Telugu Global
Andhra Pradesh

త్వరలో టీటీడీకి కొత్త చైర్మన్? రేసులో ఇద్దరు వైసీపీ నాయకులు!

వైవీ సుబ్బారెడ్డి తన పదవీ కాలంలో టీటీడీని సమర్థవంతంగా నడిపించారు. కొన్ని తప్పులు జరిగినా.. వాటిని సరిదిద్దుకొని ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు తీసుకొని వెళ్లారు.

త్వరలో టీటీడీకి కొత్త చైర్మన్? రేసులో ఇద్దరు వైసీపీ నాయకులు!
X

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ పదవి నుంచి వైవీ. సుబ్బారెడ్డిని తొలగించబోతున్నారా? బాబాయ్‌కి పార్టీ పరంగా కీలక బాధ్యతలు అప్పగించాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నారా? అంటే పార్టీ వర్గాలు అవుననే అంటున్నాయి. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ మరోసారి అధికారంలోకి రావాలని వైఎస్ జగన్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఉత్తరాంధ్రలో పార్టీని బలోపేతం చేయడానికి, ఎన్నికల సమయంలో నడిపించడానికి వైవీ సుబ్బారెడ్డి సేవలు తప్పకుండా అవసరం. పైగా సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ పదవిలో గత మూడున్నర ఏళ్లుగా ఉంటున్నారు. అందుకే ఆయనను తప్పించి.. పూర్తిగా వైపీపీ కోసం వాడుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం.

2019 ఎన్నికల్లో వైసీపీ 151 అసెంబ్లీ, 22 లోక్‌సభ స్థానాలను గెలుచుకున్నది. రాబోయే 2024 ఎన్నికల్లో ఈ సంఖ్యను మరింత మెరుగు పరుచుకోవాలని వైఎస్ జగన్ టార్గెట్‌గా పెట్టారు. పార్టీ బలోపేతం కోసం పలు రీజియన్లలో తనకు నమ్మకస్తులైన వారిని నియమించారు. ఉత్తరాంధ్ర బాధ్యతలు వైవీ సుబ్బారెడ్డికి అప్పగించారు. ఇకపై పూర్తిగా ఉత్తరాంధ్ర వ్యవహారాలపై దృష్టిపెట్టేందుకే సుబ్బారెడ్డిని చైర్మన్ బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్లు తెలుస్తున్నది. ఎన్నికల అనంతరం తిరిగి ఆయనకు అదే పదవి ఇస్తానని కూడా జగన్ చెప్పినట్లు సమాచారం.

వైవీ సుబ్బారెడ్డి తన పదవీ కాలంలో టీటీడీని సమర్థవంతంగా నడిపించారు. కొన్ని తప్పులు జరిగినా.. వాటిని సరిదిద్దుకొని ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు తీసుకొని వెళ్లారు. అందుకే సుబ్బారెడ్డి స్థానంలో మరో సమర్థుడైన వ్యక్తికి ఆ బాధ్యతలు అప్పగించాలని సీఎం జగన్ భావిస్తున్నారు. ప్రస్తుతం రేసులో ఇద్దరు నాయకులు ఉన్నట్లు తెలుస్తున్నది. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డితో పాటు.. బీసీ నాయకులు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పేరు కూడా తెరపైకి వచ్చింది. భూమన కరుణాకర్ రెడ్డి.. వైఎస్ఆర్ సీఎంగా ఉన్న సమయంలో టీటీడీ చైర్మన్‌గా వ్యవహరించారు. ఆయనకు అనుభవం కూడా ఉన్నది. దీంతో ఆయన పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తున్నది.

మరోవైపు టీటీడీ వంటి ప్రతిష్టాత్మక ధార్మిక సంస్థకు బీసీ వ్యక్తిని చైర్మన్‌ను చేసే ఆలోచన కూడా ఉన్నట్లు తెలుస్తోంది. గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతానికి చెందిన జంగా కృష్ణమూర్తికి మంచి పేరున్నది. ఆయన గతంలో టీటీడీ బోర్డు సభ్యుడిగా కూడా పని చేశారు. బీసీలకు ఇస్తే అది అన్ని రకాలుగా కలసి వస్తుందని జగన్ భావిస్తున్నారు. కరుణాకర్ రెడ్డి కంటే జంగా కృష్ణమూర్తే బెస్ట్ ఛాయిస్ అని కూడా అనుకుంటున్నారు. ఒకటి రెండు రోజుల్లోనే సీఎం జగన్ టీటీడీ చైర్మన్‌పై నిర్ణయం తీసుకుంటారని తెలుస్తున్నది.

First Published:  29 Dec 2022 1:28 AM GMT
Next Story