Telugu Global
Arts & Literature

ఐశ్వర్య

ఐశ్వర్య
X

రాత్రి టైం పదకొండు.నిద్ర రావడం లేదుఐశ్వర్యకు.

పక్క మీద ఇటు,అటు పొర్లుతోంది.ఫ్యాన్ ఐదులోకి తిప్పుకొని తెల్లని దుప్పటి కప్పుకుంది.అయినా,నిద్ర రావడం లేదు.మంచం దిగింది.ఫ్రిడ్జి తెరిచి బాటిల్లో ఉన్న నీరు గడగడాత్రాగింది.బాతురూముకు వెళ్లివచ్చి మళ్ళీ పక్కమీద వాలింది. అబ్బే...నిద్రరాలేదు.

మనసులో ఏదోఆరాటం.

తెలియని భయం.అమ్మ ఏమిచెపుతుంది ? అద్భుతంజరుగుతుందా? లేకపోతే విషాదం వినాలా? అని భయం పట్టుకుంది.

మళ్ళీ మంచందిగింది.

కిటికీ తలుపులు తీసింది.రివ్వున వీచిన చల్లని గాలివల్ల ఒళ్ళు జలదరించింది.రోడ్డు మీద ప్రభుత్వం వారి ట్యూబులైట్ మసగ్గా వెలుగుతోంది.ఈ సమయంలో తండ్రి ఉండి ఉంటే బాగుండేది అని ఐశ్వర్యకు అనిపించింది. తండ్రి లేకపోవడము దురదృష్టంమని అనుకుంది.తల్లి తారమ్మ లేడీస్ హాస్టల్లో పనిచేస్తూ, చదవమని ప్రోత్సహించింది. వేళవేళకు నిద్రలేపేది. పరీక్షల సమయంలో బాగా చదవాలని నువ్వు నాలా పొట్ట కోసం పాచి పనులుచెయ్యకూడదని,చక్కగా చిలకలా పెరిగి పెద్ద ఉద్యోగస్తురాలు అవ్వాలని రోజు బుద్ధులు చెప్పేది.

చదువులో ఉన్న సుఖం దేనిలోలేదనిచెప్పేది. కూతురు సుఖం కోసం కోరిన బట్టలు పుస్తకాలు కొని ఇవ్వాలని పనులుచేసి డబ్బులు సంపాదించేది.ఎక్కువగా శ్రమపడటమువల్ల చేతులు కాళ్ళు అలిసి అరగిపోయాయి.

ఉదయంఐదుగంటలకునిద్రలేచి ఇల్లు శుభ్రపరచి,వంట ముగించి "ఐసూ....నీకు ఇష్టమనిపప్పుచారు,బంగాళ దుంపల వేపుడు చేసిపెట్టేను.తిని డబ్బాలో సర్దుకొనితీసుకెళ్లు,మర్చిపోకు." అంటూ ఐదు ఏళ్ళ కూతురిగా ఉన్నప్పటి నుంచి ఇవే మాటలు చెపుతూ కాలం నడిపింది.

ఇప్పుడు ఐశ్వర్యకు వయస్సు ఇరవైఆరు దాటాయి.ఎం.కాం. చదివింది. పేరు పొందిన " స్టార్ బజాజ్ టు అండ్ త్రీవీలర్ షో రూం" లో అకౌంటెంట్ గా పనిచేస్తోంది. ఉద్యోగుస్తురాలైకా తల్లిని పనిమాన్పించింది.ఓ పెద్ద ఇంటికి మకాం మార్చింది.ఇల్లంతా ఆధునిక సౌకర్యాలతో నింపింది.తల్లికి అరవై దాటుతున్నాయని రెస్టు కావాలని ఇంట్లో వంటకి పనికి సుందరి అనే అమ్మాయిని పెట్టింది.సుందరి మంచిపిల్ల.చకచకా పనులు నవ్వుతూ చేస్తుంది. "అక్కా...కాఫీ కావాలా!?" అని ప్రేమగా పిలుస్తూ వేడి కాఫీకప్పు చేతికిఅందిస్తుంది.తారమ్మను సొంత తల్లిగా చూసుకుంటుంది.

ఇలా హాయిగా సాగిపోతున్న ఐశ్వర్య జీవితంలోకి తుఫాన్ లా రాజేంద్రప్రసాదుప్రవేశించాడు.

