అలాగే నాన్నా!” అంటూ పనులకై నడుం బిగించింది స్వాతి. వేడి వేడి పకోడి, సేమ్యా పాయసం, పూరీ, ఆలుకుర్మా తయారయ్యాయి.
అద్దంలో మరోమారు మొహం చూసుకుంది స్వాతి. నుదుటన పట్టిన చెమటను తుడుచుకుని కాస్త పౌడర్ అద్దుకుని, కనకాoబరాలను తలలో తురుముకుంది. మెడలో సన్నని బంగారు గొలుసు, గులాబీరంగుపై చిన్నపూలున్న షిఫాన్ చీర, ముత్యాల గాజులతో కళకళ లాడసాగింది స్వాతి. “అచ్చం వాళ్లమ్మే” అంది మురిపెంగా కాంతమ్మ మెటికలు విరుస్తూ.
సమయం పదకొండున్నర. బయట కారు ఆగిన శబ్దమైంది. వియ్యాలవారిని సాదరంగా ఆహ్వానించాడు రాఘవయ్య.
పెళ్ళికొడుకు ఫణీంద్రది అప్పుడప్పుడే కుదురుకుంటున్న బిజినెస్. తండ్రి లేడు. ఉన్నదల్లా తల్లి కామాక్షమ్మ. ఆవిడకి కాస్త జాతకాల పట్టింపులూ ఎక్కువే! ఆశ్లేష నక్షత్రం అంటే అత్తకు గండం, మూల నక్షత్రం మామకు యమపాశం అంటూ వెదకి వెదకి పుష్యమి నక్షత్రం పుడమిని ఏలుతుంది అంటూ స్వాతిని ఎన్నుకున్నారు. స్వాతి పేరుకు తగ్గట్టే అమ్మాయి చాలా సాత్వికం అంటూ తెగ మెచ్చుకొని ఈ సంబంధాన్ని ఖాయం చేసుకుందామన్న కృత నిశ్చయంతో ఉన్నారు వియ్యాలవారు.
ఫోటోలోకన్నా మరీ అందంగా కన్పించింది ఫణీంద్రకు స్వాతి. ఇరువురి అభిరుచులు కలవటంతో కామాక్షమ్మ నోరు విప్పింది. “చూడండి,అన్నయ్యగారూ! ఎంత లేదన్నా ఎనిమిది తులాల బంగారం, హీరో హోండా బైకు, ఎలాగూ లాంఛనాలు బాగా జరిపించాలనుకోండి. మాకా ఎలాగూ ఆడపిల్లలు లేరు. కాబట్టి నాకు కోడలైనా కూతురైనా మీ అమ్మాయే. వచ్చే నెలలో మావారి ఆబ్దికం. అది కాగానే నిశ్చితార్థం జరుపుకుని వివాహం కూడా కార్తీకంలోనే అయ్యేలా చూసుకుందాం. ఉభయులకు, పిల్లలకు కూడా సమయం ఆదా అవుతుంది” అంది కళ్ళజోడు సర్దుకుంటూ కామాక్షమ్మ.
అవునని, కాదని అనలేక చిన్నగా నవ్వి ఊరుకున్నాడు రాఘవయ్య. అక్కడ ఆయన ఏమన్నా మాట చెల్లదని తొందరగానే గ్రహించింది స్వాతి. వియ్యాలవారిని సాదరంగా గేటు వరకు సాగనంపారు రాఘవయ్య, కాంతమ్మలు.
“నాన్నా! ఎంత లేదన్నా మూడు, నాలుగు లక్షలపైనే అవుతుంది. వాళ్ళ కోరికలు తీర్చ మన తరమా చెప్పండి? ఎలా సర్డుతావు నాన్నా ఇంత డబ్బు. మనకి ఈ సంబంధం వద్దని చెప్పలేకపోయావా?” అంది స్వాతి బాధగా.
