Telugu Global
Andhra Pradesh

విరుచుకుపడుతున్న కోటంరెడ్డి.. మౌనంగా ఆనం.. కారణం ఏంటి..?

సడన్ గా కోటంరెడ్డి ఎంట్రీ ఇచ్చారు. వైసీపీకి గుడ్ బై చెప్పి నెల్లూరు రూరల్ సీటుకి టీడీపీ తరపున పోటీ చేస్తానంటున్నారు. దీంతో ఆనంకి నెల్లూరు రూరల్ సీటు విషయంలో పోటీ మొదలైంది.

విరుచుకుపడుతున్న కోటంరెడ్డి.. మౌనంగా ఆనం.. కారణం ఏంటి..?
X

ఇటీవల వైసీపీ ప్రభుత్వం ఇద్దరు రెబల్ ఎమ్మెల్యేలపై వేటు వేసింది. వారి స్థానాల్లో పార్టీ తరపున నియోజకవర్గ ఇన్ చార్జ్ లను పెట్టింది. వారితోనే అన్ని కార్యక్రమాలు నడిపిస్తోంది. ఎమ్మెల్యేల అధికారాలకు కత్తెర వేస్తూ అనధికారికంగా అందరికీ ఉత్తర్వులు వెళ్లిపోయాయి. అయితే ఈ జాబితాలో ఉన్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి మాత్రం ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ పై కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు చేశారు. తన బలం ఏంటి, తన వెంట ఎంతమంది ఉన్నారో.. అధిష్టానికి తెలియజేసేలా ప్రతి రోజూ ప్రెస్ మీట్ పెట్టి ధ్వజమెత్తుతున్నారు. మరి అదే స్థాయిలో ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేసిన మరో రెబల్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి మాత్రం మౌనంగా ఉన్నారు. కారణం ఏంటి..?

వాస్తవానికి కోటంరెడ్డికంటే ముందే ఆనంకి పొగ పెట్టింది వైసీపీ అధిష్టానం. గడప గడపకు వెళ్లొద్దని చెప్పేసింది, సమీక్షలు, సమావేశాలకు ఆయనకు ఆహ్వానాలు వెళ్లడంలేదు, సెక్యూరిటీ తగ్గించేశారు. దీంతో ఆయన నొచ్చుకున్నారు, వివిధ మండలాల్లో ఉన్న అభిమానుల్ని పిలిపించుకుని ఓ దఫా మాట్లాడారు. ఆ తర్వాత మళ్లీ సైలెంట్ అయ్యారు.

కోటంరెడ్డితోనే ఆనంకు చిక్కులు..

వైసీపీనుంచి బయటకు వచ్చి టీడీపీలో చేరి 2024 ఎన్నికల్లో నెల్లూరు రూరల్ లో పోటీ చేయాలనేది ఆనం అంతరంగం. అదే సమయంలో నెల్లూరు జిల్లాలోనే ఆత్మకూరు నియోజకవర్గంలో తన కుమార్తెను బరిలో దింపాలని అనుకున్నారు. ఈ రెండు టికెట్లకోసం ఆయన టీడీపీతో మంతనాలు జరుపారని సమాచారం. అయితే సడన్ గా కోటంరెడ్డి ఎంట్రీ ఇచ్చారు. వైసీపీకి గుడ్ బై చెప్పి నెల్లూరు రూరల్ సీటుకి టీడీపీ తరపున పోటీ చేస్తానంటున్నారు. దీంతో ఆనంకి నెల్లూరు రూరల్ సీటు విషయంలో పోటీ మొదలైంది. సహజంగా టీడీపీ అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే కోటంరెడ్డికే ప్రాధాన్యత ఇస్తుంది. ఆనంకి కావాలంటే మరో నియోజకవర్గం ఇస్తామని బుజ్జగిస్తుంది. లేదా ఇప్పుడున్న వెంకటగిరిలోనే ఆనంని పోటీకి దింపుతామంటుంది. ఇక్కడే ఆయన సందిగ్ధంలో పడ్డారు.

2019లో కూడా ఆయన బలవంతంగానే వెంకటగిరికి వచ్చారు. ఆ ఒక్క సీటు మినహా ఇంకేదీ ఇవ్వలేమని జగన్ స్పష్టం చేయడంతో అయిష్టంగానే అక్కడ పోటీ చేసి గెలిచారాయన. దీంతో నెల్లూరు సిటీ, రూరల్ పరిధిలో ఆనం కుటుంబానికి కాస్త పట్టు తగ్గింది. ఈసారయినా నగరంలో రాజకీయం చేయాలనేది ఆయన కోరిక. కానీ కోటంరెడ్డితో సమస్య వచ్చిపడింది. దీంతో ఆనం మౌనంగా ఉన్నారని అంటున్నారు.

కోటంరెడ్డి బహిరంగంగానే తాను టీడీపీలోకి వెళ్తానని చెబుతున్నారు. కానీ ఆనం అంత ధైర్యంగా తాను తెలుగుదేశానికి దగ్గరవుతానని అనడంలేదు. జనసేన అంటూ లీకులు కూడా వదులుతున్నారు. అంటే ఆయనకు పార్టీ విషయంలో ఇంకా క్లారిటీ లేదనే చెప్పాలి. ఈసారి ఆనం కుటుంబం జిల్లాలో రెండు టికెట్లు కోరుతోంది. టీడీపీ దానికి ఒప్పుకున్నా ఆనం కోరుకున్న నియోజకవర్గాలు ఇవ్వలేని పరిస్థితి. అందుకే మాజీ మంత్రి ఆనం దీర్ఘాలోచనలో పడ్డారు. నియోజకవర్గాలు ఫైనల్ అయితే మాత్రం ఆనం గేర్ మార్చి స్పీడ్ పెంచుతారు.

First Published:  11 Feb 2023 7:12 AM IST
Next Story