వైసీపీ పరిశీలకుల జాబితా రెడీ.. త్వరలోనే ప్రకటించే అవకాశం
ఏపీలోని 175 నియోజకవర్గాల్లో నియమించాల్సిన పరిశీలకుల జాబితాను పార్టీ అగ్రనేతలు సిద్ధం చేశారు. త్వరలోనే వైఎస్ జగన్ ఈ జాబితాకు ఆమోదం తెలుపుతారని.. ఆ తర్వాత పరిశీలకుల పేర్లు వెల్లడిస్తారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.
ఏపీలోని వైసీపీ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని పోగొట్టుకునే ఉద్దేశంలో లేదు. సీఎం వైఎస్ జగన్ అయితే టార్గెట్ - 175 అంటూ పార్టీ నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతున్నారు. ప్రస్తుతం ఉన్న 151 సీట్లను కాపాడుకోవడంతో పాటు మిగిలిన 24 సీట్లను కూడా గెలుచుకోవాలని భావిస్తున్నది. ఆ టార్గెట్ చేరుకునే సాధ్యాసాధ్యాలను పక్కన పెడితే.. ప్రతీ నియోజకవర్గంలో ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని వైసీపీ చీఫ్ జగన్ నిర్ణయించారు. అందుకే ప్రతీ సెగ్మెంట్‌లో ఒక పరిశీలకుడిని నియమించడానికి రంగం సిద్ధం చేశారు.
ఏపీలోని 175 నియోజకవర్గాల్లో నియమించాల్సిన పరిశీలకుల జాబితాను పార్టీ అగ్రనేతలు సిద్ధం చేశారు. త్వరలోనే వైఎస్ జగన్ ఈ జాబితాకు ఆమోదం తెలుపుతారని.. ఆ తర్వాత పరిశీలకుల పేర్లు వెల్లడిస్తారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ప్రస్తుతం ఏపీలో వైసీపీ అత్యంత బలంగా ఉన్నది. ప్రతిపక్ష టీడీపీతో పాటు జనసేన, బీజేపీ, ఇతర పార్టీలు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమ బలాన్ని చాటుకోవాలని భావిస్తున్నాయి. వైఎస్ జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో అనేక అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయి. అయినా సరే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎంతో కొంత ఉంటుంది. దాన్ని క్యాష్ చేసుకోవడానికి ప్రతిపక్షాలు ఏకమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
ప్రతిపక్షాలకు అలాంటి ఛాన్స్ ఇవ్వకూడదనే ప్రతీ నియోజకవర్గంలో వైసీపీని మరింతగా బలోపేతం చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం వైసీపీ గెలిచిన నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేతో పాటు పార్టీ ఇంచార్జి బాధ్యులుగా వ్యవహరిస్తున్నారు. మిగిలిన 24 చోట్ల ఇంచార్జులు ఉన్నారు. అయితే చాలా చోట్ల ఇంచార్జులు, ఎమ్మెల్యేలు వర్గాలుగా విడిపోయి రాజకీయం చేస్తున్నట్లు అధిష్టానం గుర్తించింది. అక్కడ జరిగే చాలా విషయాలు పై వరకు చేరడం లేదనే అనుమానాలు ఉన్నాయి. ఈ విభేదాలు ఇలాగే కొనసాగితే పార్టీకి ఎన్నికల సమయంలో ఇబ్బందులు తప్పవు. అందుకే వీరిపై ఒక పరిశీలకుడి నియమిస్తున్నారు.
పరిశీలకుడి నియామకం వల్ల ఎమ్మెల్యే, ఇంచార్జుల్లో భయం ఉండటంతో పాటు.. బాధ్యత కూడా పెరుగుతుందని పార్టీ అంచనా వేస్తోంది. నియోజకవర్గ పరిస్థితి ఎప్పటికప్పుడు పార్టీ అధిష్టానానికి చేరడం వల్ల.. ఎలాంటి వ్యూహాలు రచించాలనేది కూడా సులభంగా మారుతుంది. కొంత మంది ఎమ్మెల్యేలు, ఇంచార్జిలు పరిశీలకుల నియామకాన్ని వ్యతిరేకిస్తున్నారు. కానీ ఇవన్నీ తాత్కాలికమే అని.. భవిష్యత్‌లో అన్నీ సర్థుకుంటాయని పార్టీ వర్గాలు అంటున్నాయి.
వాస్తవానికి పరిశీలకుల నియామకం అనేది వైఎస్ జగన్ ఎప్పుడూ ఆలోచించలేదు. కానీ, తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్ల శ్రీదేవిపై అనేక ఫిర్యాదులు అందాయి. దీంతో ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌ను పరిశీలకుడిగా నియమించారు. అక్కడ జరుగుతున్న విషయాలను ఆయన ఎప్పటికప్పుడు అధిష్టానానికి చేరవేశారు. దీంతో క్షేత్రస్థాయిలో ఏం జరుగుతున్నదో పార్టీ పెద్దలకు అర్థం అయ్యింది. అదే సమయంలో ఎమ్మెల్యే శ్రీదేవి.. పరిశీలకుని నియామకంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినా సరే పరిశీలకుడిని మాత్రం తొలగించలేదు. ఇప్పుడు ఇదే స్ట్రాటజీని రాష్ట్రమంతటా అమలు చేయడానికి వైఎస్ జగన్ సిద్ధమయ్యారు.
పరిశీలకుల నియామకంపై కొంత అభ్యంతరం ఉన్నా.. మెజార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు దీనిపై సంతృప్తి వ్యక్తం చేశారు. దీని వల్ల పార్టీ కార్యకర్తల్లో కూడా బాధ్యత పెరుగుతుందని, కీలక నాయకులకు తలనొప్పులు తగ్గుతాయని భావిస్తున్నారు. అందుకే జగన్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు. పరిశీలకుల నియామకం వల్ల ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలంటే ఒకటి రెండు నెలలు ఆగాల్సిందే.