'బ్రో'ని వదిలేసి 'బాస్'పై పడ్డారు...
శ్యాంబాబు పాత్ర వల్ల ఇబ్బంది పడిన మంత్రి రాంబాబు కూడా ఈ ఎపిసోడ్ పై స్పందించారు. తమ్ముడివైపు కాకుండా చిరంజీవి ధర్మంవైపు నిలబడాలని కోరారు.
ఇటీవల ఏపీ రాజకీయాల్లో 'బ్రో' పెద్ద చర్చనీయాంశమైంది. శ్యాంబాబు పాత్రతో మంత్రి రాంబాబు హర్ట్ అయ్యారు. ప్రెస్ మీట్లు పెట్టి పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్శలు చేశారు, అసలు నీ రెమ్యునరేషన్ ఎంతో చెప్పు అంటూ డిమాండ్ చేశారు. మెల్ల మెల్లగా 'బ్రో' వ్యవహారం చల్లారిపోతుందనుకుంటున్న టైమ్ లో 'బాస్' ఎంట్రీ ఇచ్చారు. తమ్ముడిని సపోర్ట్ చేస్తూ, పరోక్షంగా వైసీపీ నాయకుల్ని టార్గెట్ చేస్తూ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. దీంతో ఈరోజు ఉదయం నుంచి వైసీపీ ఎదురుదాడి మొదలైంది. కొడాలి నాని, పేర్ని నాని, గుడివాడ అమర్నాథ్, బొత్స సత్యనారాయణ, ఫైనల్ గా అంబటి రాంబాబు.. చిరంజీవి వ్యవహారంలో కౌంటర్లిచ్చారు.
రాజకీయ నాయకులకు సుద్దులు చెప్పే ముందు, సినీ ఇండస్ట్రీలో ఉన్న పకోడీ గాళ్లకు చిరంజీవి మంచి మాటలు చెప్పాలన్నారు మాజీ మంత్రి కొడాలి నాని. ఆ తర్వాత పేర్ని నాని.. గిల్లుడు, ప్రతి గిల్లుడు అంటూ సెటైర్లు పేల్చారు. అనవసరంగా చిరంజీవి ఈ వ్యవహారంలో తలదూర్చారని, పవన్ వైపే తప్పు ఉందని అన్నారు. పిచ్చుక ఏంటి, బ్రహ్మాస్త్రమేంటి.. సినీ ఇండస్ట్రీని పిచ్చుకతో పోల్చడమేంటి అంటూ మంత్రి బొత్స సత్యనారాయణ రివర్స్ అటాక్ చేశారు.
గౌరవం ఉంది కానీ..!
ఇక చిరంజీవి అంటే తమకు గౌరవం ఉంది కానీ, ముందు ఆయన తమ్ముడికి హితబోధ చేయాలని సూచించారు మరో మంత్రి గుడివాడ అమర్నాథ్. రాజకీయ నాయకులపై సెటైర్లు వేస్తూ సినిమాలు తీస్తున్న తమ్ముడిని చిరంజీవి సరిదిద్దాలని కోరారు. చివరిగా శ్యాంబాబు పాత్ర వల్ల ఇబ్బంది పడిన మంత్రి రాంబాబు కూడా ఈ ఎపిసోడ్ పై స్పందించారు. తమ్ముడివైపు కాకుండా చిరంజీవి ధర్మంవైపు నిలబడాలని కోరారు. పోలవరం గురించి ప్రెస్ మీట్ పెట్టిన మంత్రి అంబటి రాంబాబు.. తర్వాత చిరంజీవి వ్యాఖ్యలపై పూర్తి స్థాయిలో స్పందిస్తానన్నారు. చిరంజీవి అంటే తనకు ప్రత్యేక గౌరవం ఉందని చెప్పారు.