రాజేంద్రప్రసాద్ స్టార్ బజాజ్ షో రూముకు అధిపతి. ఎప్పుడూ నవ్వుతూఉంటాడు.బిజినెస్ మేనేజ్మెంట్ లండన్లో చదివి తండ్రి ప్రారంభించిన వ్యాపారాల్లో తోడుగా నిల్చాడు. మాటల్లాడితే దుబాయి జపాన్ జర్మనీ ఆఫీస్ పనుల మీద వెళ్లివస్తూఉంటాడు.

మంచి మేనర్స్ ఉన్నవాడు.ఆడవారితో చాలా జాగ్రత్తగా మాట్లాడుతాడు.ఎవరిని ఇబ్బందిపెట్టడు.ఓవరాల్ గా మంచి వ్యక్తిత్వం ఉన్నవాడనిచెప్పవచ్చు.

అంతేకాదు...

మంచిఅందగాడు, ఆజానుబాహుడు కూడా.

ఐశ్వర్య రాజేంద్రప్రసాదు షో రూములో పనికిచేరి మూడేళ్లుఅయ్యింది.అతను ఒక్కసారి కూడా చెడ్డగాప్రవర్తించలేదు.

కానీ,ఆమె మనస్సు మాత్రం అతని చుట్టూ తిరిగేది.అతిని రాకకోసం ఆఫీసు కుర్చీలో కూర్చునే ఎదురుచూసేది.

ఒక్కసారైనా కళ్ళు తిప్పి కళ్ళల్లో కళ్లు కలిపి చూడడా అని ఏదో ఆశతో ఓపిగ్గా సహనంగా అతని ప్రేమ పిలుపు కోసం పరితపించింది.

నవంబర్ మూడు రాజేంద్రప్రసాద్ పుట్టినరోజు.అదేరోజు షోరూమ్స్ రెండు చోట్ల స్థాపించిన రోజు.ఐశ్వర్య చేస్తున్న షోరూం అబిడ్స్ లోఉంది.ఆవరణ అంతా అందంగా రంగు రంగు పువ్వులతో,రంగు దీపాల తోరణాలతో అలంకరించారు.దేశ విదేశాల నుంచి అతిధులు వచ్చేరు. పార్టీకి సౌకర్యాలు ఘనంగా ఏర్పరిచారు.వివిధ రకాల వంటకాల సువాసనలు చుట్టూఆవరించాయి.

విస్కీ,రమ్ము,జిమ్ గాజు గ్లాసులు సందడి.అలాగే సాఫ్ట్ డ్రింకులైన పండ్ల రసాలు ఉన్నాయి.వాటికి తోడు ఫ్రెంచ్ చిప్స్,వేయించిన జీడిపప్పు, వేరుసెనగ గింజలు ఇస్తున్నారు.

ఐశ్వర్య ఆరేంజ్ జ్యూసు గ్లాసు తీసుకొని చప్పరిస్తూ కొలీగ్ రమతో ఏదో పిచ్చాపాటి మాట్లాడుతోంది.రాజేంద్రప్రసాద్ నల్లరంగు సూటులో అందంగా కనబడుతున్నాడు.ఎప్పుడూ లేనిది నవ్వుతూ వచ్చి " మీరు తెల్లని జార్జిట్ చీర,ముత్యాల హారంతో వాలు జడలో చాలా అందంగా ఆకర్షణగా కనబడుతున్నారు ఐశ్వర్యగారు " అన్నాడు.

హఠాత్తుగా అలా... అతను వచ్చి అనడంతో ఐశ్వర్య ఆశ్చర్యపోతూ మూగబోయింది.మదిలో ఏదో సంతోషం.అంటే రాజేంద్ర తనని గమనిస్తున్నాడని, ఇష్టపడుతున్నాడని అర్ధమైంది.ఏదో ఒకరోజు " ఐ లవ్ యూ " అంటాడన్న ఆశ ఆమెలో చిగురించింది.

అనుకోని అదృష్టం వచ్చి తలుపులు తడుతుంది అన్న మాట నిజం.ఒకరోజు ఎదురు చూడని ఫోనుకాల్ వచ్చింది ఐశ్వర్యకు.అది రాజేంద్రప్రసాద్ తల్లి శ్రీమతి దేవికహంసగారి నుంచి.ఈరోజు సాయంకాలం కొడుకుతో చేరి ఇంటికి రమ్మనమని పిలిచింది.'అలాగే' అని చెప్పింది.ఆ తరువాత తల్లికి తన మొబైల్ నుంచి ఫోన్ చేసి విషయం చెప్పింది." వెళ్లు...దైర్యంగా మాట్లాడు,అందులో తప్పేమి లేదు"అంది తల్లి.

