ఊహ అస్తిత్వమై (కవిత)
మనసున జన్మించిన ఊహ
గుండెన గూడుకడుతుంది.
కాళ్ళను చుట్టి
కళ్ళకు సప్తవర్ణ చిత్రమౌతుంది.
మనిషి మనిషై
నీడలా వెంట నడుస్తుంది!
ఊహ కార్యనిర్వాహకమైతే
శివుని శిరస్సుపై గంగ
భూమికి జలపాతమౌతుంది
నక్షత్రశాల ప్రవేశమై
భూమికి పాఠ్యాంశమౌతుంది.
జలస్తంభన విద్యతో
సముద్ర గర్భాన దూరి
అంబుధి అడ్డుకోత పటంగీస్తుంది
భూభ్రమణం చేసి
ఆకాశాన్ని అనుసంధిస్తుంది!
అశేషమైన శ్రీకృష్ణుని ఊహ
కురుక్షేత్రంలో ఘనవిజయం
సశేషమైన తాండ్రపాపయ్య ఊహ
బొబ్బిలి యుద్ధంలో ఘోరపరాజయం!
ఊహలు అంతఃకరణాలై
శాస్త్రజ్ఞులు ఇంజనీర్లు
డాక్టర్లు రైతుల ఫలోదయాలు
ఊహలు బహుదారులై
నేల విడిచి సాముచేస్తే
పోషక ప్రాణాలదే!
ఊహకు పగలు రాత్రి
ఎండ వానల్లేవు
వాయువులో ప్రాణవాయువై
సజీవ సాక్షాత్కారం
నిశ్చలంగా నిల్చిన మనిషికి
ఊహ సమారంభం!
ఊహ అస్తిత్వమై
విస్తరించి
సౌహార్థమైతే
సార్వజనీనం
ఊహలు నారుకయ్యలా
గుబురుగా మొలుస్తాయి.
నారు పీకి
పొలంలో నాటితేనే
పంటలు పండుతాయి!
- అడిగోపుల వెంకటరత్నం