ఒక్కో కన్నీటిచుక్క (కవిత)
జీవం నిలిపే పచ్చని సంతకాల్ని కాలదన్నేసి
వడ్లగింజెకు విషరసాయనాల
పూతలు పూసి
పేగుల గోడలను పాషాణంతో నింపేయడం చూసి
రేపటి భవిత గొంతులో
నిండబోయే గరళంచూసి ...
అవనికి బాసటగా ఉంటానన్న
తన మాట పొల్లుపోతోందని
నేలమ్మ రెప్పల చూరునుండి
జారుతోంది
ఒక్కో కన్నీటి చుక్క
ఆశల రెక్కలు కట్టి ఎగరేసిన పిట్టలు
మళ్లీ ఇటువాలటం మరిచిపోతే
పుల్లా పుడకా పేర్చి కట్టిన
గూడు చెదిరిపోతే
అనుబంధాలచివుళ్ళతో అలరారిన కుటుంబ వృక్షం నేడు
డాలర్ల చెదలు సోకి
గుండె తడిని ఆవిరిచేస్తోంటే
రాలిపోతున్న
పండుటాకు రెప్పల చూరునుండి జారుతోంది
ఒక్కో కన్నీటి చుక్క..
ఉగ్గుపాలతోబాంధవ్యాల్ని
రంగరించిపోసిన చేతులు
మనంతో మమేకమైన
మానవ సమూహాలు
వావి వరుసలు వదిలి
పొత్తిళ్లలో పసికందులపై అకృత్యాలపంజా విసిరి
అమ్మ తనాన్ని వక్రబుద్ధితో తడుముతూంటే
నీ ఉనికికి
తాను చేసుకున్న ఒప్పందాన్ని
రద్దుచేసుకోలేని ఆమె అసహాయత రెప్పల చూరునుండి జారుతోంది
ఒక్కో కన్నీటి చుక్క..
ఉజ్వల చరితకు పుట్టినిల్లై
మహోజ్వల వీరమాతగా
పేరెన్నిక గన్నదై
సంస్కృతి సంప్రదాయాలకు
పురిటి గడ్డయి
విశ్వవీణ పై వేల యశస్సుల
గమకాలు పలికిన దేశమాత..
తన బిడ్డలు అసమానతల
అవినీతి అనాగరిక పీలికల్ని చుట్టుకుని అవమానిస్తుంటే
చెదురుతున్న సచ్చీలత కొంగును సవరించలేక అల్లాడుతూ
రెప్పల చూరునుండి జారుతోంది
ఒక్కో కన్నీటి చుక్క..
-అమృతవల్లి అవధానం.