Telugu Global
Andhra Pradesh

ఏపీ నాయకుల నోటికి తాళం.. గ్యాస్ బాదుడుపై గప్ చుప్

ఏపీ నాయకుల నోటికి తాళం.. గ్యాస్ బాదుడుపై గప్ చుప్
X

గ్యాస్ బండపై ఒకేసారి 50 రూపాయలు బాదిపడేసిన కేంద్రంపై దాదాపుగా అన్ని పార్టీలు విమర్శలు గుప్పించాయి. వైరి వర్గాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే కాదు, బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా విపక్షాలు తీవ్ర నిరసనలు తెలిపాయి. తెలంగాణలో మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం రోడ్డెక్కి ప్రజలకు బాసటగా నిలిచారు. ప్రజాగ్రహాన్ని కేంద్రానికి తెలియజేశారు. కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రం పూర్తిగా భిన్నం. ఇక్కడ బీజేపీ అధికారంలో లేదు, బీజేపీ కూటమి కూడా కాదు, కనీసం బీజేపీకి బహిరంగ మద్దతు తెలిపే పార్టీ కూడా ఇక్కడ ప్రభుత్వంలో లేదు. అయినా అంతా సైలెన్స్, ఎవరూ నోరు మెదపలేదు, కనీసం గ్యాస్ బాదుడుపై స్పందించడానికి కూడా ఇష్టపడలేదు, ఓ ట్వీట్ కూడా లేదు.

అధికార వైసీపీ అసలు ఈ వ్యవహారాన్ని ఏమాత్రం పట్టించుకోలేదు. ఒకేసారి 50రూపాయలు పెంచారేంటి అనే ప్రశ్న ఏ నాయకుడి నోటివెంటా వినపడలేదు. బాదుడే బాదుడంటూ మందు బాటిల్ పై 5 రూపాయలు పెరిగితేనే గగ్గోలు పెట్టే టీడీపీ కూడా ఎందుకో నోటికి తాళం వేసుకుంది. యువగళం వినిపిస్తున్న యువనాయకుడు కూడా గ్యాస్ రేట్లపై నోరు విప్పే సాహసం చేయలేదు. బీజేపీతో పొత్తులో ఉన్నామో లేమో తేల్చుకోలేని జనసేన కూడా ఈ విషయంలో నోరు మెదపకపోవడం విశేషం. ప్రశ్నించడానికే వచ్చామంటున్న పవన్ కల్యాణ్ కూడా గ్యాస్ రేటుపై కేంద్రాన్ని ప్రశ్నించే సాహసం చేయలేదు. అసలు ఆ సమస్య మా రాష్ట్రానిది కాదు అన్నట్టుగా ఏపీలోని రాజకీయ పార్టీలన్నీ వ్యవహరించడం విశేషం.

BJ ‘YSRCP TDP JP’ P

మంత్రి కేటీఆర్ పరిభాషలో చెప్పాలంటే.. బీజేపీ మధ్యలో దర్యాప్తు సంస్థలన్నీ ఇమిడిపోయినట్టుగా ఏపీలో బీజేపీ మధ్యలో వైసీపీ, టీడీపీ, జనసేన తల వంచుకుని సెట్ అయ్యాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఏపీలోని అన్ని పార్టీలు ఎలా సాగిలపడ్డాయో చెప్పడానికి, నిరూపించడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణేదీ లేదు. విభజన హామీల అమలులో మోసం జరిగినా నోరు కట్టేసుకునే ఉన్నారు నేతలు. తొడలు కొట్టడాలు, మెడలు వంచడాలు.. కేవలం మాటల్లోనే కానీ, చేతల్లో చూపించేవారెవరూ లేరని తేలిపోయింది. ఇప్పుడు గ్యాస్ సిలిండర్ రేటు భారీగా పెరిగినా.. నొప్పి జనాలదే కదా, మాకెందుకులే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారంతా.

First Published:  3 March 2023 8:05 AM IST
Next Story