ఆనాడే అసలైన పండగ - మందరపు హైమవతి
ఆనాడు ఒక్కడే నరకాసురుడు
ఈనాడు అడుగడుగునా
నవీన నరరూప నరకులు
ఇంద్రధనుస్సుల అందగత్తెల సొగసులకే
ఆనాటి కాముకుల గుండెల్లో
కోరికలగుర్రాలు పరిగెత్తేవి
ఈనాడు
కాంక్షలమృగం కొమ్ములతో
పొడవడానికి
తారుణ్యసంపదలే అక్కరలేదు
బాల్యం చిన్నెలు చెరిగిపోని
పసిపాపలైనా
ముడతల సంతకాల
ముసలి అవ్వ లైనా
పర్వాలేదు
ఆడ మాంసం అయితే చాలు
ఎగిసిపడే వాంఛల జ్వాలలు
చల్లారి పోతాయి
తుళ్ళిపడే నరాలనాట్యాలు
ఉపశమిస్తాయి
ఏమిటో అంతా బాగున్నట్లే ఉంటుంది
పండగ ముందు నుంచే
చెవుల తుప్పు వదిలించే
బాణాసంచా లమోతలతో
కళకళలాడే. బట్టల కొట్లు
నగల దుకాణాల ప్రాంగణాలతో
సందడి సందడి గానేఉంటుంది
తారాజువ్వలా నింగిలోకి
దూసుకుపోయే
నిత్యజీవిత అవసర వస్తువుల ధరలు
అభివృద్ధిని అంకెల్లో
చూపే పాలకులు
తెల్లారితే చాలు
పనుల కోసం రహదారుల
కూడళ్ళలో
నిలబడ్డ నిరుపేదల దృశ్యాలు
కలవర పెడుతుంటే
ఏమిటో అంతా అదోలా
ఉంటుంది
పిల్లలు పెద్దలు
అందరూ కల కల నవ్వే రోజు రావాలి
ఆనాడే అసలైన పండుగ