అంతరాలు (కథ)
'చందూ, నువ్వు, వెంటనే బయలుదేరు?'ఫోనులో అన్నయ్య అన్నాడు.
'అన్నయ్యా! ఏమైంది ?' అదురుతున్న గుండెను చిక్కబెట్టుకుంటూ అడిగాను.
'చందూ, నాన్నకి గుండెపోటు వచ్చింది.ఇప్పుడే ఆసుపత్రిలో చేర్చాము' అన్నయ్య గొంతులో పుట్టెడు దుఖం ధ్వనించింది.
నా నవనాడులు కృంగి పోయినట్లుగా అయ్యాయి నా కళ్ళలో నీళ్ళు ధారాపాతంగా కారిపోతున్నాయి.
'నువ్వు వెంటనే బయలుదేరు?' అని అన్నయ్య ఫోన్ పెట్టేసాడు.ఆ మాటలకు నా మనస్సంతా అ్లల్లకల్లోమైపోయింది.
'ఏవండీ బాధపడకండి,మామయ్యగారికేమీ కాదు, ముందు టికెట్ బుక్ చేయండి'ఓదార్పుగా భుజం మీద చెయ్యి వెస్తూ కర్తవ్యాన్ని గుర్తుకు చేసింది నా భార్య రమణి.
'రేపటికి ఫ్లైట్ టికెట్టు దొరికింది'కన్నీటి ప్రవాహాన్ని అదిమి పెట్టుకుంటూ కంప్యూటర్ ముందు నుంచి లేచాను.విమానం నింగిలోకి ఎగిసింది.
నా ఆలోచనల్లో నాన్న ఆకాశంలా నిండిపోయాడు.
నాన్న పేరు కృష్ణారావు.అమ్మ పేరు రుక్మిణి దేవి.అమ్మా నాన్నది చాలా అన్యోన్యమైన దాంపత్యం.నా ఊహ తెలిసి ఇద్దరు కూడా ఏనాడు ఒకరినొకరు పల్లెత్తు మాట అనుకున్న జ్ఞాపకం ఒక్కటి కూడా నాకు లేదు.వాళ్ళ ఇద్దరివి ఒకటే ఆత్మలు, ఒకటే ప్రాణాలుగా ఉండేవాళ్ళు.వాళ్ళ ఇద్దరి మధ్య జీవితంలో చిన్న తేడా వచ్చింది, అంటే నా వల్లే...కేవలo నా వల్లే....
**
నా ఇంటర్ కాలేజి రోజుల్లో నాన్నతో నాకు నిత్యం ఘర్షణే.
'అమ్మా, డబ్బు కావాలి'చందు అన్నాడు.
'ఎంతరా?'రుక్మిణి నవ్వుతూ అడిగింది.
'అయిదు వేలు కావాలమ్మా' చిన్నగా అన్నాడు.
'అయిదు వేలా? అంత డబ్బా?ఎందుకు?' కొడుకు వంక ఆశ్చర్యంగా చూస్తూ అంది.
'అబ్బ నీకు అన్నీ చెప్పాలా, నాక్కావాలి, ఇవ్వు.అంతే,' హఠంగా అన్నాడు.
తల తిప్పుకొని, 'నాన్నని అడుగు.నా దగ్గర అంత డబ్బు లేదు.'నెమ్మదిగా అంది.
'నాన్ననా? నేనేం అడగను? ఇస్తే నువ్వే ఇవ్వు.లేకపోతే లేదు'పెంకిగా అన్నాడు.
'ఏం? ఎందుకని?' రుక్మిణి భృకుటి ముడిపడిoది.'నీకు తెలుసు?'తలెగరవేస్తూ అన్నాడు చందు.
'నువ్వు ఇప్పుడు చిన్నపిల్లాడివేం కాదు.మనుషుల్ని అర్థం చేసుకుంటూ,బంధాల విలువ తెలుసుకుంటూ మనస్సును విశాలపరచుకోవాలి అంతే కాని కుదించుకోకూడదు'
'అమ్మా, నువ్విలాంటి ఉపన్యాసాలు ఎందుకు ఇస్తున్నావో నాకు తెలుసు?' కోపాన్ని దిగమింగుకుంటూ అన్నాడు.