"అమ్మా....సార్ కారులో మీకోసం ఎదురు చూస్తున్నారు రండి" అని పిల్చాడు ప్యూను రెడ్డి." ముందు కూర్చుంటారా లేక వెనుక సీట్లో కూర్చుంటారా " అన్నాడు రాజేంద్రప్రసాద్.తన అధికారి కార్ డ్రైవు చేస్తోంటే తను వెనుక సీట్లో కూర్చోటం తప్పని తెలిసి "ముందే కూర్చుంటానని " ఎక్కి కూర్చుంది.

కారు మెత్తగా నెక్లెస్ రోడ్డు మీద సాగుతోంది.గాలికి ఎగిరి చెదిరిన ముంగురులు చేత్తో సర్దుకుంది.

అప్పుడే ఆకాశంలో చిన్నగా చీకటి మబ్బులు క్రమ్ముకుంటున్నాయి.కారు ఇంటి ముందు వచ్చి ఆగింది.పెద్ద ఇల్లు,ఖరీదైన ఫర్నిచర్.

దేవికహంసగారు సోఫా లో దర్జాగా కూర్చుని "రామ్మా ఐశ్వర్య....

రా....కూర్చో" అంది." మీ కుటుంబం గురించి నా కొడుకు ఏమి నాకు చెప్పలేదు.కొంచం వివరాలు చెబుతావా!? " అని అడిగింది దేవికాహంస.

మా ఇంటి విషయాలు ఈమెకు ఎందుకా అని మనసులో అనుకుంటూనే,అడిగినప్పుడు చెప్పడం తప్పులేదనుకొని చెప్పడం మొదలుపెట్టింది." మా అమ్మకు నేను ఒక్కర్తినే కూతుర్ని.మా నాన్న నా చిన్నప్పుడే చనిపోయేడు. ఆయన ఈతకల్లు వ్యాపారంచేసేవాడు.

మాకేమి ఆస్తులు లేవు.మా నాన్నకు చేదోడుగా అమ్మ ఒక హాస్టలో కుక్ గా పనిచేసేది.మా అమ్మ నాన్న చనిపోయేకా కూడా నాకు కష్టపడి చదువులు చెప్పించింది. నా విద్యార్హతలు గురించి మీ అబ్బాయిగారికే తెలుసు.ఇప్పుడు మేము అద్దెకు ఒక ఒక పెద్ద ఇంట్లో ఉంటున్నాము.అమ్మను పనిమాన్పించి ఇంట్లో ఉండేలా అన్ని సౌకర్యాలు చేసాను. మేము తృప్తిగా హాయిగా జీవిస్తున్నాము.నేను కొద్దిగా పాటలు పాడుతాను.ఎవరి దగ్గర నేర్చుకోలేదు.సొంతగా విని నేర్చుకొని పాడతాను " అని ఏకధాటిగా తన కథ చెప్పి గట్టిగా ఊపిరి తీసుకుంది ఐశ్వర్య.

"అబ్బా...ఎంత చక్కగా ఉన్నది ఉన్నట్లు చెప్పేవు." మరి నేను కూడా మా గురించి నీకు ఉన్నది ఉన్నట్లు చెప్పాలి కదా! మా అబ్బాయికి నువ్వు బాగా నచ్చేవుట.నువ్వు ఇష్టపడితే పెళ్లి చేసుకొంటాడట.రాజేంద్ర నాన్నగారు పోయి కేవలం ఐదు సంత్సరాలు అయ్యింది.మాకు వాడు కాకుండా సుమన అనే అమ్మాయి ఉంది.పెళ్లి చేసేము.అది తన భర్తతో దుబాయిలో కాపురంచేసుకొంటోంది.

" ఆమె గుక్కతిప్పుకోవడానికి ఆగింది.

ఇంతలో....ఒక అమ్మాయి ట్రేలో కాఫీ కప్పులతో,ప్లేటుల్లో ఏవో తిండ్లు పట్టుకొని వచ్చి " తీసుకోండి " అని ఐశ్వర్య దగ్గరకు వచ్చింది. ' మీరు బాగున్నారు ' అన్నట్టు కళ్ళు తిప్పింది.అప్పుడు ఏదో తెలియని సంతోషంతో 'అవును,ఇవి నా పెళ్లి చూపులే' అని నిశ్చయించుకుంది ఐశ్వర్య.

