అలంకారం (కవిత)
ముఖాన నవ్వు అనే అలంకారం లేకుంటే సదా
ఎన్ని అలంకారాలున్నా వృధాయే కదా
ముఖానికి చిరునామా చిరునవ్వు కదా
హృదయగతమైన నవ్వు మణిమకుటమే కదా
బాహ్య అలంకరణ ఎంతున్నా సదా
అంతర్గత అలంకారం మిన్న కదా
అందమైన ముఖానికి అహం అడ్డు కదా
చిరునవ్వుల చిత్రానికి చిహ్నం చిన్మయమే కదా.
రెండుచేతులచప్పట్లు కయ్యానికి నెయ్యానికి సమఉజ్జికదా
రెండుముఖాల నవ్వులు పరిచయపు పునాది కదా
యవ్వన పూదోటలో రాగరక్తిమ మధురము కదా
మలిసంజెలో వలపుతలపులు వృధాయే కదా
ఎన్ని చేతులసంపాదించినానీకున్నది రెండుచేతులే కదా
ఎన్నినివాసములుఎన్నిఅవాసములుఉన్నాపట్టుకపోవుకదా
ఆలుబిడ్డలు అన్నదమ్ములు నీదు బంధమే కదా
అంతరాత్మను విడిచినీవు ఆవలకి పోలేవు కదా
పంచభక్ష్యం పసిడితొడుగులుఆడంబరాలే కదా
నిద్రపట్టని రాత్రులెన్నో నిగ్గుతేలని నిజాలే కదా
నిన్ను విడిచి ఉండలేనిది మనసు మాత్రమే కదా
భారమైన బరువుమోపిన తనువుకెక్కడా తనివిలేదు కదా
అంతులేని అమావాస్యలు చుట్టుముట్టిన కారుచీకటి కదా
కారుమబ్బులు కమ్మినపుడు కర్తవ్యమే తోచదు కదా
మనసు మనసుతో మాటలాడిన మంచిపెంచును కదా
క్షణం క్షణమూ వాడులాడుతు ద్వేషమన్నది వృధాయే కదా
కాలయవనిక మీద నవ్వులు కరిగిపోతవి కదా
చెరిగిపోని జ్ఞాపకాలు నవ్వుతుంటవి కదా
ముదిమి వయసున జ్ఞాపకాలే పూలహారాలు కదా
జ్ఞాపకాలే చివరివరకూ జీవితంలో లవహారాలు కదా