ఆయన ఫ్లవర్ స్టార్.. ఆ పార్టీ ‘కమ్మజన’ సేన
పవన్ అసెంబ్లీకి రావాలని ఉంటే ఎన్నికల వరకు ఆగటం ఎందుకని, కావాలంటే స్పీకర్ ని అడిగి రెండు పాస్ లు ఇస్తామని, వచ్చి అసెంబ్లీ చూసి వెళ్ళొచ్చంటూ ర్యాగింగ్ చేశారు వైసీపీ నేతలు.
జనసేన ఆవిర్భావ సభ తర్వాత వైసీపీ నుంచి ఘాటు రియాక్షన్లు వచ్చాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యంగా కాపు వర్గం నాయకులు పవన్ పై జోకులు పేల్చారు. ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్, పవర్ స్టార్ కాదని.. ఫ్లవర్ స్టార్ అంటూ కామెడీ చేశారు ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ. పవన్ మాటలన్నీ విడ్డూరంగా ఉన్నాయని అన్నారు. ఆ పార్టీకి జనసేన తొత్తుల పార్టీ అని పేరు పెట్టుకోవాలని సలహా ఇచ్చారు.
కమ్మజన సేన..
పవన్ పార్టీ పేరు జనసేన కాదని, కమ్మ జనసేన అని అన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్. పదేళ్ళ పాటు ఒక అజెండా లేకుండా నడిచిన పార్టీ జనసేన అని విమర్శించారు. పవన్ సభకు వచ్చిన కార్యకర్తలు చాలా అమయాకులు అని చెప్పారు. పవన్ కల్యాణ్ బంకర్ టు బందర్ అంటూ సెటైర్లు పేల్చారు. నెలన్నర రోజుల పాటు బంకర్ లో దాక్కుని బందరుకి బండేసుకొని వచ్చాడన్నారు. జెండా పవన్ ది అజెండా చంద్రబాబుదని ని ఆరోపించారు. అసెంబ్లీకి రావాలని ఉంటే ఎన్నికల వరకు ఆగటం ఎందుకని, కావాలంటే స్పీకర్ ని అడిగి రెండు పాస్ లు ఇస్తామని, వచ్చి అసెంబ్లీ చూసి వెళ్ళొచ్చంటూ ర్యాగింగ్ చేశారు. పవన్ కల్యాణ్ కి 175 స్థానాల్లో పోటీ చేసే ధైర్యం లేదన్నారు గుడివాడ.
అర్థరాత్రి మద్దెల దరువు..
పార్టీ పెట్టి మూసేశాడంటూ సొంత అన్ననే పవన్ కల్యాణ్ హేళన చేశారని అన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. తొడలు కొట్టాల్సిన అవసరం తమకు లేదన్నారు. రోజుకి రెండు కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నానని చెప్పే పవన్, పార్టీని నడిపేందుకు డబ్బుల్లేవు అనడం హాస్యాస్పదం అని చెప్పారు. నోరు తెరుస్తే కులం పేరుతో విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. పవన్ కు సంకల్పం, చిత్తశుద్ధి, నాయకత్వం ఉంటే తన లాంటి వాళ్లంతా ఆయన వెనకే ఉండేవారని, జగన్ వెంట ఎందుకు వెళ్తారని ప్రశ్నించారు. 2014 నుంచి పవన్ పచ్చిగా కాపు కులస్తులను పోగేసి కమ్మాయనికి ఊడిగం చేయిస్తున్నారని ఆరోపించారు. జనసేన ఆవిర్భావ సభ అర్థరాత్రి మద్దెల దరువు అంటూ వ్యాఖ్యానించారు. ఇకనైనా ముసుగులు వేసుకుని కాకుండా చెట్టాపట్టాలేసుకుని చంద్రబాబు, పవన్ కలిసి రావాలని సవాల్ విసిరారు.