రాజేంద్రప్రసాద్ ఫ్రెష్ అయ్యి తెల్లని పైజమా డ్రెస్సులో వచ్చి తల్లి పక్కన కూర్చున్నాడు.అతని తల్లి మాటలు మళ్ళీ ప్రారంభించింది "చూడమ్మా.... నీకు మా వాడు నచ్చితే నచ్చాడని చెప్పు.నచ్చకపోతే నచ్చ లేదని ఏ మొహమాటం లేకుండా డైరక్టుగా చెప్పు.దానికి నీ ఉద్యోగానికి ఎటువంటి సంబంధం లేదు.నీ ఉద్యోగానికి ఏమి ఢోకాలేదు.మా అబ్బాయికి మూడేళ్ళ క్రితం కార్ యాక్సుడెంటులో ఒక కాలు పూర్తిగా పోయింది.అయినా వాడు తాను అవిటివాడనని బాధపడుతూ ఎప్పుడూ బద్ధకంగా కూర్చోలేదు.వాళ్ల నాన్నగారివ్యాపారాలు,పొలాలు,తోటలు అన్నీ తానే స్వయంగా చూసుకొంటున్నాడు.చాలా మంచి మనస్సు కలవాడు.నువ్వు నాకన్నా ఎక్కువగా వాడి ప్రవర్తన రోజు ఆఫీస్ లో చూస్తూనే ఉంటావు" అంటూ చెప్పడం ఆపింది.

అలా,ఆమె దాపరికం లేకుండా ఎంతో సింపుల్ గా ఉన్నది ఉన్నట్లు చెప్పిన విధానం ఐశ్వర్యకు ఎంతగానో నచ్చింది.

"ఇదిగో ఐశ్వర్యగారు ఇప్పుడు చూడండి నాకాలు అని జయపూరు కృత్రిమ అవయవముతో ఉన్న కాలు పైజామా పైకి ఎత్తి రాజేంద్ర చూపేడు.అది తొడనుంచి ఉన్న ఆ కాలు చూసి ఐశ్వర్యకు మనస్సులో బాధ కలిగింది.మనస్సు కలుక్కుమంది.ఆ తల్లికి తగ్గ కొడుకు. దాపరికం లేని మాటలు,నేరుగా విషయాలు చర్చించే అతని తీరు మరింత సుగుణాలతో అందంగా ఉన్నాడని అనిపించింది.మొఖంలో ఎటువంటి భావాలుకనిపించ

నీయకుండా ఐశ్వర్య " మిమల్ని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే" అంది.కానీ,మా అమ్మకు అన్ని విషయాలు చెప్పి ఆమె ఒప్పుకుంటే వచ్చి చెపుతానని చెప్పింది.

ఇంటికి వచ్చి తల్లి తారమ్మకు జరిగిందంతా చెప్పింది.తల్లి రాజేంద్రప్రసాదును ఒకరోజు మన ఇంటికి పిలువమనిచెప్పింది.ఆయన రావడం చూడటం మర్యాదలు చేయడం జరిగింది. వెంటనే తన అభిప్రాయం చెప్పలేదు తారమ్మ. బంగారం లాంటి కూతుర్ని అంగవికులుడికి ఇచ్చి పెళ్లి చేయడం ఇష్టం లేక,ఆలోచించు కోవడానికి రెండు రోజులు సమయంఅడిగింది.

ఐశ్వర్య తల్లికి " నాకు ఆయన బాగా నచ్చేరు,మంచివారు.నన్ను ప్రేమగా చూసుకొంటారన్న నమ్మకం నాకు ఉంది ఒప్పుకో అమ్మా....మనిషి రూపంలో ఎలా ఉన్నాడనేది ముఖ్యం కాదు.అతని హృదయం ఎంత మంచింది? సుగుణాలు ఏమిటి అని మనం అర్ధం చేసుకోవాలి." అని మళ్ళీ మళ్ళీ నచ్చ చెపుతూనే ఉంది.

అందుకే,ఈరోజు తెల్లావారితే 'అమ్మ...యస్ అంటుందా!? లేక నో అంటుదా!? అన్న భయంతో ఐశ్వర్యకు నిద్ర కరువై కష్టపడుతోంది.

తెల్లవారింది. సుప్రభాతం పాడుతూ పూజ గదిలో గంట వాయిస్తోంది తారమ్మ.ఇల్లాంతా కర్పూరం,అగరవొత్తుల ధూపంతో సువాసనలు."ఐశ్వర్యా...ఈ రోజు ఆఫీసుకు వెళ్లే ముందు ఈశ్వర గుడికి వెళ్లి పూజ చేయించి,ఆ తరువాత దేవికహంసగారి ఇంటికి వెళ్లి 'పెళ్ళికి ముహూర్తం పెట్టించామన్నానని చెప్పు" అంది.

- ప్రభాశాస్త్రిజోశ్యుల (మైసూరు)

First Published:  16 Nov 2022 3:50 PM IST
Next Story