Telugu Global
Arts & Literature

కుర్చీ (కథ)

కుర్చీ (కథ)
X

“చూడు శంకర్ ..ముప్పై రెండు సంవత్సరాలు పూర్తయ్యాయి, ఈ కుర్చీలో కూచుని..ఇది నన్నూ,దీన్ని నేనూ జాగ్రత్తగా చూసుకుంటూ వస్తున్నాము.. ” అన్నాడు కృష్ణమూర్తి కుర్చీ చేతుల మీద తన చేతులతో సున్నితంగా స్పృశిస్తూ..

“ మూర్తి సార్, ఆఫీసు మారింది, మనుషులు మారుతున్నారు, అన్ని వస్తువులు మారుతున్నాయి.. మీరూ, మీ కుర్చీ తప్ప.. నిన్న మొన్న కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా పాత ఫర్నీచర్ మార్చమంటూ రోజూ నా వెంట పడుతున్నారు.. ఆరునెల్లకో, ఏడాదికో కొత్త ఆఫీసర్ రావడం.. రాగానే లక్షలు లక్షలు ఖర్చు పెట్టించి చాంబర్లో వున్నవి బైట పడేయమనడం, కొత్తవి పెట్టించడం, చివరికి కిటికీల కర్టెన్లతో సహా మార్పించడం..మూడేళ్ళకో సారి కొత్త మేనేజ్మెంట్ రావడం , వాళ్ళ సంగతి చెప్పేదేముంది.. నా కన్నా బాగా మీకే లెక్కలన్నీ తెల్సు.. నా పన్నెండేళ్ళ సర్వీస్ లో ఎంతమందిని చూడలేదు, అడపాదడపా ఈ పాత భవనానికి బైటి వరకు కొత్త హంగులు.. లక్షల్లో బిల్లులు, సర్లెండి..ఫర్నీచర్ స్టాక్ తీసుకోవాలి, కుర్చీ నెంబర్ పన్నెండు, టేబుల్ నంబర్ పదహారు.. అంతేగా..” అంటూ తన గోడు వెళ్లబోసుకుంటూ లెక్కలు రాసుకుంటున్నాడు జానీటర్ శంకర్..

పక్క సీట్లో వున్న జూనియర్ క్లర్క్ హేమంత్ “ సర్లే శంకర్, మూర్తి సార్ కి రిటైర్మెంట్ గిఫ్ట్ గా అవే ఇస్తే సరిపోతుంది” అంటూ పెద్దగా నవ్వాడు.

కృష్ణమూర్తి చిన్నగా నవ్వుకుంటూ కంప్యూటర్ లో మెయిల్స్ చూసుకుంటున్నాడు..’రిటైర్మెంట్ ‘ అనే మాట వినగానే ఆలోచనలు చాలా వెనక్కి వెళ్లిపోయాయి..

డిగ్రీ అయిన వెంటనే దొరికిన ప్రైవేట్ ఉద్యోగంలో చేరిపోవాల్సివచ్చింది .. పెళ్లి సంబంధాలు చూస్తామని ప్రయత్నాలు మొదలెట్టారు పెద్దవాళ్ళు..దగ్గిర బంధువుల్లో ఆడపిల్లల తల్లితండ్రులు సరేసరి.. ‘స్థిరమైన ఉద్యోగం దొరికేవరకు చేసుకోవడం కుదరదు’ అని బంధువుల్ని కాదనీ, అమ్మానాన్నల్ని ఒప్పించేసరికి వయసు మరో ఐదేళ్లు ముందుకెళ్లి పోయింది..

ఆ రోజు అనుకోకుండా వార్తా పత్రికలో ఒక మూల చిన్నగా ఫలానా సొసైటిలో జూనియర్ క్లర్క్ ఉద్యోగాలు అన్న ప్రకటన చూడడం, దరఖాస్తు చేయడం జరిగిపోయాయి.. ఆరునెలల తర్వాత రాత పరీక్ష.. మూడువేలమంది రాస్తున్నారని ఎవరో చెప్పగా విన్నాడు.. ‘యధా ప్రాప్తము’ అనుకుంటూ తనవంతు ప్రయత్నం చేయడం, మరో ఆరునెలలకి ఇంటర్వ్యూ కి పిలుపు రావడం, ఎంపిక చేసిన ఎనిమిది మందిలో తను ఒకడు కావడం ..కలా నిజమా అనుకుని తెరుకునే లోగా పెద్దలు చూసిన అమ్మాయితో కళ్యాణం.. ఇద్దరు పిల్లలు.. సంసారం..