“పిచ్చి తల్లీ! నీ మనస్సు నాకు తెల్సమ్మా! ఫణీంద్రను నవ్వు అభిమానంతో చూస్తున్నప్పుడే అనుకున్నాను. అతడు నీకు నచ్చాడని. అంతా బాగానే ఉంది కాని ఇంత తక్కువ వ్యవధిలో డబ్బు ఎలా?” ఆర్థోక్తిలో ఆగిపోయాడు రాఘవయ్య. ఈ ఊర్లో తలదాచుకునే నీడ, స్వాతి జ్ఞాపకాల ఆలంబన... తప్పదు పెంకుటిల్లును అమ్మేయాల్సిందే నిట్టూర్చాడు రాఘవయ్య.
తను బ్యాంకులో దాచుకున్న డబ్బు స్వాతి చదువులకై హారతి కర్పూరంలా హరించుకు పోయాయి. అమ్మాయేమో ఇప్పుడిప్పుడే ట్రైనింగ్ పిరియడ్ జాబ్ లో ఉంది. అల్లునిదా ఇప్పుడుప్పుడే కుదురుకుంటున్న బిజినెస్. ఉన్న ఇల్లు అమ్మేసి స్వాతి పెళ్ళికి పోనూ, మిగిలింది కాస్త బ్యాంక్ లో వేస్తే తన మనవలకు, మనవరాళ్ళకూ ఏదైనా నగరూపంలో తన అచ్చట ముచ్చట తీర్చుకోవచ్చు. నిర్ణయించుకున్నాడు రాఘవయ్య.
*****************
అనుకున్నట్టుగానే స్వాతి పెళ్లిని ఘనంగా, కామాక్షమ్మ కోరిన లాంఛనాల ప్రకారం జరిపించాడు రాఘవయ్య. "ఒక్కగానొక్క కూతురి పెళ్లి చాలా బాగా చేశావు రాఘవయ్యా "అంటూ బంధుజనం మెచ్చుకుంటే దీవెనలుగా భావించి, బాధ్యతను కూడా దించుకున్నందుకు అతని పితృహృదయం పొంగిపోయింది.
పెళ్ళికి ముందే ఫణీంద్రకు తమ సాధకబాధకాలను తెలియజేసింది స్వాతి. “నాతోబాటు మా నాన్న కూడా ఉంటారు” అంది స్వాతి. “ఓ.కే. అలాగే” అంటూ తన సమ్మతిని తెలియజేశాడు ఫణి.
కాని తానొకటి తలిస్తే ఆ దైవం మరొకటి తలిచిందన్నట్లుగా రాఘవయ్య తాను స్వాతి దగ్గర ఇప్పట్నుంచే ఉండబోనని మొండికేశాడు. “చూడమ్మా స్వాతి! మీరా కొత్తగా పెళ్ళయిన జంట. మీతోబాటు నేను ఇప్పట్నుంచే అదే ఇంట్లో ఉండటం నాకైతే మర్యాదగా అన్పించటం లేదు. నేను మీకు దగ్గర్లోనే ఏదో ఒక చిన్న గది అద్దెకు తీసుకొని ఉంటాను. నీకు మనసు అయినప్పుడు నన్ను చూడొచ్చు. నాకు కాస్త కాలక్షేపంగానూ ఉంటుంది. నేను సెలవు రోజుల్లో ఎలానూ వచ్చిపోతుంటాను. ఇక నా గురించిన బెంగపెట్టుకోకు” అంటూ సున్నితంగా స్వాతి నిర్ణయాన్ని తోసిపుచ్చాడు రాఘవయ్య. తన పెద్దరికాన్ని కాపాడుకున్నట్లుగా అన్నట్టుగానే మరో పదిహేను రోజుల్లో రాఘవయ్య మకాం చిన్నగదిలోకి మారింది. అప్పుడప్పుడు కూతురు, అల్లుడు వచ్చిపోతూ రాఘవయ్యకు రోజులు బాగానే జరుగుబాటు అవసాగాయి. తానూ ఏవైనా పండగ, పబ్బాలు వస్తే కూతురు దగ్గరకు వచ్చిపోతూ ఆనందంగా రోజుల్ని వెళ్ళదీసుకోసాగాడు.
