దాడులపై హైకోర్టుకు.. వైసీపీ కీలక నిర్ణయం
గవర్నర్ కి ఫిర్యాదు చేసినా స్పందన లేదని, కళ్లెదుటే దాడులు జరుగుతున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు కొడాలి నాని.
రాష్ట్రవ్యాప్తంగా తమ పార్టీ నేతలు, కార్యకర్తల్ని లక్ష్యంగా చేసుకుని టీడీపీ దాడులకు తెగబడుతోందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో బాధితులకు అండగా ఉండేందుకు వైసీపీ కమిటీలను కూడా నియమించింది. దాడులపై ఆల్రడీ గవర్నర్ కు సోషల్ మీడియా వేదికగా ఫిర్యాదు చేశారు వైసీపీ అధినేత జగన్. ఇప్పుడు పార్టీ నేతలు మరో అడుగు ముందుకేశారు. న్యాయపోరాటానికి దిగుతామంటున్నారు.
హైకోర్టుకు..
ఏపీలో జరుగుతున్న రాజకీయ దాడులపై తాము హైకోర్టుకు వెళ్తామంటున్నారు వైసీపీ నేతలు. గవర్నర్ కి ఫిర్యాదు చేసినా స్పందన లేదని, కళ్లెదుటే దాడులు జరుగుతున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు కొడాలి నాని. పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తనతోపాటు వల్లభనేని వంశీ ఇంటిపై కూడా టీడీపీ శ్రేణులు దాడులకు తెగబడ్డాయన్నారు. ఎన్నికల తర్వాత ఉద్దేశపూర్వకంగానే టీడీపీ ఇలా దాడులు చేస్తోందని చెప్పారు నాని.
మరో రెండు రోజుల్లో మేము కూడా రోడ్ల మీదకి వస్తాం!!
— YSRCP Brigade (@YSRCPBrigade) June 8, 2024
దాడి జరిగిన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటాం.
- కొడాలి నాని pic.twitter.com/yX754NalHV
ఏపీ మరో బీహార్‌గా మారుతోందంటున్నారు వైసీపీ నేతలు. టీడీపీతోపాటు జనసేన పార్టీ నేతలు కూడా దాడులకు పాల్పడుతున్నారని, తమ పార్టీ కార్యకర్తలను భయపెట్టాలనుకుంటున్నారని చెప్పారు. దాడులు జరుగుతున్నా పోలీసులు స్పందించడం లేదని కొడాలి ధ్వజమెత్తారు. దాడులు చేసిన వారితో పాటు. చూస్తూ ఉన్న పోలీసులపై కూడా కేసులు వేస్తామని ఆయన హెచ్చరించారు. రాబోయే రెండు రోజుల్లో కృష్ణాజిల్లాలో పర్యటిస్తామన్నారు కొడాలి నాని. గాయపడిన కార్యకర్తలకు ధైర్యం చెబుతామన్నారు. కార్యకర్తలను కాపాడుకుంటామన్నారు. వైసీపీ కార్యకర్తల్ని ఇబ్బంది పెడుతున్న ప్రాంతాల్లో నేతలు పర్యటిస్తారని భరోసా ఇచ్చారు. తమ పర్యటనలో శాంతిభద్రతల సమస్య వస్తే పోలీసులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు నాని.