Telugu Global
Andhra Pradesh

ఉత్తరాంద్ర అభ్యర్థులకు వైవీ కీలక సూచనలు

పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారానికి సిద్ధమవడంపై కూడా సెటైర్లు పేల్చారు వైవీ సుబ్బారెడ్డి. వారాహిని ఎన్నిసార్లు దించుతారు, ఎన్నిసార్లు ఎత్తుతారని ప్రశ్నించారు.

ఉత్తరాంద్ర అభ్యర్థులకు వైవీ కీలక సూచనలు
X

ఎన్నికల ప్రచారంలో మరింత స్పీడ్ పెంచాలని అభ్యర్థులకు సూచించారు వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి. మరోసారి గడప గడప విస్తృతంగా పర్యటించాలని చెప్పారు. ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలు, అభ్యర్థులతో ఆయన సమావేశమయ్యారు. 55 రోజుల ఎన్నికల ప్రచార ప్రణాళిక అమలు చేయాలన్నారు. సిద్ధం సభలతో వైసీపీ సత్తా ఏంటో తెలిసొచ్చిందని, సీఎం జగన్ బస్సు యాత్రను మరింత విజయవంతం చేయాలని చెప్పారు వైవీ.

ఐదేళ్ల అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజల ముందు చర్చకు పెట్టేందుకు సిద్ధమని అన్నారు వైవీ సుబ్బారెడ్డి. విపక్ష కూటమి వైసీపీ ఎన్నికల ప్రచారాన్ని ఫాలో అయ్యే దుస్థితిలో ఉందని ఎద్దేవా చేశారు. సిద్ధం సభల తర్వాత కనీసం చంద్రబాబు సొంతగా బహిరంగ సభ పెట్టుకునే ధైర్యం కూడా చేయలేకపోయారన్నారు. ఢిల్లీ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ వస్తే తప్ప ఎన్నికల ప్రచారం చేయలేని పరిస్థితుల్లో వారు ఉన్నారన్నారు. కూటమికి సొంత తెలివితేటలు లేవని, తమ ప్రచార వ్యూహాలను కాపీ కొడుతున్నారని ఎద్దేవా చేశారు వైవీ సుబ్బారెడ్డి.

పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారానికి సిద్ధమవడంపై కూడా సెటైర్లు పేల్చారు వైవీ సుబ్బారెడ్డి. వారాహిని ఎన్నిసార్లు దించుతారు, ఎన్నిసార్లు ఎత్తుతారని ప్రశ్నించారు. 2014-19 మధ్య కూటమి అధికారంలో ఉందని.. ఆ సమయంలో రాష్ట్ర ప్రజల్ని వారు మోసం చేశారని అన్నారు. ఆ మోసాలు ఇప్పటికీ జనానికి గుర్తున్నాయని వివరించారు. అదే కూటమి మరోసారి ఎన్నికల టైమ్ లో కలసిందని, ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని చెప్పారు వైవీ సుబ్బారెడ్డి.

First Published:  21 March 2024 4:20 PM IST
Next Story