************
ఆదివారం సాయంత్రం కాస్త కులాసాగా టి.వి. చూస్తున్న ఫణీంద్రను నెమ్మదిగా కదిపింది స్వాతి. “ఏమండీ మా బ్యాంకులో అందరూ హౌజింగ్ లోన్ తీసుకొని సొంతయింటి వారు అవుతున్నారు. మనం కూడా..” ఇంకేదో అనబోయేంతలో, ఠక్కున టి.వి. కట్టేస్తూ ఫణీంద్ర “ప్లీజ్ స్వాతీ! ఇప్పుడప్పుడే అంత పెద్ద మొత్తం లోన్ తీసుకునే సాహసం మాత్రం చేయను. ఏదో వేన్నీళ్ళకు చన్నీళ్ళలా నీ జీతం తోడుంటే ఇంట్లో ఆధునిక వస్తువులు, కావాలంటే కారు కొందాం. ఇంకో ఐదేళ్ళవరకూ ఈమాట ఎత్తకు. అప్పటివరకు నా బిజినెస్ నష్టాలను తెoపుకొని, లాభాల బాట పట్టాలని ఆశించు. ఆ తర్వాతే ఇల్లు. నా ఉద్దేశ్యంలో ఇల్లంటే ఇంద్రభవనంలా ఉండాలి. పెద్ద డ్యూప్లెక్స్ కట్టుకుందాం. ఇలా చిన్నచిన్న ఇల్లు, అదీ లోన్ పెట్టి మరీ తీసుకోవటం నాకిష్టం లేదు” అంటూ విసురుగా లేచి వెళ్ళాడు ఫణీంద్ర.
నిట్టూర్చింది స్వాతి. ఏదైనా ఇండిపెండెంట్ హౌస్ తక్కువలో దొరికితే ఇప్పుడు కట్టే అద్దెలోనూ మరో పాతికవేలు లోన్ తీసుకుంటే తామూ ఒక ఇంటి వారమవుతామని ఆమె ఉద్దేశ్యం. అదీగాక అందరూ కలిసి ఒకేచోట ఉండొచ్చు. ముఖ్యంగా నాన్నను తనతో బాటే అదే ఇంట్లో ఉండమనొచ్చు అనుకుంది స్వాతి. కాని ఫణీంద్ర జవాబు విని నొచ్చుకుంది. తమకింక గృహయోగం ఎప్పుడో? అనుకుంది మనసులో.
*********************
“అత్తయ్యా! నాన్న వచ్చారా?” అనడిగింది స్వాతి ఏదో పనిమీద బయటకు వెళ్ళివస్తూ. పూజ చేసుకుంటున్న కామాక్షమ్మ “అబ్బబ్బ! ఇది మూడోసారి స్వాతీ! మీనాన్న గురించి అడగటం. ప్రొద్దుట్నుంచి ఇటువైపు రానేలేదు. ఈరోజు పౌర్ణిమ, లలితా నామాలు పఠిస్తున్నా. మరోసారి డిస్టర్బ్ చేయకు. కావాలనుకుంటే ఓసారి వెళ్లి చూడరాదూ” కాస్త విసుగ్గా అందావిడ.
ఏదో కీడు శంకించిన దానిలా గబగబా చెప్పులు వేసుకొని, కిందికి దిగింది స్వాతి. పరుగులాంటి నడకతో తండ్రి ఉంటున్న ఇంటిని సమీపించింది. రాఘవయ్య అలాగే మంచంలో పడుకుని ఉన్నాడు. దగ్గరకు వెళ్లి నుదురు తాకి చూసింది. జ్వరంతో ఒళ్ళు కాలిపోతుంది.
“నాన్నా! లేవండి. ముందు హాస్పిటల్ కి వెళ్దాం” అంటూ బయలుదేర తీసింది. డాక్టరు వద్దకు వెళ్లి మందులు రాయించుకుని, పాలు, బ్రెడ్డు, ఆపిల్స్ కొనుక్కొని ఆటోలో జాగ్రత్తగా రాఘవయ్యను తన ఇంటికి తీసుకువచ్చింది స్వాతి.
