అక్షరం
BY Telugu Global21 Nov 2022 1:04 PM IST
X
Telugu Global Updated On: 21 Nov 2022 1:04 PM IST
ఊయలై మనసంతా
ఊగుతుంది నీకోసం
కోయిలవై వాలిపో
కొత్త పాట పాడిపో
ఆకాశం వెన్నెలమ్మ
అందాలను అద్దిపో
తొలి సంధ్య వెలుగుల
తిలకాలను దిద్దిపో
ప్రకృతమ్మ రుతురాగం
పదనిసలు మీటిపో
ప్రతినిత్యం వసంతం
పూచే చెట్లు నాటిపో
సిరిసంపద ఒక వర్గం
చిత్రమేంటో తెలిసిపో
ఆకలంతా ఒకవర్గం
ఆస్తి కుట్ర విప్పిపో
కర్మ ధర్మ పాప పుణ్య
కనికట్టును తెంపిపో
ఆధునిక భావజాల
ఆలోచన నింపిపో
మేకవన్నె పులి నైజం
మేలిముసుగు విప్పిపో
పరిపాలన నియంతృత్వ
ప్రమాదాన్ని చెప్పిపో
వేటకాడి రాజ్యంలో
వేగుచక్క నిలిపిపో
తిరగబడే జనంఘోష
తీర్పు ఏంటో పలికిపో
పోటెత్తిన జన సముద్ర
పోరు శ్రుతిని తాల్చిపో
అవినీతి రాజకీయ
అంగడంతా పేల్చిపో
కొమ్మపైన స్వేచ్ఛ పక్షి
కోలాటం నేర్పిపో
చిలక బతుకు పంజరంలో
శిక్ష ముడిని విప్పిపో
అక్షరమై మొలకెత్తి
ఆయుధంగా నిలిచిపో
చీకటిని తరిమివేసె
చిరకాంతిగా వెలిగిపో
-వేల్పుల నారాయణ
Next Story