'చందూ, నాకు అన్నీ తెలుసు.కానీ నీకు మాత్రం ఏది తెలిసి రావడం లేదు.అయినా మళ్ళీ చెబుతున్నాను విను, నేను నీకు అమ్మను.ఆయన మీ నాన్నగారు.నీ భవిష్యత్తు కోసం అనుక్షణం తాపత్రయపడే నీ కన్న తండ్రిని నువ్వు ప్రతిక్షణం మర్చి పోతున్నావు?తల్లిగా నీకు ప్రతిసారి గుర్తు చేయలేక నేను బాధపడుతున్నాను'ఆవిడ కంఠంలో దు:ఖం ఎగదన్నుకొచ్చింది.
'అమ్మ నేను కాదు. నేను కొడుకుని అన్న విషయం మర్చిపోతున్నది ఆయన ' వెటకారంగా అన్నాడు. 'ఏమిటిది, 'చందూ,ఆయన ఏంటి? నాన్నఅని అనలేవా?ఎందుకురా ఇలా తయారవుతున్నావు నాన్నకి నువ్వంటే ఎంత ప్రాణమో నీకు ఎలా చెబితే తెలుస్తుంది.అసలు నీకు ఆయన ఎప్పటికి అర్ధం అవుతాడో. ' బాధగా అంది.
'ఆ ప్రాణం, నాకు చాలా బాగా తెలుసు.అందుకేగా ఇక్కడ కూర్చో, ఇక్కడ పడుకో, ఎప్పుడు బాగా చదువుకో, బయటికి ఎక్కడికి వెళ్ళకు స్నేహితులతో బలాదూర్‌గా అసలే తిరక్కు.ఇంతేగా రోజూ తిడుతూ, కసురుతూ నాకు చెప్పేది?' కసిగా అన్నాడు.
రుక్మిణి తెల్లబోతూ, 'అవేం మాటలురా,ఎందుకిలా ప్రతికూలతగా ఆలోచిస్తున్నావు.ఈ ఇంటర్మీడియట్ చదువు నీ జీవితంలో ఎంత పెద్ద మలుపో నీకు తెలియడం లేదు.స్నేహితులతో తిరగడం వల్ల ఎంత సమయం వృధా అవుతుందో నీకెంత చెప్పినా నీ బుర్రకెక్కడం లేదు?'నిసృహగా అంది
'అమ్మా? నేను కాదు ఆలోచించేది? నాన్నే నా గురించి ఎప్పుడు అలా తక్కువ చేస్తూ, నన్ను తీసి పారేస్తూ మాట్లాడతారు ? మంచి మార్కులు వచ్చినా కూడా, ఎంత కొద్ది మార్కులు తెచ్చుకున్నావంటూ నన్ను ఏకేస్తారు.ఎంతసేపు ఆయన చెప్పేది నేను వినాలి.కాని, నేను చెప్పేది ఒక్కనాడైనా ఆయన విన్నాడా?అన్నీ పద్ధతులు , క్రమశిక్షణలు అంటూ అంటూ నాకే రోజు పాఠాలు చెబుతాడు.అదే మరి అన్నయ్యని మటుకు నెత్తి మీద పెట్టుకు మరీ చూసుకుంటాడు.'
'చందూ, నువ్వు నాన్నని అనేంతవాడివి కాలేదు'రుక్మిణి కఠినంగా అంది.
'అమ్మా' నాన్న కింది ఇలాగే ఇంకా కొన్నాళ్ళు ఉంటే ఎప్పటికి నేను ఎంత వాడిని కాలేను? ఇలాగే ఎదగని మొక్కలా ఉండిపోతాను.'అంటూ విసురుగా బయటికి నడిచాడు.
'చందూ' ఆ మాటకి రుక్మిణి మ్రాన్పడిపోయింది.
***
'ఎక్కడికి వెళ్ళుతున్నావురా ?'క్రిష్ణారావు ప్రశ్నకి తండ్రి కళ్ళలోకి చందూ చురుగ్గా చూసాడు.
'ఎందుకు నాన్నా, ఇంట్లోంచి ఇలా అడుగు బయట పెట్టగానే ప్రతీ విషయాన్ని అలా గుచ్చి గుచ్చి అడుగు తుంటావు?' విసుగ్గా అన్నాడు.'ఏంట్రా అడిగితే తప్పా, అసలు ఇపుడు టైమ్ ఎంత అయ్యిందో తేలుస్తోందా నీకు?'కొడుకు వైఖరికి ఎగిసి వస్తున్న కోపాన్ని అదుముకుంటూ అన్నాడు.'రాత్రి పదవుతుంది? అంతేగా?' అన్నాడు.
'అంతేనా?'క్రిష్ణారావు భగ్గుమన్నట్టుగా చూస్తూ అన్నాడు.
