తేల్చుకోవాల్సిన క్షణమిది.! (కవిత)
పైశాచికత్వం
మృత్యు ఘంటికలు మ్రోగిస్తూ
వికటాట్టహాసం చేస్తుంటే..
మానప్రాణాల్ని సామూహికంగా సమాధిచేస్తుంటే
ఎక్కడ ఎవడికి
ఉన్మాదపు పొరలు కమ్మేసినా
ఏ స్వార్ధ ప్రయోజన అజెండా కు తెరతీయాలన్నా
మొదటి కత్తివేటు
ఆమెను గాయం చేయాల్సిందేనా!?
ఆమె మానాన్ని వీలైనంతగా చిదిమేయాల్సిందేనా!
ఆమెలోకి తొంగిచూడకుండా దేశం నడిబొడ్డున నిలపకుండా
పబ్బం గడుపుకున్న
సందర్భాలు ఏవీ..?!
అస్తవ్యస్తపు నిర్ణయాలు
స్వార్ధశక్తుల స్వప్రయోజనాలు..
నెపాన్ని ఎవరి మెడకోచుట్టేసి..
మతాల ముసుగు తగిలించి..
కల్లోలాల నెగళ్లను ఎగదోసేసి చోద్యంచూసే దుష్టశక్తుల
అసలు రూపాలు
చరిత దృష్టిని దాటిపోలేవన్న
సత్యాన్ని విస్మరిస్తే
భవిత నిన్ను క్షమించదని తెలుసుకో..
చూపుడువేలు కొనలపై
రేపటి నవ్య చరిత
నిలబడబోతోంది..
వివేచనా నేత్రాన్ని విప్పిచూడు
విచక్షణా తెరల్ని తొలగించి చూడు
భారతావని పైటకొంగును తొలగించి చోద్యం చూసే కళ్ళను పీకేసి
జన్మ స్థానాన్ని మకిలిచేసిన కీచకులపై
రాబందుల రెక్కల డప్పులు
మ్రోగించే రోజు
ఆట్టే దూరం లేదని తెలుసుకో..
నీజాతిని నిర్వీర్యం చేస్తోన్న
కుహనా వ్యవస్థల్ని
కూకటివేళ్ళతో పెకళించు..
అప్రమత్తుడవై నిర్ణయం తీసుకునే ఘడియ సమీపిస్తోంది..
ఎడతెగని అకృత్యాల దారిలో
నీ పయనమెటు సాగాలో
తేల్చుకోవాల్సిన
అత్యవసర క్షణమిది..
అందుకుంటావో
అగాధంలో పడిపోతావో
నీ చూపుడువేలు కొనలోనే ఉంది
రేపటి భవితంతా..
-అమృతవల్లి. ఎ