“ఏమైంది అన్నయ్యగారూ! ఓహో జ్వరమా! అయ్యో, రెస్టు తీసుకోండి తగ్గిపోతుంది. ఎంతైనా మగపిల్లలు లేని సంసారమాయే. కొడుకైనా, కూతురైనా మా కోడలేగా” అంది ఎగతాళిగా కామాక్షమ్మ. రాఘవయ్య హృదయం గాయపడింది. బేలగా చూశాడు స్వాతివైపు.
“ఏం ఫర్లేదు నాన్నా! అత్తయ్య అన్నది నూటికి నూరుపాళ్ళు నిజం. నీకు కొడుకైనా, కూతురైనా నేనేగా. ఏం కాదు నాన్నా, మీకు తొందరగానే జ్వరం తగ్గుతుంది. నీను నేను ఉన్నాగా” అంటూ జాగ్రత్తగా రాఘవయ్యను తమ బెడ్ రూoలోకి నడిపించింది స్వాతి. మందులు వేసి, వేడిపాలు, కాస్త బ్రెడ్డు తినిపించి, దుప్పటి కప్పింది. కళ్ళు మూసుకున్నాడు రాఘవయ్య. ఆయన కనుకొలుకుల్లోంచి అప్రయత్నంగా రెండు కన్నీటి బొట్లు వెచ్చగా జారాయి.
*****************
నాలుగురోజులు గడిచాయి. ఈ నాలుగు రోజుల్లోనూ ఏవో సూటిపోటి మాటలంటూ అతని మనసును గాయపర్చింది కామాక్షమ్మ. ఆరోజు ఆఫీసునుండి తొందరగా ఇంటికి వచ్చిన స్వాతితో “అమ్మా! ఈరోజు కాస్త కులాసాగా ఉన్నాను. నా రూంకు వెళ్ళిపోతాను. అక్కడే మిగతా మందులు వేసుకుంటూ ఉంటాను. ఏదో దేవుని దయవల్ల జ్వరం కూడా కాస్త జారింది. ఇప్పుడు ఫర్వాలేదు. నేను వెళ్తానమ్మా!” అన్నాడు రాఘవయ్య. ఇక తానిక్కడ ఉండలేనట్టుగా.
“అయ్యో! అదేంటి నాన్నా! అలా అంటారు. కనీసం పది రోజులైనా లేనిదే ఎలా? మళ్ళీ రేపు డాక్టర్ రమ్మన్నాడుగా రూంలో అక్కడ ఏం వండుకుంటారు? ఏం తింటారు? జ్వరం జారినా పథ్యం ఉండాలిగా. ఏం కాదు మరో వారం రోజులు మీరు ఇక్కడ ఉండాల్సిందే” బలవంత పెట్టింది స్వాతి.
తప్పదన్నట్లుగా ముళ్ళ మీద ఉన్నట్లు ఆ వారం రోజుల్ని గడిపాడు రాఘవయ్య. ఆరోజు ఆదివారం. “స్వాతీ! ఇక నేను వెళ్తానమ్మా” ఇబ్బందికరంగా మొహం పెడుతూ అన్నాడు రాఘవయ్య. ఇంకా తండ్రి మనస్సు నొప్పించదల్చుకోలేదు స్వాతి. ఆమెకూ తెల్సు, తన తండ్రి ఏదో కాలానికి కట్టుబడి ఇక్కడ ఉన్నాడేగాని మనస్ఫూరిగా కాదని, “ఉండండి నాన్నా! నేను వచ్చి దిగబెడతానoటూ” బయలుదేరింది స్వాతి.
*****************
కార్తీక మాసం... ఉదయం పూట పొగమంచు దుప్పటిలా దట్టంగా పరుచుకోసాగింది. నెమ్మదిగా చలి ముదరసాగింది. ఎందుకోగాని ఈ మధ్య రాఘవయ్యకు ఆయాసం, ఉన్నట్టుండి దగ్గు తెరలు చుట్టుముట్టి.. ఆయనను కుదురుగా ఉండనీయడం లేదు. మనిషిలోనూ నిస్తేజం కొట్టొచ్చినట్టుగా కన్పడసాగింది. అన్నం సహించటం లేదు. ఆదివారం ఉదయాన్నే స్వాతి తండ్రి వద్దకు బయలుదేరింది.