'అబ్బా, అన్నింటికి ఆరాలేనా? అయినా ఒక్కసారి బయటికి వచ్చి చూడండి నాన్నా? సిటీ అంతా మేలు కునేది ఇప్పుడే' అన్నాడు చందు.
'ఏంటి ఆరాలా, ఎదిగిన కొడుకు రాత్రి పది గంటల తర్వాత ఇంట్లోంచి బయటికి వెళ్తుంటే 'ఎందుకు వెళ్తున్నావు?' అని తండ్రి అడగడం అది ఆరానా, అది నేరమా, బావుందిరా చాలా బావుంది' మండిపడుతూ అన్నాడు.
చందూకి చిరాకు తన్నుకొచ్చింది.'అబ్బబ్బ, ప్రతీ చిన్న విషయానికి ఉపన్యాసాలు వినలేక చస్తున్నాను నాన్నా.ప్రొద్దున్న ఆలస్యంగా నిద్ర లేస్తే ఇప్పుడా నిద్ర లేచేది అంటావు.రాత్రి వేళ ఇంటికి కాస్త లేటుగా వస్తే ఏంటీ ఈ టైమ్‌కి ఇంటికి వచ్చావు ఇదేమన్నా హోటలా ఇష్టం వచినట్టు వచ్చిపోవడానికి అంటావు. మధ్యాహ్నం కాసేపు ఎప్పుడైనా పడుకొని రెస్ట్ తీసుకొంటుంటే, చదువు ఎలాగు లేదు ఇంటి విషయాలైనా నీకు ఏమీ పట్టవా శుభ్రంగా తిని పడుకొంటున్నావు అంటావు? ఎందుకు నాన్నా? ప్రతీ చిన్న విషయానికి ఇలా రోజూ నన్ను వేధించుకు తింటున్నావు?'
'ఏమిటి? నేను నిన్ను వేధిస్తున్నానా? రుక్మిణి, వింటున్నావా, నీ ముద్దుల కొడుకు మాటలు?' కిష్ణారావు భార్య వంక చూస్తూ అన్నాడు.
'అబ్బబ్బ మీ తండ్రి కొడుకుకు రోజూ ఉండే గొడవ ఇదీ కానీ.చందూ ఎందుకురా, నాన్నని ఎదిరించి అలా మాట్లాడతావు? ముందు నువ్వు ఏమి మాట్లాడకుండా లోపలికి వెళ్ళు.'రుక్మిణి కొడుకును బతిమాలుతున్నట్లుగా అంది.
'అమ్మా నేను ఇపుడు వెళ్ళాల్సింది, బయటికి? మా ఫ్రెండ్ పుట్టినరోజు పార్టీకి.నేను వెళ్తున్నాను'అనేసి చందూ చరా చరా నడుచుకొంటూ బయటికి వెళ్ళిపోయాడు.క్రిష్ణారావు, రుక్మిణి కొడుకు వెళ్ళిన వంకే చూస్తూ స్థాణువుల్లా నిలబడిపోయారు.
**
ఏరా,అమ్మని ఇరవై వేలు కావాలని అడిగావట ఎందుకు?'క్రిష్ణారావు కొడుకుని అడిగాడు.చందూ దగ్గర్నుంచి సమాధానం లేదు.
'ఏరా నిన్నే అడుగుతున్నది, దేనికిరా అంత డబ్బు నీకు?'
'మా ఫ్రెండ్ కిస్తానని మాట ఇచ్చాను.'ముఖం తిప్పుకుంటూ అన్నాడు చందు.'ఏవర్రా ఆ ఫ్రెండ్''నాన్న, ఆ వివరాలు అడగకండి.వాడు అవసరాల్లో ఉన్నాడు.మీరు ఇవ్వగలిగితే ఇవ్వండి.లేకపోతే లేదు.అది కూడా అప్పుగానే ఇవ్వండి.త్వరలోనే తీరుస్తాను' చిరాగ్గా అన్నాడు.
'అప్పా, ఏం పెట్టి తీరుస్తావురా' క్రిష్ణారావు కోపాన్ని దిగిమించుకుంటూ అన్నాడు.
'నాన్నా'తల తిప్పి తండ్రి వంక ఉక్రోషంగా చూసాడు.
'అవును, నీకే సరైన ఠికానా లేదు అంత అప్పు ఎలా తీరుస్తావు.అసలు ఇరవై వేలు ఇంకొకళ్ళకి అప్పుగా ఇచ్చేంత స్థోమత మనకుందా.ఆ విధంగా కనుక నువ్వు ఆలోచిస్తే ఇలా డబ్బు ఇవ్వమని నన్ను అడగలేవు?'
