వైసీపీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలపై వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు
పార్టీ ఓటమి కారణంగా నేతలెవరూ డీలా పడాల్సిన అవసరం లేదన్నారు వైవీ సుబ్బారెడ్డి. గెలుపు ఓటములు సహజమని, కారణం ఏదైనా ఫలితాలను ప్రజా తీర్పుగానే భావించాలన్నారు.
ఏపీలో ప్రభుత్వం మారింది, అక్కడక్కడ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు పార్టీలు మారుతున్నారు. కొన్నిచోట్ల మూకుమ్మడిగా వైసీపీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. ఇక స్థానిక నేతల్లో కూడా కలవరం మొదలైంది. టీడీపీ దాడులు చేస్తోందని, తమ కార్యకర్తల్ని భయాందోళనలకు గురి చేస్తోందనే వైసీపీ ఆరోపణల నేపథ్యంలో.. స్థానిక సంస్థలకు చెందిన ప్రజా ప్రతినిధులు ఎంతమంది ఆ పార్టీతో కలసి ఉంటారో తెలియని పరిస్థితి. టీడీపీ ఒత్తిడి చేస్తున్నా.. తమ నేతలు అంత త్వరగా లొంగిపోరనేది వైసీపీ ధీమా. ఈ క్రమంలో వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ప్రలోభాలకు ఎవరూ లొంగిపోవద్దని ఆయన వైసీపీ జడ్పీటీసీలు, ఎంపీటీసీలకు పిలుపునిచ్చారు.
ఎవ్వరూ డీలా పడొద్దు..
పార్టీ ఓటమి కారణంగా నేతలెవరూ డీలా పడాల్సిన అవసరం లేదన్నారు వైవీ సుబ్బారెడ్డి. గెలుపు ఓటములు సహజమని, కారణం ఏదైనా ఫలితాలను ప్రజా తీర్పుగానే భావించాలన్నారు. పార్టీ నాయకులంతా ప్రజలకు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ జయంతిని ఘనంగా నిర్వహించాలని, ఆ కార్యక్రమం ద్వారా పార్టీ బలాన్ని మరోసారి చాటి చెప్పాలన్నారు వైవీ.
ఆ నమ్మకం మాకుంది..
తమ పార్టీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలపై తమకు పూర్తి నమ్మకం ఉందన్నారు వైవీ. వారెవరూ టీడీపీ ప్రలోభాలకు లొంగిపోరన్నారు. వైసీపీ కార్యాలయంలో పార్టీ నేతలతో కీలక సమావేశం ఏర్పాటు చేసిన ఆయన.. స్థానిక నేతలు చేజారకుండా చూడాల్సిన బాధ్యత ముఖ్య నేతలపై ఉందని చెప్పారు. పార్టీ ఓటమిని సాకుగా చూపి.. టీడీపీ దుష్ప్రచారాలు చేసే అవకాశముందని చెప్పారు. ఇప్పటినుంచే పార్టీని పటిష్టపరిచేందుకు కృషిచేయాలన్నారు వైవీ.