“ఈమధ్య నాన్న ఆరోగ్యం మందగించింది. పోనీ నావద్ద ఉండు నాన్నా అంటే వినరు. ఆత్మాభిమానం గల మనిషి. నాన్న పరిస్థితి ఎలానో ఏమో!” దిగులుగా నుకుంది స్వాతి. లోనకు అడుగుపెట్టిన ఆమె కొయ్యబారి పోయింది. మంచంలో అచేతనంగా పడివున్న రాఘవయ్య నోట్లో నుండి కొద్దిగా నురగ. ఒక్క అంగలో తండ్రిని సమీపించింది. అప్పటికే ఆయన శరీరం చల్లబడింది.
కుప్పకూలిపోయింది స్వాతి. నా..న్న తనను చిన్నప్పట్నుంచి అల్లారుముద్దుగా పెంచిన నాన్న ఇకలేరు. తట్టుకోలేకపోయింది స్వాతి. ఒక్కొక్కరుగా జనం ఆ గదిముందు గుమి గూడసాగారు
"మహానుభావుడు !ఎవరితోనూ చాకిరీ చేయించుకోకుండా వెళ్ళిపోయాడు. ఎప్పుడూ నవ్వుతూ పలకరించేవాడు” జనం మాటలు!
ఈ వార్త తెలిసి హుటాహుటిన ఫణీంద్ర తల్లితో సహా వచ్చాడు. ఈ కిరాయి ఇంట్లో అంత్యక్రియల నిర్వహణ జరగటానికి వీళ్ళేదు. మీరున్న ఇంటికే శవాన్ని తీసుకెళ్ళండి అంటూ ఇంటి ఓనరు హుకుం జారీచేశాడు.
“అయ్యయ్యో! ఇదికూడా అద్దె ఇల్లేనమ్మోయ్! మేమేదో చక్కని కుటుంబమని అద్దేకిచ్చాం గాని, ఇలా ఇంటిముందు శవాన్ని పడుకోబెట్టి, శవయాత్ర, డప్పుల చప్పుడు అంత్యక్రియల నిర్వహణ వీటన్నింటికి కూడా మేం ఒప్పుకోం” అన్నారు స్వాతి ఇల్లు గలవాళ్ళు.
గుండెలవిసేలా రోదించింది స్వాతి. ఎదురుగా కన్నతండ్రి శవం. అంత్యక్రియల నిర్వహణ ఎక్కడ? ఎలా? ఏదో ఆలోచించుకున్న దానిలా గబగబా కళ్ళు తుడుచుకుని తమ పిన్ని కాంతమ్మకు ఫోన్ చేసి ఏడుస్తూ విషయాన్ని వివరించింది స్వాతి.
మరోగంటలో వాహనం మాట్లాడుకుని శవాన్ని తీసుకొని కాంతమ్మ పిన్ని ఉండే పల్లెకు బయలుదేరారంతా. అంత్యక్రియలు, మృతశౌచం అన్నీ అయ్యేసరికి పదిహేను రోజులు గడిచాయి. స్వాతి బాధ చూడలేకపోయాడు ఫణీంద్ర. ఇల్లు కొనుక్కుందామన్న ఆమె ప్రతిపాదనలో వాస్తవం ఉందని గ్రహించాడు. దానికితోడు జరిగిన సంఘటన అతని ఆలోచన విధానాన్ని మార్చింది. రేపు తన తల్లి కామాక్షమ్మకు ఇదే పరిస్థితి ఎదురైతే...? నో! అనుకున్నాడు. మరో ఏడాది గడిచాక కొత్త ఇల్లు కొనుక్కొని ఓ ఇంటివాయ్యారు స్వాతి దంపతులు
*********************
'ఎక్కడివారు అక్కడ వెళ్ళిపోయాక నాకూ కాస్త కాలక్షేపంగా ఉంటుంది. పక్కనే చిన్నవాటా రెండు గదుల పోర్షన్ ని అద్దెకు ఇద్దామని' సూచన చేసింది కామాక్షమ్మ. సరే అనుకుని చిన్నవాటాని అద్దెకు ఇచ్చారు. తెల్సిన వారి ద్వారా చిన్న కుటుంబం అద్దెకు దిగింది అందులో.
