నీడలు మొలిచే చోట
వెలుగునీడల సయ్యాటల జీవనయానంలో
నివసించ గూడు లేని జీవులకు
నీడై నిలుస్తూ....
నీడలేని ఆడవారికి
అభయహాస్తానివై నడుస్తూ....
నీడను చీకటిలా భ్రమించి, భయపడుతూ జీవిస్తున్న వారికి
ధైర్యాన్ని నూరిపోస్తూ...
యాజమాన్యపు క్రీనీడలో
చిక్కిశల్యమై పోతున్న కార్మికులలో చైతన్యాన్ని రగిలిస్తూ....l
మోసపూరిత వాగ్దానాల
వరదలో చిక్కి
ఉక్కిరి బిక్కిరౌతున్న ఓటర్లకు
ఓటు విలువను ప్రభోదిస్తూ....
స్వార్ధపు నీడలో నిత్యం బ్రతుకుతూ, మానవతా విలువలను
మట్టుబెడ్తున్న స్వార్ధపరులకు
నిస్వార్ధపు నీడలో పొందే
ఆత్మ సంతృప్తిని తట్టిలేపుతూ...
పరహితాన్ని ఆశిస్తూ,
ప్రజాసేవలో పరితపించే
మహనీయుల నీడలే
నేటి యువతకు
ఆచరణియాలుగా చేస్తూ....
ప్రగతిపథ పయనపు నీడలో
హరిత వనాలను పెంచి పోషించేలా జనజాగ్రతికి కృషి చేస్తూ...
వృక్షో రక్షతి రక్షిత : అనే నిత్య సత్య నీడలో విరామమెరుగక యువతను మున్ముందుకు నడిపిస్తూ...
కులమతాల కంచెల
నీడలను దాటుకుంటూ
ఆర్ధిక అసమానతలను అధిగమిస్తూ...
సమ సమాజ నిర్మాణ దిశగా
నీడలు మొలిచే చోట
ముందడుగు వేయాలి
మానవులందరూ
ముందడుగు వేయాలి
-ఆళ్ల నాగేశ్వరరావు
(తెనాలి)