ఉద్యోగం లో చేరిన రెండేళ్ళకి ఒక ప్రమోషన్.. కాలగమనం లో ముందుగా తల్లి, అయిదేళ్ళ క్రితం తండ్రి లోకం విడిచి వెళ్ళిపోయారు.. ఆ మధ్యలో రెండు సార్లు ప్రమోషన్లు వచ్చినా పరిస్తితుల వల్ల వదులుకోవాల్సి వచ్చింది..తన కన్నా చిన్నవాళ్లు తనకి బాస్ లు గా రావడం.. ఆఫీసు లో చిన్నా పెద్దా తేడా లేకుండా తనకి తోచిన సలహానో, సాయమో చేయడం తో అందరూ అభిమానించేవారు..

మొదటినుంచి కష్టపడి పనిచేసే మనస్తత్వం కావడం వల్ల , ఏ మేనేజ్మెంట్ మారినా కూడా ఆదరంగానే చూసేవారు..

భార్య పోస్ట్ గ్రాడ్యూయేట్ కావడంతో, పిల్లలు చదువులలోకి రాగానే, ఉద్యోగంలో చేరిపోయింది..స్వతహాగా జాగ్రత్తపరురాలు కావడంతో పెద్దగా ఇబ్బందులు పడకుండా సంసారం సజావుగానే గడిచిపోయింది. బాంక్ లోన్ తీసుకుని ఇల్లు కట్టుకోవడం, జీతం నుండే క్రమం తప్పకుండా వాయిదాలు చెల్లించడం జరిగుతున్నాయి.. పిల్లలిద్దరూ పెద్దచదువులు పూర్తి చేయబోతున్నారు.. తన పదవీ విరమణ కంటే ముందే మంచి ఉద్యోగాలలో చేరతారు.. వచ్చే డబ్బులతో ఉన్న అప్పులు తీర్చేస్తే ఊపిరి తీసుకోవచ్చు.. ఇంక సరిగ్గా ఆరునెలలు సర్వీస్ వుంది..

‘మూర్తి సార్, ఇందాకనగా టీ పెట్టాను..’ అన్న రాంబాబు కేకతో ఉలికిపడి ప్రస్తుతం లోకి వచ్చాడు కృష్ణమూర్తి. ‘వేడిగా లేకపోతే తాగరు మీరు.. ఉండండి మార్చి తెస్తాను’ అని కప్పు తీయబోతుంటే ‘ పర్వాలేదు రాంబాబు’ అంటూ గటగటా టీ తాగేశాడు ..

హటాత్తుగా ఆఫీసర్ రూమ్ లోంచి పెద్ద పెద్ద కేకలు వినిపిస్తున్నాయి.. కృష్ణమూర్తితో పాటు ఆ ఫ్లోర్లో వున్న మిగతా ఉద్యోగులు ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయారు.. నెమ్మదిగా తలవంచుకుని పక్క సెక్షన్ ఇంచార్జ్ మాధవరావు బైటికి వస్తూనే గట్టిగా అరవడం మొదలెట్టాడు ‘ అసలా టైమ్ లో నేను ఇక్కడ లేనే లేను.. బైట బ్రాంచిలో ఉన్నాను.. అప్పుడెప్పుడో వచ్చిన నోటిస్ కి, అప్పుడున్న ఇంచార్జి జవాబు ఇవ్వకుండా, అసలు సమాచారమే ఇవ్వకుండా దాచేసి, తన మానాన తను రిటైరై వెళ్లిపోయాడు.. ఇప్పుడు వెళ్ళి నేను చెప్పినందుకు నేను బాధ్యున్నిట.. చెప్పేది పూర్తిగా వినే ఓపిక కూడా లేదు..’ అంటూ ఇంకా ఏదో చెప్పబోతుంటే, పక్కనున్నవారు ఆయన్ని శాంతపరిచారు .

కృష్ణమూర్తి వెళ్ళి మాధవరావుని ఓదార్చబోయాడు, ‘మీకేంటి సార్, హాయిగా ఆరునెలలలో కుర్చీ ఖాళీ చేసి వెళ్లిపోతారు.. పైగా మేనేజ్మెంట్ కి ఫేవరెట్.. మీ జోలికి ఎవరొస్తారు? నేనింకా రెండేళ్ళు భరించాలి..ఖర్మ..’ అంటున్న మాధవరావుని ‘ధైర్యంగా ఉండాలి’ అన్నట్టు భుజం తట్టి పనుందని వెళ్లబోయాడు కృష్ణమూర్తి.