'నాన్న ఇక ఆపు.ఇస్తే ఇవ్వు లేకపోతే లేదు' విసురుగా అన్నాడు.
'చందూ ఎందుకురా, నాన్నని ఎదిరించి మాట్లాడతావు?' రుక్మిణి కఠినంగా అంది.
'అయినా నీకీ ఆలోచనన్ని, ఆ ఆనంద్ వల్లే వస్తున్నాయి.అసలు వాడేగా నిన్ను పాడు చేస్తూ, నీ బుద్ధిని పెడత్రోవపట్టిస్తోంది?
'నాన్నా, నన్నేమన్నా అను , మధ్యలో వాడి గొడవెందుకు? నా ఫ్రెండ్స్ గురించి ఏవన్నా అంటే ఊరుకునేదీ లేదు' 'ఎందుకో అంత ఉక్రోషం? మరి ఇపుడు ఇరవైవేలు అడిగింది,వాడి వీసా ఫీజు కట్టడం కోసమేగా?'
తండ్రి వంక ఆశ్చర్యంగా చూస్తూ
'నాన్నా !నీకు ఎవరు చెప్పారు' అన్నాడు.
'ఏరా,షాక్ తిన్నావా? నాకెలా తెలిసిందో అని ఆశ్చర్యంగా ఉందా? నిన్ను గుండె మీద పెట్టుకొని పెంచు కున్నానురా? నువ్వు చిన్నప్పుడు వేసే ప్రతీ అడుగు నా గుండెకు మెత్తగా తగ్తులుతూంటే ఎంతో ఆనందంగా ఉండేది? కానీ అదే ఇప్పుడు నువ్వు వేసే ప్రతీ అడుగు నా గుండెను భగ భగ మండిoచేస్తోంది'
'నాన్నా !అంత కాని పని నేనేం చేయడం లేదు?'అసహనంగా అన్నాడు
'ఎందుకు చేయడం లేదు, నువ్వు చేస్తున్నావు చందూ? నీ ఇంజినీరింగు చదువు పూర్తయి ఏడాది దాటుతోంది? ఎంటెక్ చేయమంటే చేయవు? ఫారిన్ వెళ్తావా అంటే వెళ్ళవు.నీ గురించి నువ్వేం ఆలోచించడం లేదు.ఇలా ఎంతకాలం అని ఖాళీగా కూర్చుంటావు, చెప్పు?'
'అంటే నేను ఖాళీగా కూర్చొని తింటున్నాననా...ఎందుకు పనికి రానివాడిలా కనిపిస్తున్నానా నాన్న?' కష్టంగా అన్నాడు.
'నీ భవిష్యత్తు గురించి ఏం ఆలోచిస్తున్నావు ఫ్రెండ్స్ వీసా కోసం ఇరవై వేలు అప్పుకి సిద్దం అయి తిరుగుతున్నావు. స్నేహితులతో తిరగడం వల్ల ఏం ఒరుగుతుందో నీకు తెలుస్తోందా? నీ ఫ్రెండ్స్ అందరు మంచి ఉద్యోగాల్లో చేరిపోతున్నారు.కాని నువ్వింకా యే ప్రయత్నాలు చేయక ఇలాగే ఉండిపోతున్నావు.అసలు నువ్వు అందరికన్నా వెనుకబడిపోతున్నాను అన్న విషయం ఏదన్నా నీకు తడుతుందా' కృష్ణరావు కంఠంలో ఆవేదన ధ్వనించింది.
చందూలో ఆవేశం తన్నుకు వచ్చింది.
'నాన్నా ! నా కర్ధమైంది, ఇంట్లో నేను నీకు చాలా అడ్డుగా కనపడు తున్నాను.సరే, నా సంగతి ఇక వదిలేయి.నీకిక కంటికి కనపడను.నేను అన్నయ్య వాళ్ళింటికి వెళ్ళిపోయి అక్కడే ఉంటాను, ఇంకెప్పటికి ఇంటికి రాను'
'అబ్బా చందూ? అవేం మాటలు రా?'రుక్మిణి అంటోంది కాని అతను ఇక ఏమి వినదలుచుకోలేదు.అతని మనస్సు అవమానంతో ఉడికిపోతోంది.వెంటనే అన్నగారింటికి రైలెక్కేసాడు.
'రుక్మిణి, వాడు మాట్లాడే పద్ధతి చూసావా? అలిగి ఎలా వెళ్ళి పోయాడో.వాడికి ఎంత సేపు ఫ్రెండ్స్. తిరుగుళ్ళు?ఉద్యోగం గురించి యే ఆలోచన లేదు.'
