Telugu Global
Andhra Pradesh

రుషికొండ భవనాలపై వైసీపీ వివరణ..

దొరికిందే ఛాన్స్ అన్నట్టుగా టీడీపీ ప్రభుత్వం రుషికొండ విషయంలో ఎక్కడలేని రాద్ధాంతం చేస్తోంది. జగన్ పెద్ద తప్పు చేసినట్టు, దుబారా చేసినట్టు, ప్రజల సొమ్ము సొంతానికి వాడేసుకున్నట్టు చెబుతోంది. ఈ నిందల్ని కాచుకోవడం ఇప్పుడు వైసీపీకి కష్టంగా మారింది.

రుషికొండ భవనాలపై వైసీపీ వివరణ..
X

రుషికొండలో పెద్ద ప్యాలెస్ నిర్మించారు.. నిజమే

విశాలమైన గదులు, అత్యాధునిక ఫర్నిచర్ ఉన్నాయి.. నిజమే

మార్బుల్స్, ఇతర హంగులు ఆశ్చర్యపరిచేలా ఉన్నాయి.. అదీ నిజమే

అయితే ఏంటి..? అదేమీ జగన్ ఉండటానికి కట్టుకున్న ఇల్లు కాదు కదా. ప్రజా ప్రతినిధులు, రాజ్యాంగపరమైన పదవుల్లో ఉన్న వారు వచ్చినప్పుడు ఆతిథ్యమివ్వడానికి నిర్మించిన బంగ్లానే కదా అంటున్నారు వైసీపీ నేతలు. రుషికొండ భవనాలపై టీడీపీ రాద్ధాంతం చేస్తోందని మండిపడుతున్నారు.


వైసీపీ చేసిన తప్పేంటి..?

రుషికొండపై భవనాల్లో ఉన్న వసతులు, హంగులపై నిన్నటి నుంచి పెద్ద రాద్ధాంతం జరుగుతోంది. జనాలకు తెలియకుండా, రహస్యంగా ఈ బిల్డింగ్ లు కట్టారని, ఎన్నో అక్రమాలు చేశారని టీడీపీ నిందలు వేస్తోంది. సడన్ గా ఆ వీడియోలు బయటకు రావడంతో జనంలో కూడా ఏదో తెలియని ఆసక్తి నెలకొని ఉంది. దీంతో వైసీపీ వివరణ ఇచ్చుకోడానికి సతమతం అవుతోంది. బిల్డింగ్ కట్టడం వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పు కాదు, కానీ దాని గురించి టీడీపీ నేతలు వచ్చి బయటపెట్టేంత వరకు అక్కడ ఏముందో జనాలకు తెలియకపోవడం, అవి ఎందుకోసం, ఎవరికోసం అనే విషయాలను చూచాయగా అయినా బయటపెట్టకపోవడమే గత ప్రభుత్వం చేసిన మిస్టేక్. గతంలో ఆ తప్పు చేయకుండా ఉండి ఉంటే, ఇప్పుడు వివరణలకోసం ఇన్ని తిప్పలు పడాల్సిన అవసరం ఉండేది కాదు.

ఇక దొరికిందే ఛాన్స్ అన్నట్టుగా టీడీపీ ప్రభుత్వం రుషికొండ విషయంలో ఎక్కడలేని రాద్ధాంతం చేస్తోంది. సోషల్ మీడియా హోరెత్తిపోతోంది, జగన్ ఏదో పెద్ద తప్పు చేసినట్టు, దుబారా చేసినట్టు, ప్రజల సొమ్ము సొంతానికి వాడేసుకున్నట్టు చెబుతోంది. ఈ నిందల్ని కాచుకోవడం ఇప్పుడు వైసీపీకి కష్టంగా మారింది. అవి ప్రైవేటు భవనాలు కాదని, ప్రభుత్వ భవనాలని, గత ప్రభుత్వం వైజాగ్ కి ఇచ్చిన ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని ఆ భవనాలను నిర్మించారని, వాటిని ఎలా వినియోగించుకోవాలన్నది ప్రభు­త్వం ఇష్టం అని అంటున్నారు వైసీపీ నేతలు. అయితే ఈలోగా వైసీపీని, జగన్ ని టార్గెట్ చేస్తూ తీవ్ర దుష్ప్రచారం జరుగుతోంది.

First Published:  17 Jun 2024 8:00 AM IST
Next Story