Telugu Global
Andhra Pradesh

ఫైనల్‌ లిస్ట్‌ పండుగ తర్వాతే..

తాను పోటీచేసే విషయంలోనూ సీఎం జగన్‌దే తుది నిర్ణయమని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. ప్రత్యక్ష రాజకీయాల్లో గ్యాప్‌ రావడం వల్లే∙పార్టీ పనులు చూసుకుంటున్నానని ఆయన తెలిపారు.

ఫైనల్‌ లిస్ట్‌ పండుగ తర్వాతే..
X

రానున్న ఎన్నికలకు సంబంధించి అసెంబ్లీ, పార్లమెంట్‌ అభ్యర్థుల మార్పులు, చేర్పుల విషయంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టంగా ఉన్నారని వైసీపీ రీజనల్‌ కోఆర్డినేటర్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. గెలుపునకు దూరంగా ఉన్న అభ్యర్థులకు సీట్లు ఉండవని ముందు నుంచీ ఆయన చెబుతూ వస్తున్నారని వివరించారు. అందుకు తగ్గట్టుగానే మార్పులతో కూడిన మూడు జాబితాలు ఇప్పటివరకు విడుదల చేసినట్టు తెలిపారు. కొత్త మార్పులు, చేర్పులకు సంబంధించిన ఫైనల్‌ లిస్ట్‌ పండుగ తర్వాత వస్తుందని ఆయన చెప్పారు. విశాఖపట్నంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ వివరాలు వెల్లడించారు. ఈ మార్పులు, చేర్పుల నేపథ్యంలో సిట్టింగ్‌లు కొత్త అభ్యర్థులతో అడ్జస్ట్‌ కావడానికి కొంత టైమ్‌ పడుతుందని ఆయన చెప్పారు. సీనియర్లు వారి వ్యక్తిగత కారణాలతోనే పార్టీని వీడుతున్నారని, త్వరలోనే అన్నీ సర్దుకుంటాయని వివరించారు. అల్టిమేట్‌గా ట్రాక్‌ రికార్డును బట్టే ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు ఫైనల్‌ అవుతాయని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

పోటీ విషయంలో జగన్‌ నిర్ణయానికి కట్టుబడి ఉంటా..

ఇక తాను పోటీచేసే విషయంలోనూ సీఎం జగన్‌దే తుది నిర్ణయమని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. ప్రత్యక్ష రాజకీయాల్లో గ్యాప్‌ రావడం వల్లే∙పార్టీ పనులు చూసుకుంటున్నానని ఆయన తెలిపారు. ఒంగోలు లోక్‌సభకు పోటీ చేయనని తాను సీఎం వైఎస్‌ జగన్‌కు చాలాసార్లు చెప్పానని వైవీ చెప్పారు. తాను పోటీ చేయాలనుకుంటే 2019 ఎన్నికల్లోనే పోటీ చేసేవాడినని, కంటిన్యూ అయ్యేవాడినని వివరించారు. అయితే అంతిమంగా పోటీ చేసే విషయంలో జగన్‌ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పారు.

బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న సీఎం జగనే..

ఇక బీసీల విషయంలో సీఎం వైఎస్‌ జగన్‌ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. మా వల్ల మీ కుటుంబాల్లో మేలు జరిగితేనే మాకు ఓటెయ్యండి.. అంటూ సీఎం జగన్‌ చెబుతున్నారని, అంత ధైర్యంగా చెప్పే సీఎం ఈ దేశంలో ఎవరూ లేరని ఆయన తెలిపారు. ఇచ్చిన హామీలన్నీ అమలు చేసినందువల్లే.. ప్రజాసంక్షేమం కోసం చిత్తశుద్ధితో పాటుపడినందువల్లే.. ప్రభుత్వ పాలనను ప్రజలకు చేరువ చేసినందువల్లే సీఎం వైఎస్‌ జగన్‌ ధైర్యంగా ప్రజల ముందుకు వెళుతున్నారని ఆయన వివరించారు. ఇక కాంగ్రెస్‌ పార్టీలో షర్మిల చేరడం వల్ల వైసీపీకి ఎలాంటి నష్టం లేదని ఆయన స్పష్టం చేశారు. అలాగే.. షర్మిలను దృష్టిలో పెట్టుకొని మార్పులు చేసేదేమీ లేదని ఈ సందర్భంగా వైవీ చెప్పారు.

First Published:  15 Jan 2024 5:45 PM IST
Next Story