భర్త మాటలకి,
'ఏవండీ? కొన్నాళ్ళు పాటు వాడ్ని అలాగే వదిలేయ్యండి.జీవితపు విలువ, తల్లి దండ్రుకివ్వాల్సిన గౌరవం గురించి వాడికి తెలియడం లేదు.ఎంత కష్టపడితే రూపాయి పుడుతుందో కూడా వాడికి తెలియదు?వాడి ఉడుకు రక్తం ఆకాశాన్ని చూపిస్తోంది కాని నేలని చూడనివ్వడం లేదు?' రుక్మిణి కన్నీళ్ళతో అంది.
'వాడి భవిష్యత్తు గురించి కించిత్తైనా ఆలోచనే లేదు? అదే నా బాధ' క్రిష్ణారావు అన్నాడు.'మీరు దిగులు పడకండి.కాలమే అన్నింటికి పరిష్కారం? జీవితంలో స్థిరపడటం ఎంత ముఖ్యమో, బంధాల్ని ఎంత అపురూపంగా నిలుపుకోవాలో ఎప్పటికయినా వాడికే తెలిసి వస్తుంది.' రుక్మిణి కళ్ళు తుడుచుకొంటూ భర్త భుజం మీద తలవాల్సింది.
తండ్రితో గొడవ ముగిసింది ఇక అన్నయ్యతో,వదినతో వాళ్ళింట్లో కొన్నాళ్ళు హాయిగా ఉండవచ్చు అని చందు అనుకున్నాడు.
కాని ఓ రోజు....................
'ఏవండీ.మీ తమ్ముడు మన ఇంటికి వచ్చి ఆరునెలలు దాటుతోంది' పేపర్ చదువుతున్న రామక్రిష్ణ భార్య అరుంధతి మాటకి తల తిప్పి ఆమె వంక చూసాడు.
'పొద్దున్నేవెళ్తాడు.ఎక్కడెక్కడో తిరిగి ఏ రాత్రికో వస్తాడు.ఏదీ సర్దుకోడు, ఆఖరికి పక్క బట్టలు కూడా తీయడు.మాసిపోయిన చొక్కాలు, పాoట్లు అన్ని గదిలో కుప్పగా పోసి ఉన్నాయి.వాషింగ్ మెషీన్ లో ఉతకడానికి వేయడానికి కూడా చందుకు బద్దకమే?అతని ధోరణి నాకేం మింగుడు పడటం లేదు.' ఫిర్యాదుగా అంది.
'వాడికింకా చిన్నతనం పోలేదు.' అంటూ నవ్వాడు రామక్రిష్ణ.
'చిన్నతనం కాదు. చేతకానితనం. దానికి మీ అమ్మగారి అతి గారం,మీ నాన్నగారి అతి క్రమశిక్షణ ,మీ వత్తాసు కారణం.అవే అతనిని పూర్తిగా పాడు చేశాయి'
ఆ మాటలు వింటూ చందు కోపంగా లోపలికి వస్తూ
'ఏంటి వదినా,నేను అన్ని వింటున్నాను, ఏంటీ, అన్నయ్యకి నా మీద అన్ని నేరాలు చెబుతున్నావు? అయినా వాటి సంగతి పక్కకి పెట్టు.అసలు నువ్వెవరు మా అమ్మని, నాన్నని నా పెంపకం గురించి, అనడానికి?ఈ విషయంలో నీకు ఒక ఇంచి అర్హత కూడా లేదు.' అన్నాడు.
ఆ మాటలకి ఆమె కొద్దిగా కంగారుపడి, ఆ వెంటనే సర్దుకొని,'చందూ, నువ్వింకా చిన్నపిల్లాడివి ఏమి కాదు. ముందు నిన్ను నువ్వు సరిదిద్దుకుంటేబావుంటుంది.
బుద్దిని మంచి దారిలోకి మళ్ళించుకుని, ఉద్యోగంలో చక్కగా స్థిరపడి,మీ నాన్నగారి కలల్ని నిజం చేసి చూపించు.ఎవరి అర్హతల గురించైనా అప్పుడు మాట్లాడితే బావుంటుంది.' వెటకారంగా అంది.
'అరుంధతీ !వదిలేసెయి.విషయాన్ని ఇక లాగకు' రామక్రిష్ణ భార్యని వారిస్తూ అన్నాడు.