‘ఏం పని సార్.. చాలా ఆఫీసులలో రిటైర్మెంట్ కి ఏడాది,రెండేళ్ల ముందు నుంచే మన స్థాయి ఉద్యోగులు రిలాక్స్ గా ఉంటారు.. డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సీరియస్ గా తీసుకోరు.. మీరు కూడా మిగిలిన ఆరునెలలు కళ్ళు మూసుకుని గడిపేయండి.. అన్నట్టు మరో మాట.. రిటైర్ అయ్యాక కూడా మీ సేవలు వినియోగించుకోవాలని ఈ మేనేజ్మెంట్ అనుకుంటున్నారని వినికిడి.. ఊరికే కాదు లెండి.. అసలే ఈ ఏడాది కొత్త బోర్డు కోసం ఎన్నికలు, జనరల్ బాడీ మీటింగ్, మీకు తప్పదు సార్ ’ మాధవరావు చెప్పుకుంటూ పోతున్నాడు.

ఎవరి కోసం,దేని కోసం ఆగని కాలం మరో మూడు నెలలు ముందుకెళ్లింది..

ఆ రోజు, ఎప్పటిలాగే ఆఫీసు కొచ్చాడు కృష్ణమూర్తి.. అలవాటుగా తన టేబుల్ ని అరచేతితో తాకి ముద్దు పెట్టుకున్నట్టు చేసి కుర్చీని తుడుచుకుని కూచున్నాడు. తలవంచుకుని తనపనిలో నిమగ్నమయ్యాడు.. తను ఉద్యోగంలో చేరిన మొదట్లో అన్ని పనులు స్వయంగా చేసేవాడు, కొంత కాలానికి కంప్యూటర్ ప్రవేశపెట్టిన కొత్తల్లో కొంతమంది ఉద్యోగులను ఎంపిక చేసి శిక్షణ కోసం బైటికి పంపించారు.. వారిలో తనొకడు. త్వరగానే నేర్చుకున్నాడు.. పని కాస్త సులువైంది. ఎవరెలాంటి సమాచారం కావాలని అడిగినా త్వరగా ఇవ్వగలిగేవాడు..

రిక్రియేషన్ క్లబ్ సెక్రెటరీ రాంప్రసాద్ వచ్చి ‘ మూర్తి సార్, రేపు సాయంత్రం సెటిల్మెంట్ సెక్షన్ బాషాగారి రిటైర్మెంట్ ఫంక్షన్. మీరే ఫంక్షన్ నడిపించాలి..గుర్తు చేద్దామని వచ్చాను..’ అని వెళ్లిపోయాడు.. ఆఫీసులో జరిగే అన్ని కార్యక్రమాలకి కృష్ణమూర్తి వ్యాఖ్యాత.. పెద్ద పెద్ద ఆఫీసు మీటింగ్ ల స్టేజ్ నిర్వహణ కూడా తనకే అప్పచెబుతారు..

‘మూర్తి సార్, ఆఫీసర్ గారు అర్జెంట్ గా రమ్మని పిలుస్తున్నారు..’ అన్నాడు అటెండర్ బహదూర్.. నోట్ పాడ్ తీసుకుని ఆఫీసర్ గదిలోకి నడిచాడు కృష్ణమూర్తి.

కూచోమనకుండానే ‘ ఏమిటీ పెనాల్టీ నోటిస్.. కట్టకపోతే అరెస్టు వారెంట్ ఇస్తామంటున్నారు ఇన్కంటాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు .. ఏం చేస్తున్నారు మీరంతా.. మేనేజ్మెంట్ వాళ్ళు నన్ను బాధ్యున్ని చేస్తారట.. నాకేంటి సంబంధం? ఇలా ప్రతీ విషయం నేనే చూసుకోవాలంటే మీరంతా ఎందుకు.. సెక్షన్ లో మీరేగా సీనియర్ ?’ ’ అంటూ గట్టిగా అరవడం మొదలెట్టాడు ఆఫీసర్.

‘అదికాదు సార్, మా బాస్ ఎక్స్ ఇండియా సెలవు పెట్టి సింగపూర్ వెళ్లారు.. వెళ్ళేముందు కూడా నాకేం చెప్పలేదు.. అయినా ఆడిటర్ గారికి ఫోన్ చేసి ఏం చెయ్యాలో తెలుసుకుని మీకు తెలియచేస్తాను’ అనునయంగా చెప్పబోయాడు కృష్ణమూర్తి..