ఏమైoదోగాని ఆ కుటుంబ పెద్దకు కొన్ని రోజులుగా ఒడిదుడుకులుగా ఉన్న బి.పి. ఉన్నట్టుండి ఎక్కువైంది. అతన్ని యశోద హాస్పిటల్ లో చేర్చారు. రెండు రోజులుగా వెంటిలేటర్ పై ఉన్న అతను గుండెపోటు రావడంతో మరణించాడు.
కామాక్షమ్మ ఫోన్ ద్వారా చేరవేసిన చావు కబురు అతనిదే. పైగా ఆవిడ ఉద్దేశ్యం ప్రకారం అతను మరణించిన రోజు మంగళవారం పంచమి దగ్ధయోగం అట! మరణించిన నక్షత్రం కూడా మంచిది కాదట. ఇంటికి శవాన్ని తెస్తే ఆరునెలలు ఇల్లు ఖాళీ చేయాలట. అప్పుడే ఆ ఇంట్లో తిరిగి ఉండగలుగుతారట. పైగా శాంతి కూడా చేయించాలట అంటూ ఏమేమో చెప్పిందావిడ.
*********************
ఫణీంద్ర కూడా ఊర్లో లేడు. బిజినెస్ ట్రిప్పుకని వారం రోజులపాటు నార్త్ కు వెళ్ళాడు. ఇప్పుడు తన ముందున్న కర్తవ్యo? వారిని అంత్యక్రియలు నిర్వహించుకోమనటమా? మానటమా? అత్తయ్య చెప్పిన విషయాలేవీ బుర్రకేక్కటం లేదు స్వాతికి. ఆరోజు తండ్రి శవాన్ని తీసుకెళ్ళి ఆ పల్లెలో దహనక్రియలు జరిపించిన దృశ్యమే పదేపదే ఆమె మనసులో మెదలసాగింది. ఏదో ఆలోచించుకున్న దానిలా దృఢచిత్తంతో అత్తగారికి ఫోన్ చేసింది స్వాతి. అవతలివైపు కామాక్షమ్మ “హలో, అత్తయ్యా! నాకు ఆఫీసులో అర్జెంట్ గా మీటింగ్ ఉంది. అది కాగానే తొందరగా ఇంటికి వస్తాను. దయచేసి నేను చెప్పేది సానుకూలంగా వినండి అత్తయ్యా! మనింట్లో అనుకోకుండా ఒక అశుభకార్యం జరుగబోతుంది. దానికి మీ జాతకాలు, నమ్మకాలను జతచేయకండి. అదికూడా ఒక తప్పనిసరి కర్తవ్యమే.. ఎంతోమంది అనాథలు రోడ్డుమీద చనిపోతుంటే సామాజిక బాధ్యతగా అనాథ ప్రేత సంస్కారం చేసేవాళ్ళను మెచ్చుకొని, అది గొప్ప పుణ్యాన్ని ఇస్తుందని మీరే అనేవారుగా! ఇలా అశుభ కార్యానికి అడ్డు చెబితే లోకంలో ఎవరూ కిరాయి ఇండ్లలో ఉండబోరు. అద్దెకున్నవారు కూడా అలా జరుగుతుందని.. ముందుగా కీడును ఎవరు ఊహిస్తారు చెప్పండి. ఎన్నో శుభకార్యాలు కిరాయి ఇండ్లలో చేసుకోవడానికి సమ్మతించే మనం, ఇలా శవయాత్రకు మాత్రం ఎందుకు అడ్డుచెప్పాలి. ఒక్క విషయం అత్తయ్యా! దయచేసి అపార్థం చేసుకోవద్దు.