'ఒరేయి చందూ, నువ్వు కూడా వదిన నిన్ను ఎందుకు అలా విమర్శిస్తోందో అన్నది ఒక్కసారి ఆలోచించు. నిన్ను నువ్వు ఆత్మవిమర్శ చేసుకో.చిన్న ఉద్యోగం చేస్తున్నా పైసా పైసా కూడపెట్టుకుంటూ నాన్న ఎంతో కష్టపడి మనకు అన్ని సౌకర్యాలు సమకూర్చి,మంచి చదువులు చదివించారు.మనిద్దరి భవిష్యత్తు గురించి నాన్న చాలా కలలు కన్నారు.ఆ కలల్ని నిజం చేసి ఇపుడు మనం ఈ వయస్సులో వాళ్ళని సుఖ పెట్టాల్సిన అవసరం మనకి ఉంది.ఎంతసేపు తిరుగుళ్ళు ఏంటీ? అయినా అమ్మకి కూడా ఈ మధ్య ఒంట్లో బావుండటం లేదు? అసలు నీకు ఇంటి విషయాలు ఏమన్నా పడుతున్నాయా?' అన్నాడు.
ఎప్పుడు పల్లెత్తు మాట అనని అన్నగారు అలా గట్టిగా కసిరేటప్పటికి ఖంగు తిన్నాడు .కాని ఆలోచలన్ని అన్నింటి కన్నా ముందు అమ్మ 'అనారోగ్యం' అన్న మాట దగ్గర ఆగిపోయాయి.
అన్నయ్యా.అమ్మకేమయ్యింది?'
కంగారుగా అన్నాడు.
ఆరునెలల బట్టి పంతంతో అతను తండ్రితోనే కాదు తల్లితోను మాట్లాడలేదు.
'కొద్దిగా ఆయాసంగా ఉంటోందట.నాన్న ఫోన్ చేసారు.అమ్మకి పరీక్షలన్నీ చేయిస్తున్నారు.ఈ మార్చి నెలాఖరుకు బ్యాంక్ ఆడిట్ పనులు అవగానే సెలవు పెట్టి నాలుగు రోజులలో నేను ఇంటికి బయలు దేరుదామనుకొంటున్నాను' రామకృష్ణ అన్నాడు.
ఆ క్షణం తరువాత ...................
నేనింకేం ఆలోచించలేదు.'అమ్మ'కోసం నా హృదయం పలవరిస్తోంది.లోపలికి వెళ్ళి నా బట్టలన్నీ గబా గబా బ్యాగ్‌లో కూరుకొని,
'అన్నయ్యా, నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను.వదినా, నిన్ను ఇబ్బంది పెట్టాను.వెరీ వెరీ సారీ'దు:ఖంతో అనేసి ఆఖరు రైలు అందుకోవడం కోసం స్టేషన్‌కు పరిగెత్తాను.నా గుండెల్లో ఏదో ఆరాటం, నా ప్రవర్తనతో అందరిని బాధ పెట్టానన్న వేదన నన్ను కుదిపేస్తోంది.నా మనసులో అమ్మ అనారోగ్యం పెనుతుఫాను సృష్టిస్తోంది.తెల్లారి నేను ఇంటికి చెరగానే అమ్మ కళ్ళలో ఆకాశమంత వెలుగు.నాన్న గుండెల్లో సముద్రమంత ఆనందం.పైకి మటుకు చిన్న చిరునవ్వు.
'ఒక్క కుదుపు జీవితాన్ని మార్చేస్తుంది.మలుపు తిప్పేస్తుంది' అన్నట్టు అమ్మా, నాన్న, అన్నయ్య, వదిన ఇంతమందిని బాధపెడుతూ నేనేం సాధిస్తున్నట్టు అన్న అంతర్మధన తొలిసారిగా నాలో మొదలైంది. అప్పుడు చుట్టూ చూస్తే కాలేజి చదువు వరకు తోడునీడగా ప్రాణంగా మసలిన స్నేహితులందరూ ఉద్యోగాలకో, పై చదువులకో తలో చోటికి వెళ్ళిపోయారు.నా స్నేహితులందరికీ వాళ్ళ భవిష్యత్తు పట్ల స్పష్టత ఉందని, జీవితం పట్ల అవగాహన ఉందని, లక్ష్యాలు నిర్దేశించుకుని వాళ్ళ గమ్యం చేరుకున్నారని నాకు అప్పుడే తెలిసొచ్చింది.
