Telugu Global
Andhra Pradesh

మహిళలపై దాడులు.. డిప్యూటీ సీఎం స్పందన ఏంటన్న వైసీపీ

వైసీపీ ప్రశ్నలు బాగానే ఉన్నా.. కూటమి నుంచి సమాధానం లేదు. నెటిజన్లు మాత్రం కోడుమూరు మాజీ ఎమ్మెల్యే సుధాకర్ ఉదంతాన్ని గుర్తు చేస్తున్నారు.

మహిళలపై దాడులు.. డిప్యూటీ సీఎం స్పందన ఏంటన్న వైసీపీ
X

ప్రభుత్వం మారినంత మాత్రాన అమాంతం నేరాలు తగ్గిపోతాయని అనుకోలేం. కొత్త డీజీపీ వచ్చినంత మాత్రాన దొంగతనాలు ఆగిపోతాయని, దౌర్జన్యాలు చేసేవారు హడలిపోతారని, వెనకడుగు వేస్తారని కూడా చెప్పలేం. అయితే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. నేరాలు, ఘోరాలకు ప్రభుత్వాన్ని విమర్శించిన టీడీపీ, జనసేన.. వారు అధికారంలోకి వచ్చాక జరుగుతున్న అఘాయిత్యాలకు ఎందుకు బాధ్యత వహించదని ప్రశ్నిస్తున్నారు వైసీపీ నేతలు. గతంలో మహిళల పక్షాన ఆవేశపూరిత ప్రసంగాలిచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇప్పుడేం చేస్తున్నారని నిలదీస్తున్నారు.

అసలేం జరిగింది..?

అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం కొప్పుగుండుపాలెంలో తొమ్మిదో తరగతి చదువుతున్న బాలిక దారుణ హత్యకు గురైంది. సురేష్ అనే యువకుడు కొంతకాలంగా ఆమెను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఆ వేధింపులు తట్టుకోలేక ఆమె కుమిలిపోయేది. ఎవరికి చెప్పుకోవాలో తెలియక తనలో తానే నరకం అనుభవించేది. తన ప్రేమను అంగీకరించలేదన్న కోపంతో ఆమెను అంతం చేయాలనుకున్నాడు సురేష్. ఏకంగా ఇంటికి వచ్చి కత్తితో నరికి చంపాడు. ఈ దారుణ ఘటన ఏపీలో సంచలనంగా మారింది. గతంలో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు వెంటనే ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు మొదలు పెట్టే పవన్ కల్యాణ్ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కదా, ఇప్పుడెందుకు స్పందంచడంలేదని వైసీపీ సూటిగా ప్రశ్నిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట మహిళలపై దారుణాలు జరుగుతున్నాయని వైసీపీ నేతలు అంటున్నారు.


వైసీపీ ప్రశ్నలు బాగానే ఉన్నా.. కూటమి నుంచి సమాధానం లేదు. నెటిజన్లు మాత్రం కోడుమూరు మాజీ ఎమ్మెల్యే సుధాకర్ ఉదంతాన్ని గుర్తు చేస్తున్నారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే తన ఇంట్లో పనిచేసే బాలికపై అఘాయిత్యం చేయడాన్ని ఆ పార్టీ సమర్థిస్తుందా..? అని ప్రశ్నిస్తున్నారు. వీడియో ఆధారాలు బయటపడిన తర్వాత కూడా సుధాకర్ ని సస్పెండ్ చేయకుండా కాలయాపన చేయడం దేనికి సంకేతం అని అడుగుతున్నారు. పిన్నెల్లిని పరామర్శించినట్టే, సుధాకర్ ని కూడా పరామర్శిస్తారా అని ఎద్దేవా చేస్తున్నారు. రాజకీయ విమర్శలు ఎలా ఉన్నా.. ఏపీలో మహిళలపై అఘాయిత్యాలు ఆగకపోవడం మాత్రం దురదృష్టకరం.

First Published:  7 July 2024 4:42 AM GMT
Next Story