ఆ విషయం చెప్పకుండా మోదీ పరార్ -బొత్స
జూన్ 4న ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని మోదీ కలలు కంటున్నారని.. ఆ కూటమి ఏపీలో అధికారంలోకి రాదని, బంగాళాఖాతంలో వస్తుందని ఎద్దేవా చేశారు బొత్స.
ప్రధాని మోదీ ఏపీ పర్యటన పేలవంగా సాగింది. మోదీ రాకతో ఊపు వస్తుందనుకున్న కూటమి శ్రేణులు డీలా పడ్డాయి. అటు వైసీపీకి కూడా విమర్శలకోసం వెదుక్కోవాల్సిన అవసరం లేకుండాపోయింది. మోదీ పర్యటన తర్వాత కూటమిపై విమర్శలకు మరింత పదును పెట్టారు వైసీపీ నేతలు. మోదీ వ్యాఖ్యలకు మంత్రి బొత్స సత్యనారాయణ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కనీసం మాట్లాడకుండానే.. మోదీ పరారయ్యారని ఎద్దేవా చేశారు బొత్స.
చంద్రబాబు వెన్నుపోటుదారుడని, పోలవరాన్ని ఏటీఎంలా వాడుకున్నారని గతంలో విమర్శించిన మోదీ. ఇప్పుడు అదే చంద్రబాబు హయాంలో ఏపీ టాప్ ప్లేస్ లో ఉందని చెప్పుకొచ్చారు. తిట్టిన నోటితోనే పొగడటం చంద్రబాబుకి అలవాటేనంటూ గతంలో సెటైర్లు పేల్చిన మోదీ.. ఇప్పుడు తాను కూడా అదే పని చేశారు. కేవలం జగన్ ని తిట్టడానికే మోదీ ఎక్కువ సమయం కేటాయించారు. జగన్ ప్రభుత్వంపై అవినీతి ముద్రవేసే ప్రయత్నం చేశారు. డబుల్ ఇంజిన్ తో అభివృద్ధి సాధ్యం అని అంటున్న ఆయన.. 2014లో ఏర్పాటైన డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఏం సాధించిందో చెప్పలేకపోయారు. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారి అవకాశం ఇచ్చి తెలుగు ప్రజలు మోసపోయారని, మరోసారి అలాంటి తప్పు చేయరని వైసీపీ నేతలు అంటున్నారు.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంతోపాటు.. ఏపీకి కేంద్రం నుంచి రావాల్సిన సాయంపై ప్రధాని నోరు మెదపకపోవడం విశేషం. ఆ హామీలపై ఆయన ఎందుకు స్పందించలేదని విమర్శించారు మంత్రి బొత్స సత్యనారాయణ. విశాఖ రైల్వేజోన్‌పై కూడా మోదీ అవగాహన లేకుండా మాట్లాడారని ధ్వజమెత్తారు. టీడీపీ తయారు చేసిన స్క్రిప్ట్ చదవడం మినహా, ప్రధాని సొంతగా ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు బొత్స. తప్పుడు మాటలు, అసత్యాలతో.. ప్రధాని పదవికి విలువ లేకుండా చేశారని మోదీపై మండిపడ్డారు. జూన్ 4న ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని మోదీ కలలు కంటున్నారని.. ఆ కూటమి ఏపీలో అధికారంలోకి రాదని, బంగాళాఖాతంలో వస్తుందని ఎద్దేవా చేశారు బొత్స.