అంతే, ఆ రోజు తరువాత నేనెప్పుడు ఒక్కసారి కూడా అమ్మని,నాన్నను మళ్ళీ ఎప్పుడు దేనికి బాధ పెట్టలేదు.మంచి కంపెనీలో ఉద్యోగం, హోదా, ఆ వెంటనే రమణితో పెళ్ళి, పిల్లలు తో నా జీవితం అంతా ఒక్కసారిగా వెలుగులమయంగా మారిపోయింది.బాధ్యత గల మనిషిగా నేను మరో ప్రపంచంలోకి అడుగుపెట్టాను.నా విద్యార్థి జీవితంలోని అప్పటి ఆవేశం, కోపం స్నేహితుల కోసం ఇంట్లో చేసిన పోరాటాలు,ఉడుకు రక్తంలో నాన్నకు చెప్పిన ఎదురు సమాధానాలు,అమ్మ కన్నీళ్ళు ఇవన్నీ ఎప్పుడైనా వెనుతిరిగి చూసుకుంటే నా ప్రవర్తనకి నాకే సిగ్గనిపిస్తుంది.
యవ్వనపు మాయలో కొంత మంది విద్యార్ధి జీవితాలు ఇలాగే గడిచిపోయి ఉంటాయేమో అని కూడా అనిపిస్తోంది.తెలిసి తెలియని వయస్సు, ఉద్రేకంతో కూడిన భావాలు,వివేకం జతకూడని ఆలోచనలు ఇవన్నీ తల్లిదండ్రుల్ని ఎంత బాధ పెడతాయో అన్నది నేను తండ్రినయ్యాక కాని నాకు అనుభవంలోకి రాలేదు.
***
'ఏంటీ? రాత్రి ఏడవుతోంది.పింకీ స్కూల్ నుంచి ఇంకా రాకపోవడం ఏంటి ?'ఆఫీస్ నుంచి వస్తూనే రమణి మీద గట్టిగా అరిచేసాను.
'ఇంటికి తీసుకురావడానికి అని సాయంత్రం ఆటో వాడు వెళ్ళినా అది స్కూల్‌లో లేదుట.వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళిందంట.ఇందాకే ఫోన్ చేసి బయలుదేరుతున్నానని చెప్పింది.' రమణి అంది.
'ఎందుకని వెళ్ళింది ? ఫ్రెండ్స్ తో అక్కడేం పని? అసలే చీకటి పడుతుంది కదా.అయినా రోజులెలా ఉన్నాయి?'వెంటవెంటనే కోపంగా అన్నాను.'కంగారు పడకండి.వచ్చాకా అడుగుదాం.సరేనా.అదిగో, అది మాటల్లోనే లోపలికి వస్తోంది'అంది రమణి 'పింకీ ఏంటీ వేషాలు? చీకటి పడే వేళ వరకు ఏంటీ తిరుగుళ్ళు?' కోపంగా అడిగాను.
'డాడీ, నేను నికిత సైన్సు ప్రొజెక్ట్ వర్క్ కలిసి చేస్తున్నాం.అమ్మకి చెప్పాను కదా' పింకీ తల్లి వంక చూస్తూ అంది.
'నువ్వు ఒక్కదానివి వెళ్ళి రావడం నాకు నచ్చలేదు.రాత్రి వేళకు ఇంటికి ఆలస్యంగా చేరడం అన్నది అంత కన్నా నచ్చలేదు?'ఆవేశంగా అన్నాను.
'డాడీ, ఏమైందిప్పుడు? ఎందుకంత కోపం తెచ్చుకుంటున్నారు' నా వంక చూస్తూ ఆశ్యర్యంగా అంది. 'ఇంకేమి మాట్లాడకు.డోంట్ రిపీట్ నెస్ట్ టైం, లోపలికి వెళ్ళి ఫ్రెష్ అవ్వు'గంభీరంగా అన్నాను.
'ఏంటి మమ్మీ? ఇంత చిన్న విషయానికి డాడిఎందుకంత గట్టిగా అరుస్తున్నారు.కాస్త ఆలస్యమైతే ఎందుకంత భయపడుతున్నారు అయినా నాకు తెలియదా.నేనేమన్నా ఇంకా చిన్నపిల్లని అని అను కుంటున్నారా.టెన్త్ క్లాస్‌కి వచ్చాను' చికాకుగా అంటోంది పింకీ, రమణితో కలిసి లోపలికి వెళ్తూ.
నాకెందుకో హఠాత్తుగా నాన్న గుర్తుకు వచ్చాడు.నాన్నకి, నాకు నా విద్యార్ధి జీవితంలో తరచు జరిగే సంఘర్షణల జ్ఞాపకాలు కళ్ల ముందుకు వచ్చాయి.