వినే మూడ్ లో లేడు ఆఫీసర్.. ‘ మీకెంతుంది సర్వీస్.. రెండు నెలలా..మూడు నెలలా..అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్ మీద మిమ్మల్ని బ్రాంచ్ కి ట్రాన్సఫర్ చేస్తున్నాను.. సాయంత్రం రిలీవ్ అయి రేపు జాయిన్ కావాలి..’

తడబడ్డాడు కృష్ణమూర్తి.. ‘ సార్, ఒక్కసారి వెళ్ళి ఎం‌డీ గారిని కలుస్తాను’

‘ఆయనే మీకు ఆర్డర్ అర్జెంట్ గా ఇవ్వమని చెప్పి వెళ్లిపోయాడు కూడా’ మరో అవకాశం లేకుండా పోయింది..

ఆఫీసర్ గదిలోంచి కేకలు వినపడడం.. కృష్ణమూర్తి తలవంచుకుని రావడం తోటి ఉద్యోగులు గమనించినా ‘ఏం జరిగిందో’ అడిగే ధైర్యం చేయలేకపోయారు.. నీరసంగా కుర్చీలో కూలబడ్డాడు కృష్ణమూర్తి..కొద్ది క్షణాలు కళ్ళు మూసుకున్నాడు..నిజానికిందులో తన తప్పేంటో అర్ధం కాలేదు.. అలాగని మూడు నెలల కోసం బ్రాంచికి వెడితే చేయని తప్పు చేసినట్టుగా నిర్ధారణ అవుతుంది..అది అవమానమే కాదు అభిమానం చంపుకోవడం కూడా.. అందుకే ఒక నిర్ణయానికి వచ్చాడు.. స్వచ్ఛంద పదవీవిరమణ పత్రం తయారుచేసి ఆఫీసర్కి అందజేసి బయటకు నడవబోతూ తన కుర్చీ కేసి చూశాడు.. ఆఖరిసారి కూర్చుని వెళ్లమన్నట్టుగా అనిపించి వెనక్కి వచ్చాడు..

కొద్దిసేపు కూర్చున్నాక లేవబోతుంటే ‘ఫట్’ మన్న శబ్దం వినిపించి వెనక్కిపడబోయి, టేబుల్ని పట్టుకుని లేచాడు.. చూస్తే కుర్చీకి వెనకవేపు ఒక కాలు విరిగిపోయింది.. తోటివారు సాయమందించబోతే సున్నితంగా తిరస్కరించి బయటకు నడిచాడు..

‘ నమ్మకంగా, అంకితభావంతో పనిచేసి, నిన్నటివరకు మేనేజ్మెంట్ కి ఇష్టుడుగా ఉన్న మూర్తిగారి పరిస్థితే ఇలా వుంటే, మనలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటో?’ అన్నసహోద్యోగుల మాటలు వినిపిస్తూనే ఉన్నాయి..

వారం తర్వాత ఆఫీసునుంచి తన వాలంటరీ రిటైర్మెంట్ అభ్యర్ధన అంగీకరించినట్టుగా కబురు వస్తే ఆఫీసులో అడుగుపెట్టాడు కృష్ణమూర్తి.. తన స్థానంలో బ్రాంచ్ నుంచి ఎవరినో వేశారని తెలిసింది.. ఇంకా రాలేదతను..

‘నమస్తే సార్, మీ పాత కుర్చీ టేబుల్ స్క్రాప్ లో పడేయమన్నారు.. ఎలాగూ కుర్చీ కాలు విరిగిపోయింది, టేబుల్ తాళం సరిగ్గా పడడం లేదు..కానీ మిమ్మల్నిలా పంపించడం మాత్రం దారుణం సార్, ఇంక మూడు నెలలే సర్వీస్ వుందని తెలిసి కూడా.. ’ అంటూ వెళ్లిపోయాడు జానీటర్ శంకర్.

కుర్చీ లేకపోవడంతో వెలితిగా కనిపిస్తోంది అక్కడ.. ‘ఆ కుర్చీ ఉద్యోగం పేరుతో వచ్చిన సౌకర్యం కాదు.. ఒక మంచి జీవితాన్ని అందించిన అమ్మ ఒడి..’ అని రిటైర్మెంట్ రోజున చెప్పాలనుకున్న మాటలు గొంతులోనే ఆగిపోయాయి.

మిగతా ఫార్మాలిటీస్ పూర్తి చేయడం కోసం ముందుకి నడిచాడు కృష్ణమూర్తి..

-ఆకెళ్ళ సూర్యనారాయణ మూర్తి

First Published:  7 Oct 2023 12:47 PM IST
Next Story