ఎగ్జిట్ పోల్స్ పై కాదు.. మాకు ప్రజలపైనే నమ్మకం
ఏపీలో తుఫాను, సునామీ లాంటివేవీ లేవిని ప్రజలు చాలా కూల్‌గా ఓట్లు వేశారని అన్నారు వైవీ సుబ్బారెడ్డి.
వివిధ సర్వే సంస్థలు విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ పై వైసీపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొన్నిరకాల ఎగ్జిట్ పోల్స్ తమకు అనుకూలంగా ఉన్నా కూడా ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఎగ్జిట్ పోల్స్ ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పారాయన. తమకు ప్రజలపై నమ్మకం ఉందని, కచ్చితంగా భారీ మెజార్టీతో ఈ ఎన్నికల్లో గెలుస్తున్నామని తెల్చి చెప్పారు వైవీ.
ఇతర రాష్ట్రాలతో పోల్చి చూస్తే ఏపీలో ఉన్న పరిస్థితులు వేరని అన్నారు వైవీ సుబ్బారెడ్డి. ఏపీ ప్రజలపై తమకు అపారమైన నమ్మకం ఉందన్నారు. మంచి చేసిన వారిని ప్రజలు ఎప్పుడూ దూరం చేసుకోరని చెప్పారు. సీఎం జగన్ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల వల్లే తాము మరోసారి అధికారంలోకి వస్తున్నట్టు తెలిపారు వైవీ. ఇక ఎగ్జిట్ పోల్స్ ని అంత సీరియస్ గా పట్టించుకోవాల్సిన అవసరం లేదని, మరో 36 గంటల్లో కరెక్ట్ రిజల్ట్ వస్తుంది కదా అని అన్నారు.
అది ఫేక్ సునామీ..
ఏపీలో ఏ తుఫాను, ఏ సునామీ లేదని ప్రజలు చాలా కూల్‌గా ఓట్లు వేశారని అన్నారు వైవీ సుబ్బారెడ్డి. ఎన్నికల సంఘాన్ని అడ్డం పెట్టుకొని కూటమి.. తుఫాను, సునామీలను సృష్టించాలనుకుంటోందని విమర్శించారు. తాము ప్రజల్ని నమ్ముకున్నామని, వారే తమను గెలిపిస్తారని చెప్పారు వైవీ.