***
విమానం నేల మీద వాలింది.నేను గతం నుంచి ఇవతలికి వచ్చాను.ఫ్లయిట్ దిగగానే ముందు గుండె దడ దడలాడుతుండగా నాన్నను చేర్చిన ఆసుపత్రికి పరుగెత్తాను.ఐ సి యు లో మంచం మీద ఉన్న నాన్నని పట్టుకుని గట్టిగా ఏడ్చేసాను.పెరిగిన గెడ్డంతో నాన్న బలహీనంగా కనిపిస్తున్నాడు.
'ఎందుకురా చందూ? అంత బెంగపడుతున్నావు? నాకేం కాదురా,అయినా నేను మునిమనవడ్ని ఎత్తుకొని కానీ పైకి వెళ్ళను.
అయినా అమ్మ కూడా మిమ్మల్ని వదిలేసి, నేను మిమ్మల్ని వదిలేస్తే ఎలా? మీరిద్దరు ఒంటరివాళ్ళయిపోరు.' ఆప్యాయంగా నా తల నిమురుతూ నాన్న ఆర్ద్రంగా అన్నాడు.
కళ్ళలో నీళ్ళు తుడుచుకుంటూ, నాన్న పక్కన మౌనంగా అలాగే కూర్చుండిపోయాను.మైల్డ్ ఎటాక్ వచ్చింది ,భయం లేదని డాక్టరు చెప్పింది విన్నాక,అప్పటికి నా ప్రాణాలు కాస్త కుదుట పడ్డాయి.అయినా పదిహేను రోజులు పైనే నాన్నని అంటిపెట్టుకొని అన్నయ్య వాళ్ళింట్లోనే ఉండిపోయాను.
నాన్న కాస్త కోలుకున్నాక నేను బయలుదేరుతుంటే ,
'రేయ్ చందూ, ప్రతీ చిన్నదానికి ఊరికే కంగారుపడిపోయి విమానాల టికెట్లకు డబ్బులన్ని తగలెసి కుటుంబ సమేతంగా బయుదేరి రామాకు.నాకేం కాదు.నా ఆరోగ్యానికేం ఢోకా లేదు.నా జాతకం ప్రకారం నాకింకా పదేళ్ళు ఆయుష్షు ఉంది'నాన్న నన్నే చిన్నపిల్లాడ్ని చేసి గదమాయింపుగా మాట్లాడుతూ ఉంటే చిరునవ్వు,కన్నీళ్ళు సమంగా వచ్చాయి నాకు.
ఏరా అర్థమైందా, నేను బాగానే ఉన్నాను.డబ్బుని పొదుపుగా వాడు.ఊరికే తగలేసుకోకు.అసలే ఆడపిల్లా, చదువు ఒక్కటే చెప్పిస్తే సరి కాదు.దాని కోసం ఎంత దాస్తే, ఈ రోజుల్లో ఆడపిల్లని గడప దాటించగలo చెప్పు?ఏంటి,అసలు నేను చెప్పేది వింటున్నావా చందూ?'
'అలాగేలే నాన్నా !వెళ్లొస్తాను'ప్రేమగా నాన్నని గట్టిగా కౌగిలించుకుంటూ అన్నాను.
'అసలు ఏం చెబుతున్నానో, నీకు అర్ధమవుతోందా' నాన్న హుంకరిస్తున్న మాటల వెనక లాలిత్యాన్ని నేను ఎంతో ఆనందంగా ఆస్వాదిస్తున్నాను.
ఎన్ని జన్మలెత్తిన్నా అంత ప్రేమించే తండ్రిని మళ్ళీ పొందలేనని నాకు అనుభవం మీద జీవితం గట్టి
పాఠాన్ని నేర్పింది.
తడిసిన కళ్ళలో, నాన్నకి నమస్కారం చేసి బయటికి నడిచాను.
నాన్న తల తప్పుకుంటూ కన్నీళ్ళు దిగిమింగుకుంటూ వెళుతున్న నా వంకే చూస్తున్నాడన్న విషయం నాకు తెలుస్తూనే ఉంది. నాన్న చూపు నా వీపును తడుముతున్నా, నేను వెనక్కి తిరిగి నాన్ననిచూడలేను,
ఓదార్చలేను.ఎందుకంటే నలభై ఏళ్ళు దాటిన నేను, నాన్న దృష్టిలో ఇంకా ఇవాల్టికీ , ఎప్పటికీ పసివాడ్నే.
ఆయన చేతి కింద ఎదగని మొక్కలాగ ఒదిగిపోయి ఉండిపోవడంలో ఉన్న మహదానందాన్ని నేను ఎప్పటికీ కోల్పోవదలుచుకోలేదు.