పట్టభద్రులకు సంక్షేమ పథకాలు లేవు, అందుకే ఆ ఓట్లు మాకు పడలేదు
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లన్నీ టీడీపీవి కావని అన్నారు సజ్జల. పీడీఎఫ్, ఇతర వామ పక్షాలకు చెందిన ఓట్లే టీడీపీ వైపు మళ్ళాయన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై తొలిసారిగా వైసీపీ అధికారికంగా స్పందించింది. ఆ ఫలితాలు ప్రభుత్వ వ్యతిరేకతను ప్రతిఫలించవు అని క్లారిటీ ఇచ్చారు సజ్జల రామకృష్ణారెడ్డి. టీడీపీ సంబరాలు చేసుకోవటంతోనే అంతా అయిపోలేదన్నారు. ఈ ఫలితాలను తాము హెచ్చరికగా భావించడం లేదని చెప్పారు.
వారికి సంక్షేమ పథకాలు లేవు..
పట్టభద్రుల నియోజకవర్గం ఓటర్లు మొత్తం సమాజాన్ని ప్రతిబింబించే పరిస్థితి లేదని చెప్పుకొచ్చారు సజ్జల. అసలు ఒక వర్గం ఓటర్లను మొత్తానికి ఎలా ఆపాదిస్తారని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల పరిధిలో పట్టభద్రుల ఓటర్లు ఎక్కువగా లేరని చెప్పారు. అయితే యువతకు పెద్ద ఎత్తున రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ లు జారీ చేశామన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే లక్షా 30 వేల గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలు ఇచ్చామని, ఇటీవలే కానిస్టేబుల్ పోస్టులకు రిక్రూట్ మెంట్ మొదలు పెట్టామన్నారు.
ఆ ఓట్లు టీడీపీవి కావు..
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లన్నీ టీడీపీవి కావని అన్నారు సజ్జల. పీడీఎఫ్, ఇతర వామ పక్షాలకు చెందిన ఓట్లే టీడీపీ వైపు మళ్ళాయన్నారు. ఎన్నికలు జరిగిన స్థానాలు అన్నిటినీ కలిపి చూడాలని చెప్పారు. మొదటిసారి ఉపాధ్యాయుల స్థానాలు గెల్చుకున్నామని చెప్పిన ఆయన, టీచర్లు తమను బాగా ఆదరించారని చెప్పారు. తొలిసారి టీచర్ ఎమ్మెల్సీలు గెలవడం వైసీపీకి పెద్ద విజయం అన్నారు.