వైసీపీలో ఇంటిపోరు, మాజీ ఎమ్మెల్యేపై సస్పెన్షన్ వేటు..
గతంలో టీడీపీ నేతలకు లీకులిచ్చి.. కిలారిపై మట్టి మాఫియా అనే ఆరోపణలు చేయించింది కూడా రావి వర్గం అనే అనుమానాలున్నాయి. వీటన్నిటిపై అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్లడంతో క్రమశిక్షణా కమిటీ చర్యలకు సిఫారసు చేసింది.
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, పార్టీ క్రమశిక్షణ కమిటీ సిఫారసుల మేరకు మాజీ ఎమ్మెల్యే రావి వెంకట రమణను వైసీపీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. పార్టీ అధ్యక్షుడు సీఎం జగన్ ఆదేశాల మేరకు సస్పెన్షన్ వేటు వేసినట్టు ఆ ప్రకటన సారాంశం.
రావి వర్సెస్ కిలారి
ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి 2004లో కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు రావి వెంకట రమణ. వైసీపీ ఆవిర్భావం నుంచి ఆయన జగన్ వెంట నడిచారు. జగన్ తోనే ఉంటూ పొన్నూరులో పార్టీ తరపున పనిచేశారు. 2014 ఎన్నికల్లో పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2019లో జగన్ ఆయనకు టికెట్ ఇవ్వలేదు. చివరి నిమిషంలో పార్టీలోకి వచ్చిన కిలారి రోశయ్యకు టికెట్ ఇచ్చారు జగన్. కిలారి అక్కడినుంచి గెలుపొందారు. అప్పటి నుంచి రావి, కిలారి వర్గాల మధ్య విభేదాలు పెరిగి పెద్దవయ్యాయి.
కిలారి రోశయ్య.. స్వయానా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అల్లుడు కావడంతో.. ఆయనకు వైసీపీలో మంచి ప్రయారిటీ ఉంది. దీంతో సహజంగానే రావి వర్గం మరింత రగిలిపోయేది. ఇటీవల ఇరు వర్గాల మధ్య దాడులు కూడా మొదలయ్యాయి. రెండు రోజుల క్రితం పెదకాకాని మండలం వైసీపీ అధ్యక్షుడు పూర్ణపై దాడి జరిగింది. ఈ దాడికి పాల్పడింది, ఎమ్మెల్యే కిలారి రోశయ్య వర్గం అని ఆరోపిస్తూ రావి వెంకట రమణ వర్గం ఆందోళన చేపట్టింది. దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ రావి వర్గం నేతలు పోలీస్ స్టేషన్ ని ముట్టడించారు. పార్టీ పరువు పజారున పడింది. ఈ క్రమంలో కిలారి రోశయ్య వర్గం అధిష్టానానికి ఫిర్యాదు చేసింది. గతంలో టీడీపీ నేతలకు లీకులిచ్చి.. కిలారిపై మట్టి మాఫియా అనే ఆరోపణలు చేయించింది కూడా రావి వర్గం అనే అనుమానాలున్నాయి. వీటన్నిటిపై అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్లడంతో క్రమశిక్షణా కమిటీ చర్యలకు సిఫారసు చేసింది. రావి వెంకట రమణను పార్టీనుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.