ఉండవల్లిని వైసీపీ వాడుకుంటోందా..?
ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులిపై తీవ్ర ఆరోపణలు చేసిన కోటంరెడ్డి.. ఉండవల్లిని వైసీపీ వాడుకుంటోందని అన్నారు. వైసీపీ ట్రాప్ లో పడొద్దని, జాగ్రత్తగా ఉండాలని ఉండవల్లికి హితవు పలికారు.
ఏపీలో ప్రస్తుతం మార్గదర్శి - సీఐడీ విచారణ హాట్ టాపిక్ గా ఉంది. ఓవైపు రామోజీరావుపై వైసీపీ తీవ్ర ఆరోపణలు చేస్తుండగా, మరోవైపు ఆయనకు సపోర్ట్ గా మాట్లాడేవారు కూడా ముందుకొస్తున్నారు. ఓ ప్రైవేట్ కంపెనీపై సీఐడీ కేసు పెట్టిన వ్యవహారం ఏపీలో పొలిటికల్ హాట్ టాపిక్ గా మారడం విశేషం. ఈ విషయంలో ఇటీవల కేంద్రానికి పలు లేఖలు వెళ్లడం కూడా విశేషమే. కేంద్రం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని, ఏపీ ప్రభుత్వం దూకుడికి కళ్లెం వేయాలని రామోజీ రావు మద్దతుదారులు కోరుకుంటున్నారు. అటు వైసీపీ కూడా రామోజీరావుపై కేంద్రానికి ఫిర్యాదులు చేస్తోంది. అయితే కేంద్రం వైసీపీ నేతల మాటలు వినట్లేదని, అందుకే ఉండవల్లి అరుణ్ కుమార్ తో ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టించాలని ఆ పార్టీ ఆలోచిస్తోందని ఆరోపించారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఈ ప్రెస్ మీట్ కి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు అని అన్నారాయన.
రాజకీయ దళారి..
ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు.. ఉండవల్లిని ట్రాప్ లో పడేసే ప్రయత్నం చేస్తున్నారని, ఆయనతో ప్రెస్ మీట్ పెట్టించబోతున్నారని అన్నారు ఎమ్మెల్యే కోటంరెడ్డి. సీతారామాంజనేయులికి రాష్ట్రం మొత్తం నెట్ వర్క్ ఉంటే, తనకు ఆయన వద్ద కూడా నెట్ వర్క్ ఉందని చెప్పారు. ఆయన ఎత్తుగడలన్నీ తనకు తెలుసని చెప్పారు. ఆయన ఓ రాజకీయ దళారి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
గతంలో తన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులిపై తీవ్ర ఆరోపణలు చేశారు ఎమ్మెల్యే కోటంరెడ్డి. తనకు సెక్యూరిటీ తగ్గించి వేధించాలని చూశారని, తనతోపాటు ఇతర ఎమ్మెల్యేలపై నిఘా పెట్టారని అన్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ పై నిఘా పెట్టి.. వారి కార్యక్రమాలకు అడ్డు తగులుతున్నారని, తన విధుల్ని పక్కనపెట్టి.. ప్రతిపక్షాలను దెబ్బకొట్టాలని చూస్తున్నారని చెప్పారు. సీఎం జగన్ మెహర్బానీ కోసమే ఆయన ఇలాంటి పనులు చేస్తున్నారన్నారు. ఆయనకింకా 6 నెలలే సమయం ఉందని, ఇలాంటి వ్యవహారాలన్నీ ఇక కట్టి పెట్టాలని హితవు పలికారు. ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులిపై తీవ్ర ఆరోపణలు చేసిన కోటంరెడ్డి.. ఉండవల్లిని వైసీపీ వాడుకుంటోందని అన్నారు. వైసీపీ ట్రాప్ లో పడొద్దని, జాగ్రత్తగా ఉండాలని ఉండవల్లికి హితవు పలికారు.