ఎవరు ఏ సమయంలో చనిపోతారో, ఆ దేవుడు ఎవరి అంతిమయాత్రని ఎలా రాశాడో ఎవరికి మాత్రం ఏం తెలుసు? మానాన్నగారినే తీసుకోండి..” స్వాతి కంఠం రుద్దమైంది. పూడుకుపోయిన గొంతులో దుఃఖాన్ని దిగమింగుకుని డగ్గుత్తికతో మళ్ళీ మొదలుపెట్టింది ఆమె.
“ఆరోజు నేనెంత మానసిక క్షోభ అనుభావించానో ఆ దేవుడికే తెల్సు. మా ఇంటిలో వద్దు, మా ఇంటిలో వద్దు అనంటే శవాన్ని తీసుకొని కాంతమ్మ పిన్ని పల్లెకు వెళ్లాం. గుర్తుందికదా అత్తయ్యా! ఆరోజు... మనం ఎంత యాతనకి గురయ్యామో మీకు తెలియనిది కాదు. ఎందరికి కాంతమ్మ పిన్నిలాంటి వారు ఉంటారు చెప్పండి. ఉన్నా... ఇలాగే అందరూ ఆలోచిస్తే సమాజం ఏమైపోతుంది?
అంత్యక్రియలకు ఒప్పుకోనివారు ఇంటిని అద్దెకు ఇవ్వవద్దు అని నానా దుర్భాషలాడుతారు. అది మంచిదా చెప్పండి. ఇలా కటువుగా అంటున్నానని మాత్రం అపార్థం చేసుకోకండి. అలాంటి రోజు, అలాంటి నక్షత్రంలో మన ఇంట్లోనే ఎవరిదైనా మరణం సంభవిస్తే మాత్రం ఏం చేయగలుగుతాం అత్తయ్యా! అంతా విధి లిఖితం అనుకుని జరగవలసిన కార్యక్రమాలను జరిగేలా చూసుకుంటామా? లేదా? ఏమో! ఎవరికీ తెల్సు?
ఇప్పుడు మాత్రం ఈ కార్యక్రమం సజావుగా జరిగితే అదే పదివేలు.
వారు మనస్పూర్తిగా చూసే చల్లని చూపులే మనకు దీవెనలు.
ఎంతో పుణ్యాన్ని సంపాదించుకున్న వారమవుతాం.
ఎన్నో పూజలు, నోములు, వ్రతాలు చేసే మీరు సాటి మనిషిని మాత్రం ఎందుకు మానవతా దృక్పథంతో అర్థం చేసుకోలేకపోతున్నారు. అత్తయ్యా! మూఢనమ్మకాలు, అర్థంలేని పట్టింపులను కొద్దిసేపు పక్కకుపెట్టి ఆలోచించండి...
మనం చేయబోయే ఈ మంచిపనికి మన అద్దెగలవారు చెయ్యెత్తి దండం పెడతారు అత్తయ్యా! మీ గౌరవానికి భంగం కలగకూడదనే ఈ విషయాన్ని చెప్పేది... మీకు తెలియదని మాత్రం కాదు.
అందరికి స్వంత ఇల్లు ఉంటాయా? అద్దె ఇల్లు అనగానే అందరూ ఇలాగే ఆలోచిస్తే ఇక ఏహ్యభావన కలగడం మాత్రం ఖాయం. మనం మారదాం అత్తయ్యా! దేవుని దృష్టిలో అన్నీ మంచిరోజులే. అన్నీ మంచి తిథులే, మంచి నక్షత్రాలే! మీ అభిప్రాయాన్ని కొద్దిసేపు ఆలోచించుకొని మార్చుకుంటారని ఆశిస్తున్నాను అత్తయ్యా! నిర్ణయం మీదే ఇక..మీ ఫోన్ కాల్ కు ఎదురుచూస్తుంటాను!!!”
అంటూ ఫోన్ పెట్టేసింది స్వాతి ఒక ఆశావహ దృక్పథంతో.
ఆమె మనస్సు ఇప్పుడు మబ్బులువీడిన ఆకాశంలా నిర్మలమైంది. ఆమె కళ్ళలో ఇప్పుడు చల్లగా వెలిగే వెన్నెల కిరణాలు ...!!
- బి.కళా గోపాల్